"నిజమైన గురువనేవాడు ఎక్కడైనా ఉంటే, ముందుగా తననుంచి నిన్ను విముక్తుణ్ణి చేస్తాడు" - యూజీ

5, అక్టోబర్ 2012, శుక్రవారం

ఓషో ఉత్తరాలు-16

ప్రేమాశీస్సులు 
ధ్యానసమ్మేళనం నుంచి వచ్చాక మళ్ళీ వెంటనే ఊరు వదలి వెళ్ళవలసి వచ్చింది. నిన్న రాత్రే తిరిగి వచ్చాను. కానీ నీ గురించే ఆలోచిస్తూ ఉన్నాను.

భగవంతుని పట్ల నీకళ్ళలో కనిపించిన తపనను, సత్యం పట్ల నీ గుండెలో ఉన్న తీవ్ర ఆకాంక్షనూ, నేను మరచిపోలేకున్నాను. ఇది ఒక వరం. ఈ దారిలోనుంచి నడవకుండా ఎవరూ గమ్యాన్ని చేరలేరు అన్న విషయం మరువకు.

వెలుగూ ప్రేమా కలిస్తే దానినే దైవం అంటాము.వెలుగునూ ప్రేమనూ చేరడానికి కావలసిన అర్హత తపన మాత్రమే అన్న విషయం గుర్తుంచుకో. ప్రేమకు అవధులు లేనప్పుడు దాని వెలుగు పొగలేని జ్వాలలా దివ్యంగా ఉంటుంది.అటువంటి పరిణతికి దారితీసే మూలాలను నీలో చూచాను.ఆనందం కలిగింది. 

విత్తనం నీలో ఉంది. అది వృక్షంగా మారాలి. అలా మారే సమయం దగ్గరలోనే ఉన్నట్లుంది. కానీ, ధ్యానాభ్యాసం లేకుండా భగవత్ ప్రాప్తి ఎన్నటికీ కలుగదు. కనుక గొప్ప ధైర్యం తోనూ పట్టుదలతోనూ నీవు ఆ దిశగా ప్రయత్నం మొదలు పెట్టాలి. నీ మీద నాకు ఎన్నో ఆశలున్నాయి. వాటిని తీర్చగలవా నీవు?

మన మిత్రులందరినీ అడిగినట్లు చెప్పు.నీఉత్తరం కోసం ఎదురు చూస్తుంటాను.
-------------------------------------------------  
చాలా నెలల వ్యవధి తర్వాత మళ్ళీ ఓషో ఉత్తరాల గురించి వ్రాస్తున్నాను. ఎందుకంటే ఇవి నా భావాలకు చాలా దగ్గరగా ఉంటాయి. ఇవి వ్రాస్తుంటే నా మాటలు నేనే వింటున్నట్లు ఉంటుంది.నా ముఖం నేనే అద్దంలో చూచుకున్నట్లు అనిపిస్తుంది. కొద్దిమంది మహనీయులు తప్ప, ఈ స్థాయిలో నాతో మాట్లాడే మనుషులు నాకింతవరకూ ఎవరూ తారసపడలేదు. అలాంటి వారు లేనపుడు,ఒక ఎడారిలో నడుస్తున్న ఒంటరి యాత్రికునిలా ఉంటుంది  పరిస్తితి. ఎటుచూచినా ఎండతప్ప ఇంకేమీ కనిపించని ఈ లోకమనే ఎడారిలో ఇలాంటి భావాలే ప్రస్తుతానికి మనకు దాహశాంతిని చేకూర్చే సెలయేళ్ళు. అందుకే మళ్ళీ ఈ ప్రయత్నం.

నిజమైన గురువు శిష్యుని అమితంగా ప్రేమిస్తాడు. శిష్యుడు తనను ఎంతగా ప్రేమిస్తాడో అంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువగా సద్గురువు శిష్యుని ప్రేమిస్తాడు. అతన్ని గురించి నిరంతరం ఆలోచిస్తాడు.శక్తివంతములైన తన భావవిహంగాల రెక్కల కింద అతనికి రక్షణ కల్పిస్తాడు.అదే విషయాన్ని ఓషో కూడా ఈ ఉత్తరంలో ప్రస్తావిస్తాడు. 'నీ గురించే ఆలోచిస్తూ ఉన్నాను' అన్న మాటలో ఇదే భావం ద్యోతకమౌతుంది.

సాధకునికి ఉండాల్సిన అర్హతలను ఈ ఉత్తరంలో ఓషో నొక్కిచెబుతాడు. దైవాన్ని చేరాలన్న తపనా,సత్యాన్ని తెలుసుకోవాలన్న ఆకాంక్షా మాత్రమె సాధకునికి ఉండవలసిన అర్హతలు. మిగతావేవీ అర్హతలు కావు. అడ్డంకులూ కావు.ఈ ప్రయాణంలో కులమూ మతమూ జాతీ వయసూ లింగభేదాలూ ఇవేవీ అడ్డురావు.నిరంతరమూ జ్వలిస్తున్న తపనా,ఆకాంక్షలే మనిషికి నిజమైన అర్హతలు.వాటిముందు ఇతర అడ్డుగోడలన్నీ కూలిపోక తప్పదు. నిజమైన గురువులందరూ చెప్పింది ఇదే.నిజమైన ప్రవక్తలందరూ ఘోషించినది కూడా ఇదే.

ఈ తపనా ఆకాంక్షలు మనిషిని నిప్పుల్లో నడిపిస్తాయి.జీవనమనే నదికి ఎదురీదేలా చేస్తాయి.ఇది అనుక్షణం సంఘర్షణతో కూడిన ప్రయాణం. తనలోని అనేక తానులతో తానే చేసే నిరంతర యుద్ధం.ఇదొక నరకం.ఈ దారిలో నడిచేవానికే ఇదేమిటో అర్ధమౌతుంది.ఇతరులకు అర్ధం కాదు.ఎంత నచ్చకపోయినా ఇక్కడ నడక మాత్రం తప్పదు.'నరకంలోనుంచే స్వర్గానికి దారి ఉన్నది' అని అన్ని మతాలూ చెబుతాయి.సాధనా మార్గంలో మనిషి పడే నిత్యసంఘర్షణే ఈ నరకం.ఇది అనుభవిస్తేనే కాని దాని ఆవల ఉన్న స్వర్గమనే మోక్షాన్ని మనిషి అందుకోలేడు.ఈ దారిలో బైపాసులూ షార్ట్ కట్లూ ఉండవు.ఇక్కడ ఎవరైనా సరే నిప్పుల్లో నడవవలసిందే.కాళ్ళు కాల్చుకోవలసిందే.

దైవం అంటే,అవధులు లేని వెలుగూ ప్రేమా అన్న నిర్వచనం సత్యమైనది.అది చిదానందస్వరూపం.ప్రతి మనిషిలోనూ ఈ వెలుగూ ప్రేమా విత్తనాలవంటి స్తితిలో ఉన్నాయి. అవి మొలకెత్తి, ఆ మొక్క పెరిగి పెద్దదై ఒక మహావృక్షంగా మారాలి. ప్రస్తుతం చిరుదివ్వెలా మిణుకు మిణుకుమంటున్న ఆ వెలుగు పెరిగి పెద్దదై విశ్వం మొత్తాన్ని ఆక్రమించాలి. అప్పుడే మనిషి పయనం పరిసమాప్తి అవుతుంది.

పరిమితులతో కూడిన ప్రేమ,పొగతో కూడిన జ్వాల వంటిది.పరిమితులు లేని ప్రేమ,పొగలేని జ్వాల లాంటిది.దాని వెలుగు అతి మనోహరంగా ఉంటుంది.దాని మూలాలు ప్రతి మనిషిలోనూ ఉన్నాయి.విత్తనంగా ఉన్న  ఈస్తితి మహావృక్షంగా మారడం అనేది పరిపక్వతవల్లే కలుగుతుంది. అటువంటి పరిపక్వత సాధన వల్లే వస్తుంది.

ధ్యానసాధన చెయ్యకుండా ఎవరూ దైవాన్ని పొందలేరు.అది అసాధ్యం. సాధన లేకుండా సాక్షాత్కారాన్ని ఆశించడం అనేది,ఉన్నచోటినుంచి కదలకుండా ఊరుమొత్తం తిరగాలని ఆశించడం లాంటిది.అది ఎన్నటికీ జరిగే పని కాదు.దైవానుభూతి బౌద్ధికమైన అవగాహన కాదు.అదొక అనుభవం.కనుక దైవసాక్షాత్కారానికి ధ్యానసాధన తప్పని సరి.అయితే ఆ సాధనకు ఎంతో ధైర్యం కావాలి.ఎంతో పట్టుదల కావాలి.ధ్యానానికి ధైర్యంతో పని ఏముంది?ఊరకే కళ్ళుమూసుకుని కూచోడానికి ధైర్యం,పట్టుదలా ఎందుకు?అని చాలామంది అనుకోవచ్చు.అందులో దిగినవారికే ఈమాటలలోని సత్యం అర్ధమౌతుంది. ఊరకే చదివేవారికి అర్ధం కాదు.

బాహ్యప్రపంచంలో అయితే ఇతరులతో కొట్లాడటం పరిస్తితుల్ని ఎదిరించి నెగ్గుకు రావడాలే ధైర్యం అనుకుంటాం. ఈ సూత్రం అంతరిక ప్రపంచంలో కూడా వర్తిస్తుంది. కాని అక్కడ పరిస్థితులు వేరుగా ఉంటాయి. అక్కడ ఇతరులెవరూ ఉండరు. ఆ యుద్ధం తనతో తానే చెయ్యాలి. తనను తానే మార్చుకోవాలి. నిరంతరఎరుక అనే ఉలితో తనను తానే చెక్కుకోవాలి. తనలోని కలుపు మొక్కలను పెకలించి అవతల పారెయ్యాలి. దానికి ముందు,తనలో ఏవి కలుపు మొక్కలో, వాటిని ఎలా తొలగించాలో తెలుసుకోవాలి. ఇదంతా ఒక పెద్ద ప్రాసెస్.ఈ ప్రాసెస్ కు తలోగ్గడానికే ముందుగా ఎంతో ధైర్యం కావాలి. ముందుకు రావడానికే ఎంతో సంసిద్ధత కావాలి.అలా వచ్చిన తర్వాత ఈ యుద్ధాన్ని కడదాకా కొనసాగించడానికి ఎంతో పట్టుదల ఉండాలి.ఇది ఒక్కరోజులో అయిపోయే యుద్ధం కాదు.ఒక జీవిత కాలం పట్టవచ్చు.ఇంకా ఎక్కువ సమయంకూడా పట్టవచ్చు.అందుకే ఎవరైనా మాటలు మాత్రమే  చెబుతారు గాని సాధన చెయ్యలేరు. వదలని స్వార్ధపరతే దీనికి కారణం. 

చాలామంది సాదకులమని అనుకునేవారు కూడా మనోరాజ్యంలో కలల్లో విహరిస్తూ అదే సాధన అని భ్రమించేవారు ఎక్కువమంది ఉంటారు. అసలు నిజమైన సాధన అంటే ఏమిటి అని తెలుసుకునే సరికే మనిషి జీవితం సగభాగం అయిపోతుంది. తర్వాత అసలు తానెందుకు ఇంత బాధ పడాలి? అందరిలా తానూ సుఖంగా కాలక్షేపం చెయ్యవచ్చు కదా? అన్న భావాలనుండి  తనకుతాను నచ్చచెప్పుకునేసరికి మిగిలిన జీవితం కాస్తా అయిపోయి మరణం ఎదురుగా నిలిచి వెక్కిరిస్తూ ఉంటుంది. ఇక సాధన చేసేదేప్పుడు? గమ్యాన్ని చేరేదేప్పుడు? 

చాలామంది సాధకులలోకూడా,నిజమైన సాధన చేసేవారు బహుతక్కువమంది ఉంటారు.ఎందుకంటే మనిషి భ్రమల్లో బతకడాన్నే ఇష్టపడతాడు.సూర్యకాంతి లాంటి సత్యాన్ని చాలామంది ముఖాముఖి చూడటానికి ఇష్టపడరు.వాళ్ళు సూర్యకాంతిని తట్టుకోలేని డ్రాకులా వంటి వారు.మనుషుల్లో 99% శాతం డ్రాకులాలే.ఎందుకంటే వారు సత్యమనే సూర్యకాంతిని ముఖాముఖీ చూడలేరు.అలా చూడడానికి వాళ్ళ మనసులే వాళ్లకు అడ్డు వస్తాయి.కనుక గబ్బిలాలవలె చీకటిలోనే వారిబతుకులు తెల్లారిపోతుంటాయి.కాని ఏడ్రాకులాకూడా తాను డ్రాకులాను అని ఒప్పుకోడు. అదే వింతల్లోకేల్లా వింత.దీనికి కారణం అహంభావం.

ప్రతి గురువుకూ శిష్యుని మీద ఎన్నో ఆశలుంటాయి. తనను మించి తన శిష్యుడు ఎదగాలనీ, తాను అందుకోలేక పోయిన శిఖరాలను తన శిష్యుడు అందుకోవాలనీ ప్రతి సద్గురువూ ఆశిస్తాడు. కాని ఆ ఆశలను నేరవేర్చగలిగే శిష్యులు ఎందరున్నారు? అందరూ మొదట్లోనే జారిపోయేవారే గాని చివరివరకూ గురువు చూపిన మార్గంలో నడిచేవారు ఎందరుంటారు? ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే ఆ పని చెయ్యాలంటే ముందుగా తమతమ స్వార్ధపూరిత ముసుగుల నుంచి బయటపడాలి. దీనికి ఎంతో ధైర్యమూ, త్యాగమూ, సంసిద్ధతా కావాలి.అవి ఎవరికీ ఉండవు.అందుకే మాటలు చెప్పేవారు కోకొల్లలుగా దొరుకుతారు. కాని ఒక్క అడుగు ముందుకు వేసేవారు ఎవరూ ఉండరు. కాని సద్గురువులకు విసుగు అనేది ఉండదు. అలాంటి వారికోసం సద్గురువులు చకోరపక్షుల్లా ఎదురు చూస్తూనే ఉంటారు. వారున్నంతవరకూ నిరంతరం లోకాన్ని ఉత్తెజపరుస్తూనే ఉంటారు. 

అయితే ఆ పిలుపును వినేవారెవ్వరు?తమను బంధించిన సంకెళ్ళను తెంచుకుని ముందుకు నడిచేవారెవరు? నిజమైన త్రికరణ శుద్ధితో గురువు చూపిన మార్గంలో అడుగులు వేసేవారెవరు?ఎవరూ లేరు.ఒకవేళ ఉంటే ఎక్కడో కోటికి ఒకరో ఇద్దరో ఉంటారు. అయినా సరే పరవాలేదు.అలాంటి వారికోసమే సద్గురువుల వెతుకులాట సాగుతుంది.ఆ ఒకరికో ఇద్దరికో సత్యం సాక్షాత్కరిస్తే చాలు. అంతవరకూ సద్గురువుల ప్రయత్నం నిరంతరం ఇలా కొనసాగుతూనే ఉంటుంది.

వారి సొంత ప్రయాణం ఎప్పుడో ముగిసింది. కానీ ఇతరులకు దారిచూపే వారి ప్రయత్నం మాత్రం సాగుతూనే ఉంటుంది. అదే వారి సహానుభూతికీ కరుణకూ  సంకేతం.