“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

10, సెప్టెంబర్ 2012, సోమవారం

ఒమర్ ఖయ్యాం జాతకం -5 (తాత్విక చింతన)

తాత్వికులనూ,యోగులనూ అర్ధం చేసుకోవడం కష్టం. ఎందుకంటే వారి ఆలోచనాస్థాయి వేరుగా ఉంటుంది. ఒక విషయాన్ని వారు చూచేవిధానం, మామూలు మనుషులు చూచే విధానానికి భిన్నంగా ఉంటుంది. లోకం దృష్టిలో ఎంతో విలువైనది వారి దృష్టిలో చెత్తగా ఉంటుంది. లోకం దృష్టిలో పనికిరానిది వారికి ఎంతో విలువైనదిగా కనిపిస్తుంది.వారివారి దృక్పధాలలోని తేడాలవల్ల ఒకే విషయం వారికి అలా వేర్వేరుగా అనిపిస్తుంది.

ఖయ్యాం ఎంతసేపూ భోగానుభవం గురించే చెప్పలేదు.గహనమైన తాత్విక విషయాలు కూడా అతను చర్చించాడు. అవేమిటో ఈ పోస్ట్ లో చూద్దాం.

మనిషి జీవితమంతా అనవసర విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం లోనే గడిచిపోతుంది. నిజంగా అవసరమైన విషయాలంటే ప్రతిమనిషికి ఎంతో భయం. అందుకే వాటిని మూసిపెట్టి ఉంచుతాడు. తెలీనట్లు నటిస్తాడు. ఉష్ట్రపక్షి ఇసుకలో తలదూర్చి తనకే ప్రమాదమూ లేదని అనుకుంటుంది. అలాగే మనిషి లోకవ్యవహారాల్లో మునిగి తాను శాశ్వతంగా ఇక్కడే ఉంటానన్న భ్రమలో ఉంటాడు. కానీ అతని నాటకానికి ఉన్నట్టుండి ఒకరోజు తెరపడిపోతుంది.

తనచుట్టూ అందరూ పోతున్నాకూడా తానుమాత్రం పోను అనుకోవడమే ప్రపంచంలో కెల్లా పెద్దవింత అని ధర్మరాజు ఒక యక్షప్రశ్నకు సమాధానంగా చెబుతాడు. తన బతుకు అనిత్యం అని ఏ మనిషీ ఒప్పుకోలేడు. కానీ,అలా గుర్తించడమే ఆధ్యాత్మికతకు తొలిమెట్టు. దీనిని ఒప్పుకోలేరు కనుకనే జనం ఆధ్యాత్మికతను అందుకోలేరు. అంతరిక జీవితంలో మొదటి అడుగును కూడా అందుకే ఎప్పటికీ వెయ్యలేరు. అసలు,మనిషి బ్రతుకే ఒక దొంగనాటకం.ఈ లోకంలో ప్రతివాడూ ఒక దొంగే.కొందరు కనిపిస్తారు.కొందరు కనిపించరు. అంతే తేడా.

ఖయ్యాం తన కవితలలో జీవితపు అనిత్యత్వాన్ని మళ్ళీమళ్ళీ నొక్కి చెబుతాడు.జీవితపు అనిత్యత్వం అనేది అతని రుబాయత్ లో అంతస్సూత్రంగా కనిపిస్తుంది. అంతా మట్టే అని ఎన్నోసార్లు ఉదాహరణలతో నిరూపిస్తాడు. పూవు రాలినట్లు జీవితం కూడా ఒకనాడు రాలిపోతుంది అని చెబుతాడు.మనిషి నిత్యసహచరుడు మరణమే అన్న సత్యాన్ని వక్కాణిస్తాడు. ఎందుకంటే స్నేహితులు బంధువులు నమ్మినవారు ఎవరేవరు తనను అర్ధాంతరంగా వదిలిపెట్టిపోయినా, మనిషిని వదలకుండా నీడలా వెన్నంటి చివరివరకూ ఉండేది మరణం ఒక్కటే. అందుకే దానిని మించిన స్నేహితుడు మనిషికి లేడు. యోగుల నిత్యస్నేహితుడు మరణమే. ఎట్టి స్తితిలోనూ అతడు మనలను వదలిపోడు. ఇదే మాట ఖయ్యాం కూడా చెబుతాడు.

అయయో ఎందరి మానవోత్తముల కంటాంకురముల్ ద్రుంచె ని
ర్దయమౌ కాలము, యౌవనంబు, తను సౌందర్యంబు లావణ్య మ
వ్యయమై నిల్చునె? ఎన్ని ఎన్ని కసుగాయల్ రాలేనీ నేల; నా
రయలేదో  విరబూయకే యురలి వ్యర్ధంబైన లేమొగ్గలన్

ఎంతమంది కుత్తుకలను ఈ కాలమనేది ఉత్తరించిందో కదా? అందము యౌవనము, లావణ్యము ఇవన్నీ శాశ్వతంగా ఉంటాయా? సాధ్యమేనా? ఎన్నెన్ని లేతమొగ్గలు విరియకుండానే నేలరాలిపోయాయో నీకు తెలుసా? అని ప్రశ్నిస్తాడు.

కాలానికి దయలేదు. సమయం వచ్చినపుడు రాజనీ పేదనీ అది దయతలచదు.దేనికోసమూ ఆగదు.తుఫానులా వచ్చి మనిషిని తీసుకుపోతుంది. మనుషులు వేటిని చూచుకుని విర్రవీగుతూ ఉంటారో ఆ అందమూ, యవ్వనమూ ఇవేవీ శాశ్వతం కావు.మహామహాసుందరీమణులే కాలక్రమేణా ముసలివగ్గులై అనాకారులయ్యారు. అంతెందుకు. యవ్వనాన్ని అందుకోకుండానే పసిమొగ్గలు ఎందరు పరలోక ప్రయాణం కట్టారో నీకు తెలుసా? మరెందుకు ఈరోజుండి రేపు పోయేవాటిని చూచుకొని నీకు ఈ గర్వం? ఇది తెలివితక్కువతనం కాదా?   

ఖయాం అతి సున్నితహృదయుడు. పచ్చికమీద కూడా గట్టిగా కాలు పెట్టలేడు.ఎందుకంటే, గతించిన అనేకమంది అప్సరసలు ఆ పచ్చికలో అతనికి కనిపిస్తారు. తన కాలికి గుచ్చుకొన్న ముల్లులో కూడా ప్రేయసి ముంగురులను అతడు తిలకిస్తాడు. పువ్వును అతడు కోయలేడు. ఎందుకటే అందులో ప్రేయసి మోమును అతడు వీక్షిస్తాడు. అది నేలరాలితే అతడు కన్నీటి పర్యంతం అవుతాడు.

'నడుస్తున్నపుడు నీ కాలికి గుచ్చుకొన్న ముళ్ళు, ఒకప్పటి నీ ప్రేయసి మోమున అలవోకగా ఎగిరిన ముంగురులేమో? ఆ లేత పచ్చిక మీద మోటుగా కాలు పెట్టకు. అది ఒకప్పటి సుందరి మట్టిలో కలిసిన తర్వాత అక్కడ చిగిరించిన పచ్చిక కాదా? జాగ్రత్తగా చూడు' అంటాడు. లోకంలోని ప్రతిదీ అతనికి అద్భుతంగా తోస్తుంది. సౌందర్య రసాస్వాదనలో అతడు మైమరచి ముగ్దుడౌతాడు.పసిపిల్లవానివలె ప్రతిదాన్నీ వింతగా వీక్షిస్తాడు.

జల జల మంజులార్భటుల జాల్కోను నీ సెలఏటి కోనలన్
మొలచిన లేత పచ్చికల మోటుగ కాలిడబోకు దేవదూ 
తల రుచిరాధర ప్రక్రుతిన్ దాల్చేనో సుందర మందగామినీ
లలిత శరీర మృత్కణములన్ జిగిరించేనో యేమొ కోమలీ 

ఖయ్యాం యొక్క నిశితదృష్టికి తోటలో పూచిన ఎర్రని పూలరంగు 'పూర్వ నృపాలుర రక్తకణాల నుండి' వచ్చినట్లు తోస్తుంది. పూలరేమ్మలలో అక్కడక్కడ కనిపించే నల్లని రంగులో 'చెలియ నిగారపు తళుకు చెక్కులనేలిన పుట్టుమచ్చ' కనిపిస్తుంది. ప్రకృతిమొత్తం జీవంతో నిండి తొణికిసలాడుతూ అతనికి దర్శనమిస్తుంది.

ఖయ్యాం మంచి భావుకుడు. ప్రకృతి ఒడిలో ప్రేయసి కౌగిలిలో కరిగి శూన్యంలో లీనమై తన అస్తిత్వాన్ని కోల్పోవాలని కోరుకుంటాడు. అదే అతని ధ్యానం. అదే అతని యోగం. యోగులు అందుకునే సమాధిని ఈ విధంగా అతనూ అందుకోవాలని చూస్తాడు. ఈ క్రింది పద్యంలో అలాంటి ఒక చక్కని భావాన్ని పలికిస్తాడు.

తారా శుక్తులు రాల్చినట్టి జిగి ముత్యాలట్లు పూరేకులన్ 
జారె సన్నని మంచు తుంపురులు; వాసంతోదయ శ్రీకి గాం
తారత్నం బనువైన నేచ్చేలిగ నుద్యానంబునం దోచె మి
త్రా, రారమ్ము సుఖింపు, మీయదను వ్యర్ధంబైన రాదెన్నడున్

'నక్షత్రాలనుంచి రాలిపడిన ముత్యాలలాగా పూరేకులలోనుండి సన్నని మంచుతుంపురులు జాలువారుతున్నాయి.వసంతంతో పులకిస్తున్న ప్రకృతికి అనువైన నేచ్చేలిగా నా ప్రేయసి కనిపిస్తున్నది. ఆలస్యం చేయకు. సుఖాన్ని ఆస్వాదించు. తప్పులేదు ' అన్న భావం ఒక భావుకుడైన వానికే హృదయంలో పెల్లుబుకుతుంది. ఇలాంటి సున్నిత భావప్రపంచంలో విహరిస్తూ అతడు తన కాలాన్ని వెళ్ళబుచ్చుతాడు.
    
కాని, ఎంతటి సున్నిత మనస్కులనైనా కాలం ఎల్లకాలం దయతలచదు. వారి మురిపెం కూడా మూన్నాళ్ళే. తర్వాత వారు కూడా కాలం చేతిలో చెంపదెబ్బలు తినవలసిందే. కన్నీరు పెట్టవలసిందే. ఈ లోకంలో ఏదో కారణాన ఏడవని వారెవ్వరు? క్రమేణా ఖయ్యాంకి కూడా జీవితంలో కష్టాలు మొదలయ్యాయి. అతన్ని అభిమానించిన స్నేహితులు, ఆదరించిన రాజులూ ఒక్కొక్కరే గతించసాగారు. 'మనమున కేక్కినట్టి యభిమానులు మిత్రులు జేల్లినారు' అంటూ బాధపడతాడు. జీవితం నిస్సారంగా తోస్తుంది. ఈ బ్రతుకు వృధా అని తలుస్తాడు. 'జీవితంబను సరకంబునందు నడుగంటె మధూళియు' అని విలపిస్తాడు.  

'ఇలను రాకపోకల నాకు స్వేచ్చయున్న రాకయుందును వచ్చిన బోకయుందు' అనుకుంటాడు. అసలు ఈ ప్రపంచంలోకి రావడమెందుకు? సరే వచ్చాను. మళ్ళీ పోవడమెందుకు? ఏమిటీ వృధా ప్రయాస? అని తనను తానే ప్రశ్నించుకుంటాడు. 

'ఇలాంటి సృష్టిని ఈ దేవుడు ఎందుకు చేసినట్లు? ఎక్కడో నిద్రలో ఉన్న నన్ను నిద్రలేపి నాకొక రూపాన్నిచ్చి అతిసుందరమైన ఈ లోకంలోకి ఎందుకు తెచ్చినట్లు? స్పందించే హృదయాన్ని ఎందుకు నాకు ఇచ్చినట్లు? మంచి ఆనందాస్వాదనలో ఉండగా హటాత్తుగా తెరవేసి ఇక్కణ్ణించి ఎక్కడికో తెలియనిచోటికి లాక్కుపోవడం ఎందుకు? ఏమిటీ నాటకం? అసలెందుకిదంతా?' అని బాధపడతాడు.

'వీలుపడునేని ఈ పాడునేలయండు ఉనికి పుట్టువు చావు లేకున్న మేలు.' అన్న పద్యపాదంలో ఒక నిగూఢమైన యోగార్ధాన్ని ప్రతిపాదిస్త్తాడు. 'అస్థితి నుండి స్థితిలోకి రానేకూడదు. ఆ తర్వాత ఈ లోకంలోకి అసలే రాకూడదు. సరే ఒకసారి వచ్చాక ఇక పోకూడదు. ఇదేంటి ఈ అనవసరపు గోల?' అని ఒక నిత్యసిద్దునివలె ప్రశ్నిస్త్తాడు.

మును నే నస్తితి నిద్రనుండ నిలకుం బోద్రోలి దుఃఖంబులం 
దను సౌఖ్యమ్బుల నందజేసి మరలం దర్జింతు వౌరౌర పా
పిని శిక్షింతు నటంచు నీ చతురతన్ వేనోళ్ళ గీర్తింతు రీ 
వినయార్తుల్; మరి శిక్ష కర్హుడవు నీవే కావే లోకేశ్వరా?

'నేనేక్కడనుంచి వచ్చానో నాకు తెలియదు. ఎక్కడో నిద్రలో ఉన్న నన్ను తెచ్చి ఈలోకంలో పడవేశావు. దుఖాలనూ సుఖాలనూ అందజేశావు. అనుభవిస్తున్నాను. సుఖాలిచ్చేదీ నీవే, అనుభవిస్తుంటే 'పాపివి నీకు శిక్ష తప్పదు' అనేదీ నీవే. ఇదెక్కడి న్యాయమయ్యా? నీ దొంగభక్తులు నీకు స్తోత్రాలు చేస్తుంటారు. నేనలా చెయ్యను.నికార్సైన నా అభిప్రాయం చెప్పమంటావా? అసలు శిక్ష అంటూ వేస్తె నీకే వెయ్యాలి. ఎందుకంటే ఈ నాటకానికి కర్తవు నీవే కదా మరి?' అంటాడు.

అంతరంగ భక్తులైనవారు దైవంతోనే పోట్లాడతారు.ఆయనమీద అలుగుతారు. విసుక్కుంటారు. ఆయన్ను విమర్శిస్తారు. మామూలు భక్తులకు ఇదంతా అపరాధంగా పాపంగా తోస్తుంది.కాని దైవానికి ఇదే ఇష్టం. తనతో అలా చనువుగా మెసలే భక్తులంటేనే ఆయనకు మహాప్రీతి. తనతో దేబ్బలాడే వారంటేనే ఆయనకు ప్రేమ. ప్రేమ ఉన్నచోటే చనువు ఉంటుంది. చనువు ఉన్నచోట మర్యాదలు దూరాలు మాయమౌతాయి. పోట్లాట తప్పనపుడు చెత్తమనుషులతో ఎందుకు? దైవంతోనే పోట్లాడటం మంచిది. బలహీనుడితో పోరాడి గెలిస్తే మజా ఏముంటుంది? 

ఈలోకంలో ఎవడూ ఏ తప్పూ చేయకుండా జీవనం ఎలా సాగించగలడు? 'అవ్వలబాపి వీడనుచు అక్రమశిక్ష విధింతువయ్య' అక్రమంగా నన్ను పాపి అని ముద్ర వేసి శిక్షించాలని చూస్తున్నావు కదా.'ఈ రవ్వయు రచ్చ ఏల అపరాదుల మిద్దరమౌట' సరే ఈ గొడవంతా ఎందుకు. మనిద్దరమూ అపరాధులమే సుమా.ఎలా అంటావా చెబుతాను విను, సుందరమైన లోకాన్ని సృష్టించినందుకు నీకు,దానిని చూచి మోహించినందుకు నాకు,శిక్ష వేస్తె నీకూ నాకూ ఇద్దరికీ విధించు. అదే అసలైన న్యాయం. దానికి తక్కువ అయిన న్యాయం నేను ఒప్పుకోను.' అని దేవునితో వాదిస్తాడు.

'నన్ను పాపి అని ముద్ర వేస్తున్నావు. బాగానే ఉంది. అసలు ఇదంతా చేసింది నీవు కాదా?
ఇంత సౌందర్యాన్ని సృష్టించి, మానవ హృదయంలో ఆకర్షణను సృష్టించి, ఆ పైన ఆకర్షిపబడితే 'తప్పు' అనడం నీకే చెల్లింది. ఇదేమి న్యాయమో నీవే చెప్పు?' అని దైవాన్ని అడుగుతాడు.

ఖయ్యాం ఇంకొక విచిత్రమైన తర్కాన్ని లేవదీస్తాడు.'నేను తప్పు చెయ్యకపోతే నీవు ఎవరిని క్షమిస్తావు? కరుణామయుడని నీకు బిరుదున్నది కదా. దానిని నిలబెట్టుకో. నీ బిరుదును నిల్పడానికే నేను ఇన్ని పాపాలు చేస్తున్నాను. నేనే గనుక అన్నీ మానేసి వైరాగ్యాన్ని పూనితే నీవు కృప జూపడానికి పాత్రులెవరున్నారు?' అంటాడు. 'లోకంలో పాపులు ఉండాలి.అప్పుడే కరుణామయుడు అన్న బిరుదు నీకు దక్కుతుంది. ఇందుకేనా పాపాన్ని నీ సృష్టిలో అనుమతిస్తున్నావు?' అని అడుగుతాడు.

'నీ బిరుదున్ నిల్పుటకె నోనర్చితిని నిర్భీతిన్ సమస్తాఘముల్ సరకంబంటక యున్న వీలగునే పశ్చాత్తాపమున్ బొందగన్' పాపాలు చెయ్యకపోతే పశ్చాత్తాపం ఎలా పొందగలను? పశ్చాత్తాపం పొందకపోతే నీ కృపకు పాత్రున్ని ఎలా కాగలను? కనుక నేను పాపాలు చెయ్యడం సమంజసమే. కాదా? నీవే చెప్పు?' అంటాడు.

'భక్తులం గావగ వత్తువేని కృప గాదది' అంటూ నీ భక్తులను నీవు కాపాడితే గొప్ప ఏముందయ్యా? ఆ పని ఎవరైనా చేస్తారు.పాపాత్ములను కాపాడితేనే నీవు కరుణామయుడన్నది నిజమౌతుంది. అవునా కాదా ఇదికూడా చెప్పు' అంటూ దేవుని నిలదీస్తాడు.

ఇదే తర్కాన్ని ఇంకొంచం ముందుకు తీసుకెళ్ళి ఇంకొక అద్భుతమైన పద్యాన్ని చెబుతాడు.

అంబరు ముంగురుల్ నొసటి యంచున వేలగ జూచినంత మో 
హం బెసకోల్పు కోమల లతాంగిని గల్పన జేసి నీకు న్యా
యంబె మరేవ్వరున్ మొగము నారయరాదని యాజ్నపెట్ట;బూ
పంబును జేతికిచ్చి తినవద్దని చెప్పుట ఏల దైవమా?

'నొసట వ్రాలుతున్న ముంగురులతో చూడగనే మోహం పుట్టించే కోమలసుందరీమణిని సృష్టించేదీ నీవే. మళ్ళీ ఆ ముఖాన్ని చూడవద్దని ఆంక్ష పెట్టేదీ నీవే. బూరెను చేతికిస్తావు. తినవద్దని కట్టడి చేస్తావు. ఇదేమి న్యాయమో చెప్పు? అసలెందుకు ఇలా చేస్తున్నావు. నీకేమైనా సరదానా?' అని దైవాన్నే నిలదీస్తాడు.

మనుజుని వారుణిం బ్రణయ మాధురి సుందరిం జేసి భూమినం 
దనమున కంపినాడవు; మనంబగు బ్రేరక మెల్లకర్మకున్;
వెనుక నదేల మాలను వేసేద వీ యుపదూరు? నీవే శా
సన మపరాధియున్ మరి విచారణ కర్తయుం; జిత్రమీశ్వరా      

'మనిషిని సృష్టించావు. మధువును సృష్టించావు. మధురప్రణయమూర్తి అయిన ప్రేయసిని సృష్టించావు. నందనవనం లాంటి భూలోకాన్ని  సృష్టించావు. వీటన్నిటినీ ఒక్కచోట చేర్చావు. కాని, అనుభవం తప్పు అంటావు. భలే చిత్రంగా ఉందయ్యా. నీవే శాసనానివి. నీవే అపరాదివి. నీవే న్యాయాదిపతివి. ఏమిటీ వింత ఆట? మనిషి హృదయంలో ప్రేమను సృష్టించేదీ నీవే. మళ్ళీ ప్రేమించవద్దని ఆంక్షలు విధించేదీ నీవే. ఏంటయ్యా నీ లీల? ' అని ప్రశ్నిస్తాడు.

'ఏ ప్రయోజనమూ లేకుండా నన్ను ఈ లోకానికి ఎందుకు తెచ్చాడో దేవుడు? సరే తెచ్చాడు. మళ్ళీ నన్ను చంపితే ఆయనకు గౌరవం ఏమైనా హేచ్చుతుందా? మరి ఎందుకు నన్ను ఎక్కడికో తీసుకుపోతాడు? అసలు జీవితాన్ని ఎందుకిస్తున్నాడు? మరణాన్ని ఎందుకు పంపకం చేస్తున్నాడు? ఏమిటీ వింత ఆట?' అని ఆలోచించి విసుగు చెంది 'దైవలీలా మహిమోన్నతిం మది దలంప నసాధ్యము; రాకపోకలేలా; మన జీవితంబుకు లాభము జీవితంబెకా?' అన్న నిశ్చయానికి వస్తాడు. ' జీవితానికి పరమార్ధం వేరే ఏమీ లేదు. జీవించడమే జీవితానికి పరమార్ధం' అని ఒక అద్భుతమైన సత్యాన్ని ఆవిష్కరించి మన కళ్ళముందు ఉంచుతాడు. ఈ క్రమంలో ఒక తాత్వికుడు ఆయనలో మనకు దర్శనం ఇస్తాడు.

'ఒక చక్కని బొమ్మను తయారు చేసిన శిల్పి తన బొమ్మను తానే ఎన్నటికీ ధ్వంసం చెయ్యడు. మరి ప్రాణం లేని బొమ్మ విషయంలోనే ఇలా ఉంటే, ఇక ప్రాణం ఉన్న మనిషిని సృష్టించి, ఆమె పెదవులలో మధువును నింపి, హృదయంలో అనురాగమనే అమృతాన్ని నింపిన దేవుడు ఆమెకు మరణాన్ని ఎందుకు ఇస్తున్నాడు? తన సృష్టిని తానే ఎందుకు ఇలా ఉన్మత్తునివలె కూల్చుకుంటున్నాడు?' అని అర్ధం కాక చింతిస్తాడు. 

తన చేచేత నోనర్చినట్టి యొక పాత్రన్ భగ్నము చేయ నే
మనుజుం డైనన్ దలంప; డంగములు నిరమాణంబు గావించి మో 
హన రూపంబులు, మోవిదేనె యెదలో నత్యంత రాగంబు గూ 
ర్చిన దేవుండు మరేల ఇట్లు నిజ సృష్టి గూల్చు నున్మత్తుడై?   

ఇదంతా చూచి ఆయన్ను ఒక తత్వవేత్తగా మనం భావించామా? మనం పప్పులో కాలేసినట్లే. మళ్ళీ దానినీ ఒప్పుకోడు. తాను తత్వవేత్తను కాను అంటాడు. ఎందుకంటే తాత్వికులు ఊహల్లో విహరిస్తారు. ఖయాం అనుభవాన్ని అందులోని ఆనందాన్ని కోరుకుంటాడు. కనుక ఖయాం అనుభవవాది. తత్వవేత్త కాదు.

నేనొక తత్వవేత్త నని నిందయొనర్చిరి కానివారు; నా 
మానస వృత్తి వారలణుమాత్ర మెరింగిన నట్టులందురే
కాని, మరేమి; దేవు డెరుంగడే మనంబు; వ్యధా కులాయమౌ 
ఈ నిలయంబు జేరితి; గ్రహింప నసాధ్యము జన్మమర్మముల్

'లోకం నన్నొక తత్వవేత్త అంటే, నిందించినట్లు నాకు వినవస్తుంది. నా మనసు అణుమాత్రం కూడా వారెరుగలేరు. అందుకే అలా అంటున్నారు. పోనీలే లోకులేమనుకుంటే నాకేమి? దేవునికి తెలియదా నా మనస్సు? అనవసరంగా బాధామయమైన ఈ చెత్తలోకానికి వచ్చిపడ్డాను. ఈ జన్మలలోని మర్మం ఏమిటో తెలుసుకోవడం అసాధ్యం కదా?' అని తలుస్త్తాడు.

కానీ భారతీయ యోగులవలె ఖయాం జీవిత గమ్యాన్ని చేరాడా? అంటే సందేహమే అని చెప్పాలి. అలా చేరినట్లు అతని పద్యాలలో దాఖలాలు ఎక్కడా కనిపించవు. జ్ఞాని అయినవాడు ఎక్కడో ఒకచోట సూక్ష్మంగా అయినా తన స్తితిని వెల్లడిస్తాడు. అది అందరికీ అర్ధంకాకపోయినా, కొందరికైనా అర్ధం అవుతుంది. ఖయ్యాం చివరి పద్యాలలో ఆ పరిపక్వత కనిపించదు. అందుకే సత్యజ్ఞానాన్ని అతడు పొందగలిగాడా అంటే, సందేహమే అని చెప్పాలి.

ఆదిమధ్యాంత రహితమై అలరుచుండు 
కాలయవనిక భేదించగలమే మనము?
ఇలకు నెందుండి వచ్చె నింకేటకు బోవు
బ్రాణి యను ప్రశ్న కెవ్వడు బదులు సెప్పు?

ఈ కాలానికి మొదలూ మధ్యా తుదీ లేవు. దీనిని మనం ఎలా భేదిన్చగలం? ఒక జీవుడు ఎక్కడనుంచి ఈ లోకంలోకి వస్తున్నాడు? మళ్ళీ ఎక్కడికి పోతున్నాడు? అన్న ప్రశ్నకు ఎవడైనా జవాబు చెప్పగలడా? అని ప్రశ్నిస్తాడు. ఈ ప్రశ్నకు జవాబు చెప్పగల సత్యజ్ఞానం కల్గిన యోగులూ జ్ఞానులూ ఖయ్యాంకు దొరకలేదని దీనివల్ల అర్ధమౌతుంది. ఆ అదృష్టం అందరికీ దక్కదు. దక్కినా అందరూ ఉపయోగించుకోలేరు.

'కానలేము కర్మపు మర్మమేను నీవు, ఆ జిలుగు వ్రాత చదువ సాధ్యంబే మనకు' కాలం యొక్క మర్మాన్ని నీవూ నేనూ తెలుసుకోగలమా? బ్రహ్మ వ్రాసిన జిలుగు రాత చదువగలమా? అని ప్రశ్నిస్తాడు. సామాన్యుడే కాదు తత్వవేత్త కూడా కర్మరహస్యాన్ని తెలుసుకోలేడు. ఇంద్రియాతీతుడై జ్ఞాని అయినవాడే ఆ రహస్యాన్ని చూడగలడు. ఇతరులు వారెంతటి పండితులైనా ఆ రహస్యజ్ఞానాన్ని పొందలేరు. ఇది సత్యం.

ఖయ్యాం కూడా అనేకమంది గురువుల వద్ద శుశ్రూష చేశాడు. కానీ వారెవరూ అతనికి సత్యజ్ఞానాన్ని బోదింపలేకపోయారని తానే వాపోతాడు. ఎందుకంటే వారందరూ గ్రంధపండితులే గాని అనుభవజ్ఞానులు కారు. కనుక వారికీ సత్యం తెలియదు. వారిది వినికిడిజ్ఞానమే గాని అనుభవజ్ఞానం గాదు. 

అనుజునై ఎగిరితి రహస్యామ్బరమున 
పిన్న పెద్దల శుశ్రూష వేత్త నైతి 
గాని, లోగుట్టు దెలుపు నొక్కని గనను
మరలి వచ్చితి పోయిన మార్గమందే

'ఎందఱో గురువుల పాదాలవద్ద కూచున్నాను. కాని ఒక్కరూ లోగుట్టు తెలుపరు. విసుగు చెంది, పోయిన దారినే మరలి వచ్చాను' అని వాపోతాడు. పాపం అతనికి అనుభవగురుల సాంగత్యం దొరకలేదు. అపరావిద్యలు  నేర్పించే గురువులు చాలామంది దొరికారు. కాని పరావిద్యను ఆయనకు బోధించేవారు ఒక్కరూ కనిపించనట్టు తోస్తుంది. దానికి గల జ్యోతిష్య కారణాలు వచ్చె పోస్ట్ లో చూద్దాం.

సతము తత్వ విచారంబు సలిపి సలిపి
మూలసూత్రంబు నెవరైన ముట్టినారే 
నేడు నిన్నట్లు రేపును నేటియట్లు
అందని ఫలంబు చేచాచ నందుటేట్లు?

వాదవివాదాలలో తత్వ విచారాలలో ఎవరైనా సత్యాన్ని గ్రహించగలరా? నేడు నిన్న రేపు అని వాదాలే గాని, నిజానికి ఈ మూడూ ఒకటేగా? మన ద్రుష్టివల్లె అలా కనిపిస్తున్నాయి గాని వాటిమధ్యన నిజానికి భేదం ఉందా? ఇదే విధంగా,  ఇంత తత్వవిచారం ఎందుకు? ఉన్న సత్యాన్ని ఉన్నట్లు సరళంగా చూడవచ్చు కదా? అంటాడు. 'ఆ పండు అందేది కాదు. పొందేదీ కాదు. చెయ్యి ఊడోచ్చేలాగు చాస్తే మాత్రం అందుతుందా?' అని ప్రశ్నిస్తాడు.

మనకు ముందేగినట్టి యా మాన్యులేల్ల 
ప్రబల గర్వాంధ నిద్రానిబద్దులైరి 
నెలత, మధువాని నావల్ల నిజము వినుము
వారు చెప్పిన చదువెల్ల వట్టి కల్ల       

'ప్రేయసీ. ప్రాచీనులందరూ గొప్ప జ్ఞానులని అనుకోకు. వారూ నీవంటి అజ్నానులే. ఈ మధువు త్రాగి నేను చెప్పే పరమసత్యాన్ని విను. వారు చెప్పినదంతా ఒట్టి అబద్దం. వారికే సత్యజ్ఞానం లేదు. ఇక నీకెలా దానిని ఉపదేశించగలరు?' అంటాడు.

జీవితంబెల్ల బహుశాస్త్ర సేవలందు 
గడపితి, రహస్యములు చాల గ్రాహ్యమయ్యే
నిప్పుడు వివేక నేత్రంబు విప్పి చూడ 
తెలిసికొంటి నాకేమి తెలియదనుచు 

'నా జీవితమంతా ఎన్నో శాస్త్రాలను నేర్చుకోవడంలో గడిపాను. చాల రహస్యాలు తెలిశాయి కూడా. కాని ఇప్పుడు చివరిదశలో వివేకనేత్రంతో చూస్తే ఒక్క సంగతి బాగా అర్ధమైంది. నాకేమీ తెలియదు,నేనొక అజ్ఞానిని. ఈ విషయం మాత్రం బాగా అర్ధమైంది.' అంటాడు. సోక్రటీస్ కూడా ఇదే అంటాడు. పాశ్చాత్యతాత్వికులకూ భారతీయజ్ఞానులకూ ఇదే మౌలికమైన భేదం. తాత్వికులు జ్ఞానాన్ని పొందటం కష్టం.పూసుకున్నవాడు తాత్వికుడౌతాడు. వదుల్చుకున్నవాడు జ్ఞాని అవుతాడు.పూసుకుంటూ వదుల్చుకోవడమూ, వదుల్చుకుంటూ పూసుకోవడమూ తెలిసినవాడు విజ్ఞాని అవుతాడు.  

మానవుడు ఎన్ని తెలుసుకున్నా మృత్యురహస్యాన్ని భేదించనిదే అతని  తెలివి ఎందుకూ కోరగానిదే అవుతుంది. అది ఒక్క యోగులు మాత్రమె చెయ్యగలరు. ఆ రహస్యజ్ఞానం వారి సొంతం. ఇక్కడే ఉత్త పండితులకూ యోగులకూ తేడా ఉంటుంది. మనిషి ఎన్నో శాస్త్త్రాలు చదవవచ్చు. ఎంతో పుస్తక జ్ఞానాన్ని పొందవచ్చు. కాని సమాధిస్తితిలో మునిగి జననమరణ రహస్యాన్ని చేదించనిదే అతనిజన్మ సఫలం కాదు. అతని జ్ఞానం పరిపూర్ణమూ కాదు.

ధారుణి నుండి యుచ్చ శని దాక గలట్టి కడింది చిక్కులన్ 
బూరితీగా సడల్చితిని; మోసపు టక్కుల బందేగాను; దు
ర్వార నిరోధముల్ గడచి వచ్చితి; నయ్యును,శాయశక్తులం 
బోరి వదల్చకే విసిగిపోయితి; మృత్యు రహస్య బంధముల్ 

అనే పద్యంలో తన మనసులోని మాటను వెల్లడిస్తాడు. ఖయ్యాం ఆ కాలంలో గొప్ప జ్యోతిష్కుడు. తన ఖగోళజ్ఞానంతో గ్రహగణితంతో విశ్వ రహస్యాలను ఆలోకించాడు. భూమినుంచి శనిగ్రహ కక్ష్య వరకూ ఉన్న గ్రహాల పరిభ్రమనాన్ని వాటి స్తితులను లెక్కించాడు.ఎన్నో శాస్త్రాలు చదివాడు.కాని ఎంత ప్రయత్నించినా మృత్యురహస్యాన్ని మాత్రం భేదించలేకపోయాను కదా అని బాధపడతాడు. కనుక అతను జీవితపరమగమ్యాన్ని చేరలేకపోయాడని మనం అనుకోవచ్చు.

(సశేషం)