“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

4, సెప్టెంబర్ 2012, మంగళవారం

ఒమర్ ఖయ్యాం జాతకం -4 (మధుసేవ-సాకీసాంగత్యం)

ఖయ్యాం పద్యాలలో మధువూ సాకీ ఈ రెండూ తప్పకుండా ప్రతి పద్యంలోనూ దర్శనమిస్తాయి. రసహీనమైన ఈ లోకానికి వెలుగును ఇచ్చే  దివ్వెలు ఈ రెండే అని ఖయాం తలపోస్తాడు.

అయితే కొందరనుకునేటట్లు ఖయ్యాం తాగుబోతూ తిరుగుబోతూ కానేకాదు. అతనొక బహుముఖ ప్రజ్ఞాశాలి. మంచి భాషావేత్త మాత్రమె గాక, ఇస్లామిక్ తియాలజీలో మంచి పండితుడు. గ్రీక్ తత్వశాస్త్రం అతనికి కొట్టిన పిండి. అప్పటి సైన్స్ లోనూ, గణిత శాస్త్రంలోనూ, ఖగోళ శాస్త్రంలోనూ మంచి దిట్ట. ఇదిగాక అతనికి సంప్రదాయ ఇస్లాంకు విరుద్ధమైన సూఫీ భావాలు ఉండేవి. ఇవన్నీ గాక అతనొక మార్మిక కవి. అందుకే అతన్ని అర్ధం చేసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే అతను ఎన్నో కోణాలున్న జాతివజ్రం లాంటివాడు. ఒక్క కోణంలో చూస్తే అతను అర్ధం కాడు.

మార్మిక భాషలో నిగూఢమైన తత్వాన్ని ప్రతిపాదించడంలో అతను మంచి ప్రజ్ఞ కలిగినవాడని రుబాయత్ పద్యాలే చెబుతాయి. గహనమైన తాత్విక సమస్యలకు అతనిచ్చిన పరిష్కారాలు పైపైన చూస్తే పిచ్చివిగా కనిపిస్తాయి. కాని ఆ సమస్యలకు అవి ఎంత చక్కగా సరిపోతాయంటే, వాటిని మనం వెంటనే కాదనలేం. అవి మనల్ని ఆలోచింపచేస్తాయి. వాటికి మార్మికమైన గూడార్ధాలు ఉన్నమాట వాస్తవమే. అవి అలా ఉంచితే ఒక సామాన్యుడు మాత్రం ఖయ్యాం చెప్పిన దానికంటే ఈలోకంలో ఇంకేమీ చెయ్యలేడు. నైతికులు ఖయ్యాం ను ద్వేషించవచ్చు. కాని లోపల్లోపల వారుకూడా అతని శిష్యులే. ఇంకా సరిగ్గా చెప్పాలంటే, వారు అతని శిష్యులు కావాలంటే ప్రస్తుతపు వారి నేలబారు ఇంద్రియభోగలాలసా స్థితినుంచి చాలా ఎదగాల్సి ఉంటుంది. ఖయ్యాం వారనుకున్నంత నేలబారు మనిషి కానేకాదు.

రుబాయత్ లో అంతర్లీనంగా ప్రవహించే ఒక భావన మధువు. దానికి తోడుగా సాకీ ఉండనే ఉంటుంది. ఈ రెండు కలిసి, జ్వలిస్తున్న అతని ఆత్మను శాంతింప చేస్తాయి. తత్వశాస్త్రం పరిష్కరించలేని నిగూఢ సమస్యలను ఈ రెండూ అతి సులభంగా పరిష్కరిస్తాయి. అతన్ని సేద దీరుస్తాయి. ఎంత విచిత్రం? తత్వశాస్త్రం పరిష్కరించలేని గహనమైన చిక్కు ముళ్ళను మధువూ సాకీ చిటికెలో పరిష్కరించగలవు. భగవంతుని సృష్టి ఎంత గొప్పది? కొండ ఒక్క అంగుళం కూడా కదలలేదు. కాని చిన్న చీమ మహాపర్వతశిఖరాగ్రాన్ని చేరగలుగుతుంది. ఎంత అద్భుతం !!

సరసశృంగారపూరిత మధుపానమత్తమైన జీవితమెదురుగా ఉండగా, దానిముందు మహారాజుల వైభవం మాత్రం ఎందుకు దండగ? అని ఖయ్యాం తలపోస్తాడు. నిండుగా ఉన్న మధుపాత్ర, ఆమిష ఖండమూ, వెన్నరొట్టె, వీణ వాయించగల ప్రియురాలు, ఏకాంత మనోహర వనవాటిక - ఇవి దొరికే అదృష్టం ఉంటే ఏ మూర్ఖుడైనా వీటిని వద్దని దాని బదులు సుల్తాన్ పదవిని, రాజ భోగాలను కోరుకుంటాడా? అని ప్రశ్నిస్తాడు.   

ఆసవపూర్ణమౌ కలశ మామిషఖండము వెన్నరొట్టె ది
వ్యాసమరూప గుణాలయ వీణియ మీటుచున్ దివా
యాసముల దీర్ప నిర్జన వనాంతర సీమల నబ్బెనేని వ
హ్వా, సుల్తాను భోగ విభవంబుల గోరెడి మూఢుడుండునే ?

మనుషులకే గనుక తెలివి అనేది ఏమాత్రం అయినా ఉంటే, వాళ్ళు గుళ్ళూ గోపురాలూ మసీదులు అంటూ పిచ్చిపిచ్చి ఆధ్యాత్మికబంధాలలో చిక్కుకుంటారా? చక్కని పచ్చబయళ్ళూ, అప్సరవంటి నెచ్చెలి, మధువు, రసస్ఫూర్తినిచ్చే కవితా ఉంటే,వాటిని చక్కగా ఆస్వాదిస్తూ అప్పుడే ముక్తిని పొందేవారు కదా? అని తలపోస్తాడు. ముక్తి ఇక్కడే దొరుకుతుంటే ఆధ్యాత్మికత అంటూ గుళ్ళూ గోపురాలూ తిరుగుతారెందుకు మనుషులు? అని అడుగుతాడు. ఇదేలాంటి ముక్తో మాకు తెలుసులే అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఖయ్యాం చెప్పే ఆనందం అందరికీ తెలిసిన నేలబారు ఆనందం కాదు.

పచ్చ బయళ్ళు నేటి దరిపట్టులు, నొక్క క్షణంబు శ్రాన్తియున్ 
అచ్చర వంటి నెచ్చెలి రసాంకిత కావ్యము గెంపుపానకం
బిచ్చగ నామనిన్ దొరకేనేని మసీదులు గుళ్ళ దాస్యమున్    
మెచ్చక ముక్తులై సుఖము మీరం జరింతురు జాగరూకులున్ 

అల్లసాని పెద్దనకూడా ఇదేభావాన్ని'నిరుపహతి స్థలంబు రమణీప్రియదూతిక తెచ్చి ఇచ్చు కప్పురపు విడెము' అంటూ ఇంకో రకంగా చెబుతాడు. మంచి కవిత, కవి లోపలనుంచి పెల్లుబికి రావడానికి అనుకూల పరిస్థితులను పెద్దన వర్ణించాడు.అల్లసాని పెద్దనలాగా ఖయ్యాం కవిత్వాన్ని చెప్పాలని కోరుకోలేదు. అలాంటి రమణీయ వాతావరణంలోని ఆనందాన్ని ఆస్వాదించడాన్ని మాత్రమె అతను కోరుకున్నాడు.

ఉన్నతభావ సంప్రేరితులైన కవులు, నేలబారు మనుషుల సన్నిహితత్వాన్ని భరించలేరు.మోటుభావాలు సున్నితమైన కవిహృదయానికి  జుగుప్సను కలిగిస్తాయి. హంస మానససరోవరం లోనే విహరిస్తుంది గాని బురద గుంతలో క్షణమైనా ఉండలేదు.బురదగుంతలో పంది మాత్రమే ఉంటుంది.ఒమర్ ఖయ్యాం ఎప్పుడూ సరససల్లాప మాధుర్యంతో కూడిన మనోహర కవితా వ్యాసంగాన్నే కోరుకున్నాడు. మధువు ఎలాగూ పక్కనే ఉంటుంది. దానిని అందించడానికి నెచ్చెలి సాకీ ఉండే తీరాలి. చక్కని సంగీతం వీనులవిందు చేస్తూ ఉండాలి. చల్లని గాలి చెట్లమీదనుంచి వీస్తూ ఉండాలి. ఏకాంతమైన వనవాటిక వసంతశోభలో కనువిందు చేస్తూ ఉండాలి. అలాంటి మనోహరమైన వాతావరణంలో ఆనందామృత సేవనం ద్వారా ప్రపంచపు బాధలకు అతీతుడవు కమ్మని అతను బోధిస్తాడు. తద్వారా ప్రపంచంలో అంతర్లీనంగా ఉన్న అనిత్యత్వాన్ని దాటిపోమ్మని అతను అంటాడు.అంతేగాని బాద్యతలు మరచిన వెకిలి తాగుబోతుతనాన్ని అతను ఆశించలేదు. ఈ కోణంలో చూస్తే అతనిలో ఒక తాంత్రికుడు కనిపిస్తాడు.ఒక గొప్ప సౌందర్యారాధకుడు కనిపిస్తాడు.

'వాదులు మాని నా సరస వారుణి నానుము' అంటూ, వాదనలు మాని మధువును సేవించు, దానితో సుల్తాన్ యొక్క సమస్త రాజ్యభోగమూ సాటిరాదు అని హెచ్చరిస్తాడు. 'నేటి సమ్మదము నోడకు రేపను జూదపాటలో' అన్న పాదంలో, 'రేపు చూదాంలె అని రసాస్వాదనను వాయిదా వెయ్యకు ప్రేయసీ, రేపనేది ఎన్నటికీ రాదు. గ్రహించు. ఈ జూదంలో నీవు ఓడిపోకు' అని గతంలోనుంచి వర్తమానంలోనికి మేల్కొలుపుతాడు.

'తనువు నశించి దుమ్మగుట తధ్యము, నీవు పసిడి ముద్దవా, జనులోకసారి పూడ్చి మరుసారి నినున్ బెకలించి ఎత్తగన్' నీ తనువు దుమ్ములో కలవడం తధ్యం సుమా. ఒకసారి భూమిలో పూడ్చిన తరువాత మళ్ళీ బయటకు తీసి ఉపయోగించుకోవడానికి నీవు బంగారుముద్దవు కావు. ఒకవేళ తీసినా నీవు బంగారంలాగా చెక్కు చెదరకుండా అట్లే ఉండవు కదా. ఇది గ్రహించు' -- అంటాడు.

'ప్రేయసీ, మధువును త్రాగి సుఖించమని నా నుదుటా, హృదయం తెగి పారుతున్న ప్రేమరసపానీయాన్ని గిన్నెలో నింపి అందివ్వమని నీ నొసటా లిఖించి ఉంటాడేమో ఆ సృష్టికర్త? నీవూ మధుకలశమూ చిరకాలం వర్ధిల్లండి' అని దీవిస్తూ ఒక గొప్ప కమనీయ భావాన్ని మన కళ్ళముందు ఉంచుతాడు. సాకి గిన్నెలో పోస్తున్నది ఉత్త మధువును కాదు. తన గుండెలలోనుంచి  పొంగి పొర్లుతున్న ప్రేమరసాన్ని ఆ పాత్రలో నింపుతున్నది --అని భావిస్తాడు. ఆ ప్రేమ మత్తులో తన్మయుడౌతాడు.  

చెలియరో నిన్ను నన్ను విరచించిన యప్పుడు సృష్టికర్త ముం 
దల లిఖియించేనేమో సురంద్రావి సుఖింపగనాకు, హృత్తటం
బులు దెగిపారు ప్రేమరసపూరము గిన్నెల నింప నీకు నా 
శలు ఫలియింప మద్య కలశంబును నీవు చిరంబు వెల్గుతన్

'ఓ నెచ్చెలీ, జీవితము పాదరసం లాంటిది. అది పట్టుకుందామంటే చిక్కదు. త్వరగా పరిగెత్తి పోతున్నది. నా చిత్తమేమో అనుతాపంతో మండుతోంది. కళ్ళు తెరిచి, లేచివచ్చి, ద్రాక్షారసాన్ని నా చేతికి అందించు'-- అని సాకీని పిలుస్తాడు.ఏం తను గ్లాసులో పోసుకోలేడా అని అనుమానం రావచ్చు.తను పోసుకుని త్రాగితే ఆ మాధుర్యం రాదు.ప్రేయసి చేతితో ఇస్తేనే దానికి మాధుర్యం వస్తుంది.ఖయాంకు కావలసింది ఉత్త మధువు కాదు.దానిని అందించే సాకీ ప్రేమ అతనికి కావాలి.ప్రేమ కలసిన మధువు అతనికి కావాలి.

'నా మాట నమ్ము. నేను అబద్దం చెప్పడం లేదు. 'నశ్వరమైన ఈ స్థితిం దెలియుమ ఈ క్షణం బెరవు దెచ్చిన సొమ్మని' ఈ క్షణం అనేది అప్పు తెచ్చిన సొమ్ము. ఇది నీ సొంతం కాదు. సొంతం అనుకుంటున్నావా అది నీ భ్రమ. ఈ భ్రమలోనుంచి లే. కాలం శాశ్వతం కాదు. 'జారబుచ్చినం గలికి మరెప్పుడిట్టి తరి గ్రమ్మర రాదు' అంటూ ' ఈ క్షణాన్ని జారవిడుచుకున్నావా మళ్ళీ ఈ అవకాశం నీకు దొరకదు. తెలివి తెచ్చుకో' అని బోధిస్తాడు.

జీవితంలో ఏ క్షణమూ మళ్ళీ తిరిగిరాదు. అలాగని ఏ అనుభవమూ శాశ్వతమూ కాదు. క్షణక్షణం తరిగిపోతున్న కాలాన్ని ఒడిసి పట్టుకోవాలనే అందరి తాపత్రయమూనూ. కాని ఈ ప్రయాసలో నెగ్గినవారెవరు? ఈ పోరాటంలో కాలాన్ని గెలిచినవారెవరు? కాలం ఎవరి మాటైనా వింటుందా? ఎవరికైనా లొంగుతుందా? అనుభవం ఎవరికైనా శాశ్వతంగా చేతిలో నిలుస్తుందా? ఈ విచిత్రపరిస్థితిలో శాశ్వతసుఖమనే గమ్యాన్ని చేరేవారెవరు? ఈ నశ్వర లోకంలో అసలది సాధ్యమేనా?

ఈ ఆలోచనల్లో మునిగి సాకీ విచారంగా ఉంటే ఆ విచారాన్ని వదలి ఈ క్షణాన్ని ఆస్వాదించమని పిలుస్తాడు. 'తలచెదవేల నిన్నటి వెతల్, మరి ముదంబు గూర్ప రమ్మెలమిని బచ్చబైల సెలయేటి తటాల బచారు సేయగన్' నిన్నటి బాధలు వదలిపెట్టు, నేటి ఆనందాన్ని ఆస్వాదించు, పచ్చిక బయళ్ళలో సెలయేటి ఒడ్డున పచార్లు చేద్దాం రమ్మని' సాకీని ఆహ్వానిస్తాడు.

'ఈ జీవితమనే ఆకసంలో ఇంకొక తార మరుగైపోయింది. మన ఇద్దరి జీవితాలలో మరొక్క రోజు చేజారిపోయింది. ఇక ఆలస్యం చెయ్యకు. కాలం శీఘ్రంగా పరుగెత్తుతున్నది. నిన్న గతించింది. రేపు వస్తుందో లేదో ఎవరికి తెలుసు? నేడు నీ చేతిలో ఉన్నది. ఆ నేటిని నీ చేతిలోనుంచి జారనీయకు. జారనిస్తే తరువాత బాధపడతావు సుమా' -- అన్న చేదు వాస్తవాన్న చేదు పానీయంలా గొంతులో పోస్తాడు.

జీవితం విచిత్రంగా పయనిస్తున్నది. ఈ క్షణభంగురమైన జీవితంలో ఒక్క క్షణమైనా నీ మనసుకు నచ్చినవారితో ఆనందాన్ని పొందితే ఇక అంతకంటే కోరదగినది ఏముంది? ' మధుపాత్రిక నందియిమ్ము సాకీ వివరించెదేల తిలకింపని రేపును రేయి జారెడిన్'. ఒకనాటి రాత్రి ఖయాం,సాకీ సాంగత్యంలో కాలాన్ని మరిచాడు. రేయి అనుక్షణమూ చేజారిపోతున్నది అన్న చింతలో సాకీ అన్యమనస్కంగా ఉన్నది. ఖయాం అది గమనించాడు. 'రేపటి గురించి ఆలోచన ఎందుకు ప్రేయసీ? ఈ క్షణాన్ని ఆస్వాదించు. వర్తమానంలోని అమరత్వాన్ని గుర్తించు.మధుపాత్రను అందివ్వు.వచ్చి నా కౌగిలిలో ఒదిగిపో.' -- అని ఒక జెన్ సాధువులా అంటాడు. వర్తమానాన్ని ఆస్వాదించమని ఉద్బోదించడంలో అతనిలో ఒక జెన్ మాస్టర్ దర్శనమిస్తాడు.

'రేయి ఆగిపోనీ రేపు ఆగిపోనీ' అని ఆనంద తన్మయత్వంలో కలవరించని ప్రేమికులు ఈ లోకంలో ఎవరుంటారు? ఉండరు. కాని వారికోసం రేయి ఆగదు. రేపూ ఆగదు.ఈ ప్రపంచంలో ఏదీ ఎవరికోసమూ ఆగదు. ఇక్కడ ఎంతటి ఆనందమైనా క్షణికమే. అసలు ఆస్వాదనమే క్షణికం. మరి జీవితమో? అనుక్షణికం. ఒకవేళ ఆనందం శాశ్వతంగా నిలిస్తే  తట్టుకుని భరించగలిగే మనిషి ఈ లోకంలో ఉన్నాడా? లేడు. అందుకే ఏ ఆనందమూ శాశ్వతం కాదు. అలాగని క్షణికమూ కాదు. అనుభవం క్షణికం. జ్ఞాపకం నిత్యం. జారిపోయే అనుభవానికీ, మాసిపోని జ్ఞాపకానికీ మధ్య సంఘర్షణే జీవితం. 

ఖయ్యాం పెళ్లి చేసుకోలేదని, అతనికి పిల్లలు లేరని చరిత్ర కారులు వ్రాశారు. దానికి నిదర్శనంగా అతని జాతకంలో కొన్ని రుజువులు మనకు లభిస్తాయి. సప్తమాధిపతి అయిన కుజుడు ద్వాదశంలో ఉండటమూ, శుక్రుడు  వక్రించి  లగ్నంలో ఉండటమూ, పంచమంలో రాహువూ కలిసి ఇది వాస్తవమే అని చెబుతున్నాయి. ఇతనికి రాహుదోషం ఉన్నది. అందుకే సంతానలేమి వచ్చింది. అయితే నిరంతర జ్ఞానపిపాసి, అన్వేషి అయిన ఇతడు పెళ్లి,పిల్లలూ వంటి బంధాలను పెట్టుకోదల్చుకోలేదని కొందరు అభిప్రాయపడ్డారు. జీవితంలోని పరమార్ధాన్ని వేదకాలని అనుకునేవారికి ఇవి బంధాలుగానే తోస్తాయి. ఇది చాలావరకూ నిజం కూడా. మనిషి జీవితంలో సగం, పెళ్లి చేసుకోవాలని కలలు కనడంలోనూ, మిగిలిన సగం ఎందుకు చేసుకున్నానని చింతించడంలోనూ గడుస్తుందని ఒక తాత్వికుడు అంటాడు. వెరసి అతని జీవితం కలల్లో వృధాగా గడచి చివరకు మట్టిలో కలిసిపోతుంది.

'రంభను తలదన్నే వనితలు ఇక్కడే ఉండగా మరణం తర్వాత స్వర్గంలో రంభాదుల పొందును కోరుకుంటావా పిచ్చివాడా' అని ఖయ్యాం ఆక్షేపిస్తాడు. 'చేత వెన్నవిడి నేతికి బోదురు మూఢమానవుల్' -- 'చేతిలో వెన్న ఉంచుకొని నేతికోసం ఎక్కడో తిరుగుతావెందుకు మూర్ఖుడా' అంటాడు. అన్ని మతాల గమ్యమూ మరణం తర్వాత స్వర్గలోకంలో అప్సరసల సాంగత్యంలో భోగాలు అనుభవించడమే. ఇస్లాంలో అయితే ఈ పిచ్చి మరీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వారి ఎడారి దేశాలలో పచ్చబయళ్ళు ఉండవు. నదులు ఉండవు. జలపాతాలు ఉండవు. ద్రాక్షతోటలు ఉండవు. ముసుగులు కప్పుకోకుండా అందాన్ని చూపించే మదవతులూ ఉండరు. 

కనుక ఇవన్నీ బాగా ఎక్కువగా దొరికే స్వర్గాన్ని వారు ఊహించుకున్నారు. ఈలోకంలో ఎవడికి ఏది దుర్లభమో దానిని స్వర్గంలో ఊహించుకోవడం మనిషి బలహీనత. బతికి ఉన్నప్పుడు ఖురాన్ లో చెప్పినట్లు నడుచుకుంటే చచ్చిన తర్వాత స్వర్గం ఖాయం అన్న పిచ్చి నమ్మకాలు వారికున్నాయి. స్వర్గంలో ఏముంటుంది? అక్కడంతా ఫ్రీ సర్వీసే. అక్కడ డబ్బు అనేది ఉండదు,ముసలితనం రాదు,చావు రాదు.చల్లని ఎయిర్ కండిషన్ వాతావరణంలో, పార్కులూ, బార్లూ, రోగాలు లేని దేహాలూ,అన్ని సుఖాలను అడిగినప్పుడల్లా సమకూర్చడానికి, ఒక్కొక్కరికి  74 మంది అప్సరసలు చొప్పున వీరి సేవలకై వేచి ఉంటారు. భూమ్మీద దొరకని సమస్తసుఖాలూ అక్కడ అందుబాటులో ఉంటాయి.మనిషి ఊహలు ఇలా ఉంటాయి. మనిషి అత్యాశకు ప్రతిరూపమే స్వర్గం. భయానికి ప్రతిరూపం నరకం.

నాకొక ముస్లిం శిష్యురాలు ఉంది. ఆ అమ్మాయితో ఒకసారి వాళ్ళ స్వర్గం గురించి నరకం గురించి చర్చిస్తూ ఇదే చెప్పాను. మీ మతంలో ఆడవాళ్లకు 'ఆత్మ' ఉండదు. మీ మతం ప్రకారం ఆ టేబిల్ ఎంతో ఒక ఆడదీ అంతే. స్త్రీ ఒక వస్తువుతో సమానం. కనుక మీకు స్వర్గమూ నరకమూ ఉండవు. మతాన్ని  తూచా తప్పక పాటించిన మీ మగవారికి మాత్రమె స్వర్గం వస్తుంది. వారికి మాత్రం ఒక్కొక్కరికి 74 మంది అమ్మాయిలు అక్కడ సిద్ధంగా ఉంటారు అని చెప్పాను. 'మరి చచ్చిన తర్వాత మేము ఏమౌతాము? మాకు స్వర్గం ఉండదా?' అని ఆ అమ్మాయి అడిగింది. 'నాకు తెలీదు. బహుశా మీరంతా ఆ అమ్మాయిల గుంపులలో కలుస్తారేమో' అని జవాబిచ్చాను.

ప్రతి మతంలోనూ మగవాడు చచ్చి స్వర్గానికి పోవడమూ అక్కడ ఆడది అతనికి సేవలు చెయ్యడానికి సిద్ధంగా ఉండటమూ ఇదే వరస. భూమ్మీద చేసే సేవలు చాలక ఇంకా స్వర్గంలో కూడా ఆడదే మగవాడికి ఊడిగం చెయ్యాలి. పైగా ఒకటి సరిపోక 74 మంది కావాలి. మగవాళ్ళు ఊహించే స్వర్గం ఇలాగే ఉంటుంది గామోసు. అదే ఆడవారు పురాణాలు వ్రాస్తే వాళ్ళ స్వర్గాలు ఖచ్చితంగా వేరేగా ఉంటాయి. సరే ఆ సంగతి అలా ఉంచుదాం.

అతి నియమనిష్టలు పాటిస్తూ మహాభక్తులలాగా నటించేవారిని చూచి ఖయాం నవ్వుతాడు. 'మీ నియమనిష్టలన్నీ 'రంభ' కోసమేగా? ఆ రంభలు ఈ లోకంలోనే ఉన్నారు. వారిని వదిలి ఎప్పుడో దొరికే రంభకోసం ఇప్పుడు ఉపవాసాలు ఉండి ప్రార్ధనలు చేస్తావెందుకు పిచ్చివాడా?' అని నవ్వుతాడు. నిజమైన యోగికి రంభతో పనిలేదు. 'యోగికేల రంభ యోగహర్షంబుండ' అని వేమన అంటాడు.నిజానికి,కామచక్రమైన స్వాధిష్ఠాన చక్రాన్ని జయించగలిగి నప్పుడు యోగికి తన శరీరంలో కలిగే 'ధ్రిల్' ముందు ఎంతమంది రంభల పొందూ సరిపోదు. 

కాని ఒమర్ మాత్రం 'సురన్ ద్రావి సుందరీమణుల పొందున సుఖము నొందుమో సరసుడ భయమిసుమంతయున్ లేదు, దైవంబు కడు కరుణాంతరంగుడా బాపములెల్లను దుమ్ముజేయు నొక్కనిమేష మాత్రమున్'-అని ధైర్యాన్ని నూరిపోస్తాడు.'దేవుడు కరుణామయుడు.నువ్వు చేసే పాపాలన్నీ ఒక్క క్షణంలో భస్మం చెయ్యగలడు. ఏం పరవాలేదు. నీవు సుఖించు.' అని చెబుతాడు.

'మీరు నాకు తాగుబోతు అని ముద్రవేశారు. సరే ఒప్పుకుంటాను. కాని మీ స్వర్గంలో ఏమి జరుగుతుందో కాస్త చెప్పండి. అక్కడ ఉండేది ఇదేగా? కాదా?' అని ప్రశ్నిస్తాడు. వారేమి చెప్పగలరు? వారి మతగ్రంధాల ప్రకారం ఖయాం చెబుతున్నది వాస్తవమే. తాగితే నరకం ప్రాప్తిస్తుందని నన్ను భయపెట్టకండి. మీ స్వర్గంలో అందరూ చేసే పని ఇదేగా? మరి వారికి నరకం రాదా? అని ఎదురు ప్రశ్నిస్తాడు. 'త్రావిన నిరయము దప్పదన్న మరిమీ సురలోకము పాడుగాదోకో?' అన్న ప్రశ్నకు ఎవరు జవాబు ఇవ్వగలరు? 

సురాపానాన్ని అనేక రకాలుగా ఖయ్యాం సమర్దిస్తాడు. 'మానవ సంఘ రక్తమున్ ద్రావెదవీవు ద్రాక్షఫల రక్తము నింపగు మాకు నెన్నగన్' అంటూ 'ఒరే దుర్మార్గుల్లారా, సమాజపు రక్తాన్ని జలగల్లాగా పీలుస్తున్న మీరా నాకు నీతులు చెప్పేవారు? మీకు మనిషి రక్తం అంటే ఇష్టం. నాకు అంత ఆశ లేదు. ద్రాక్షఫలరక్తంతో నేను సరిపెట్టుకుంటాను. మీరు రక్తపిశాచాలు. నేను మీలాంటి కసాయిని కాను.' అంటూ చమత్కరిస్తాడు.

త్రాగడం తప్పు అని నీతులు చెప్పే దొంగభక్తులకు ఖయాం చక్కని జవాబిస్తాడు. 'మధువు సైతాన్ యొక్క రక్తం. దాని జోలికి పోకూడదు'- అని వారు చెబుతారు. దానికి ఖయాం ' అందుకే వాడి రక్తాన్ని తాగుతున్నాను. శత్రువును చంపి అతని రక్తాన్ని తాగడం వీరధర్మం కదా? సైతాన్ని చంపి వాడి రక్తాన్ని తాగడం ద్వారా నేను దైవానికి దగ్గరౌతున్నాను' అని వారిని నిరుత్తరులను చేస్తాడు. 'ధర్మశత్రుసంహారము శాస్త్రసమ్మత మౌనని చెప్పరె పండితోత్తముల్" అంటూ, ద్రాక్షపండ్ల మీద 'జిహాద్' ప్రకటించమంటాడు.  

పూలను చూచి మురియని మానవుడుండడు. జీవితాన్ని పూలతో పోల్చుతాడు ఖయ్యాం.' ఓ సాకీ ! సుమముల వలె మన జీవితాలు కూడా ఒకటి రెండు నాళ్ళే ఉంటాయి. కనుక వాటివలె ఉన్నన్ని రోజులు ఆనందంగా నవ్వుతూ ఉందాం. తర్వాత ఏమౌతుందొ ఎవరికీ తెలుసు? ' ఎవరైనను వచ్చినారె మున్ను దివి కేగిన పూర్వయాత్రికుల్' అంటూ ఇంతకుముందు గతించిన వారు ఒక్కరైనా తిరిగి రావడం నీవు చూచావా? లేదుకదా. ఇక ఇతర చింతలెందుకు? 'బంగరు సరకంబునన్ మదిర గమ్మగ నానుము నిర్విచారతన్' బంగారు పాత్రలో మధువును నిశ్చింతగా గ్రోలి ఆనందంగా ఉండు. ఇంతకంటే నీవు చెయ్యగలిగింది ఈ లోకంలో ఏమీ లేదు. అంటాడు.

మనిషి జీవితం కూడా పువ్వు వంటిదే. విరబూసి కొన్నాళ్ళు పిల్లగాలులలో నవ్వుతూ తలూపుతుంది. తర్వాత రాలి మట్టిలో కలిసిపోతుంది. కనుక ఉన్నన్నాళ్ళు పూలలాగా ఆటపాటల్లో ఆనందంగా కాలం గడుపు 'మన ప్రియజీవితంబు కుసుమంబుల పోలికం చంచలంబు గావున బువులట్లు కాలము బుత్తము నాటపాటలన్' అంటాడు.

'పూలు రాలినట్లే మన జీవితాలు కూడా నేలరాలక పూర్వమే రసానందఝరిలో మైమరచి సుఖించు' అంటూ ఉద్బోదిస్తాడు. 'పిల్లగాలుల కౌగిలిలో పులకించి గులాబి ఎలా సువాసనను చిమ్ముతున్నదో చూడు. బుల్బుల్ పిట్ట నవ్వుతున్న పూలలోని మకరందాన్ని గ్రోలి మైమరుస్తున్నది. ప్రకృతిని చూచి ఏమి నేర్చుకున్నావు నీవు? మనిద్దరమూ నేలరాలక పూర్వమే వచ్చి పాత్రను నింపి అందిమ్మని తన కౌగిలిలోకి ఆహ్వానిస్తాడు. ఒక అద్భుతమైన పద్యాన్ని మనకు అందిస్తాడు.

కమ్మని పిల్ల తెమ్మెరల కౌగిళులం బులకించి వాసనల్ 
చిమ్ము గులాబి; బుల్బులి హసించు సుమంబుల రామణీయకం 
బిమ్ముగ గ్రోలి మైమరచు; నేల విలంబము? పాత్ర నింప రా
రమ్ము లతాంగి, ఇద్దరము రాలక పూర్వమె పూలపోలికన్
    
ప్రేయసి ఒకని కోసం వనంలో వేచి ఉన్నది. ఇతడేమో ప్రార్ధనలో ఉన్నాడు. ఖయ్యాంకు కోపం వస్తుంది. అతన్ని తిడతాడు.' సుందరి హృదయానుసారిణి వనంబున నీకయి వేచియుండ నీ తరుణంబునన్ సుఖింపక వృధా పరచింతనలేల మర్త్యుడా?' అని ప్రశ్నిస్తాడు.'ఓరే మూర్ఖుడా ! నీవు ఇక్కడ శాశ్వతం కాదు. ఎంతగా ప్రార్ధించినా ఎంతగా పరచింతనలో మునిగినా నీవు ఇక్కడ ఎల్లకాలం ఉండవు. నీవు వెతుకుతున్న అమరత్వం నీకు దొరకదు. దేవుడు నీకు కనిపించడు. అసలు నీ ప్రార్ధన వింటున్నాడో లేడో కూడా తెలియదు. కనుక ఎందుకు నీ సమయాన్ని ధ్యానంలో వృధా చేసుకుంటావు. నీ ప్రేయసి నీకోసం వనంలో వేచి ఉన్నది. పోయి ఆమెతో సుఖించు. నీ అశాశ్వత జీవితానికి ఇది చాలులే. ఇక నీ ప్రార్ధనలు చాలించు. కనిపించని దైవం కంటే కనిపించే నీ ప్రేయసి మిన్న కాదా?' -- అంటాడు.

'విరక్తిభావాలు నావద్ద చెప్పకు. అవి రసహీనములు. మూడునాళ్ళ ముచ్చట అయిన ఈ జీవితంలో విరక్తి మాటలెందుకు?  ప్రకృతి అంతా నిండుగా తయారై మధురమైన పూర్ణత్వాన్ని, ఆనందాన్ని వ్యక్తీకరిస్తుంటే నీవు నీరసంగా విరక్తి భావాలలో ఎలా కాలం వెళ్ళబుచ్చగలవు? నీవు ప్రకృతి కంటే తెలివైనవాడవా? లేక ప్రకృతి తెలివిలేనిదా?' అని ప్రశ్నిస్తాడు. 'ఈ ప్రకృతి వన్యపధంబుల బూలపండువుం జులుప నుపక్రమించె, విరసంబగు శుష్క విరక్తి మార్గముల్ పలుకకు. మూడునాళ్ళ ముచ్చట గదా మన మురిపెంబు' అంటాడు.

చెలి కనిపించక విరహతప్తుడై 'చెలియ, మనోహర ప్రణయశీతలతన్ సుఖియించు నామనం బలమటతో దపించు నకటా భవదీయ వియోగ కీలలన్' చల్లని నీ ప్రణయంలో సుఖంగా ఉన్న నా మనస్సును ప్రస్తుతపు నీ వియోగమనే అగ్నిజ్వాల కాలుస్తున్నది. 'ప్రాణముల్ త్వదంఘ్రుల విడిపింతు రమ్ము బ్రతుకున్ నిలబెట్టేద నిట్టి యాసలన్' నిన్ను ఒక్కసారి చూచి నా ప్రాణాలను నీ పాదాల దగ్గర వదలాలనే కోరికతోనే నేను ఇంకా ప్రాణాలతో ఉన్నాను. అంటూ చమత్కరిస్తాడు మధుర ప్రేమికుడైన ఖయ్యాం.     

వలపుల దివ్వె నీమృదుల పాదలతాంతము ముద్దు గొందు, న
న్యల మధురాధరంబులయినం దులతూగవు దానితోడ, రా
త్రుల సహవాసకామినయి రోసియు నిన్ గనలేక భగ్నవాం
చలం జివురించు లజ్జ పెలుచం బవలెల్లను బుత్తు దీనతన్.     

'నీ మృదువైన పాదమనే లతను ముద్దిడాలని నా కోరిక. నీ సుకుమార పాదాలతో ఇతర భామినుల పెదవులు కూడా సాటిరావు. రాత్రులు నీకోసం వేచిఉండటంతో సరిపోతున్నది. కాని నీవు కనిపించవు. రాత్రంతా నీకోసం ఎదురుచూచి, చెదరిపోయిన భగ్నవాంఛలనుంచి పుట్టిన సిగ్గుతో పగలంతా దీనుడనై కాలం గడుపుతున్నాను.నీకు తెలియటంలేదా?' అని బాధపడతాడు.

ఖయ్యాం కామాతురుడు కాదు. అతనొక సున్నిత మధురప్రేమికుడు. లలితమైన ఆ భావాన్నే ఈ పద్యంలో ప్రకటిస్తాడు.

అయితే తాగడాన్నీ, ప్రియురాళ్ళతో తిరగడాన్నీ ఖయ్యాం సమర్ధించాడా? ఇదేమి తత్వచింతన? ఇదేమైనా గొప్ప ఫిలాసఫీనా? ప్రతి వెధవా చేసే పని ఇదే కదా? అన్న అనుమానం చాలామందికి వస్తుంది. ఖయాం యొక్క బహుముఖ ప్రతిభ తెలియకపోతే ఇలాంటి అనుమానాలు వస్తాయి. అందుకే అతని బ్యాక్ గ్రౌండ్ మనకు ముందుగా తెలియాలి. అతను ఏ కోణంలో దేని గురించి మాటలాడుతున్నాడో తెలియాలి.అప్పుడే అతను సరిగ్గా అర్ధమౌతాడు. 

అతని మీద ప్రాచీన గ్రీక్ తత్వవేత్త 'ఎపిక్యూరస్' భావాలున్నాయని కొందరు అన్నారు. కాని వారనుకున్నట్లు అతను నాస్తికవాది కాదు. లోకాయత చార్వాకుల లాగా 'ఈ లోకమే సత్యం, పరలోకం లేదు, ఏదో రకంగా భోగాలు అనుభవించు' అని చెప్పిన నాస్తికుడూ కాదు. అందుకే ఇతన్ని అర్ధం చేసుకోవడం చాలా కష్టం.

ఖురాన్ లో అతను మంచిపండితుడు, రాజులకు సలహాదారు, వారి మత సమస్యలనూ అనుమానాలనూ తీర్చిన మౌల్వీ. దానికి తోడూ సైన్స్ పరిజ్ఞానం ఉన్న మంచి దార్శనికుడు. గ్రీక్ తత్వశాస్త్రాలే కాక, ఆల్జీబ్రా జ్యామెట్రీ, ఆస్ట్రానమీ లలో మంచి దిట్ట. అతను వయసులో ఉన్నపుడు మంచిమంచి గురువుల దగ్గర విద్యనభ్యసించాడు. 'ఉత్తమోత్తమ గురుల శిష్యుండనైతి, గురువునైతిని సచ్చిష్య కోటులకును' అంటూ తనగురించి తానె చెప్పుకున్నాడు. అటువంటి పండితుడూ తాత్వికుడూ చవకబారుగా తాగుడునూ తిరుగుడునూ సమర్దిస్తాడా? అసంభవం. అలాంటి భావాన్ని  అసలు ఊహించలేము. కనుక అతను చెబుతున్న దానిలో ఏదో మార్మికార్ధం ఉన్నది అన్న సంగతి వెంటనే స్ఫురిస్తుంది.

మధ్యయుగపు జ్ఞానులందరూ మార్మికభాషలో మాటలాడినవారే. ఎందుకంటే ఉన్నతమైన భావాలను వచనంలో చెప్పలేము.దానికి కవిత్వధోరణి అవసరం. జ్ఞాని, కవి కూడా అయినప్పుడే అతడు తన అనుభూతిని మాటల్లోకి కొంతైనా తేగలడు.లేకుంటే అతడేమీ చెప్పలేడు.మౌనంగా ఉండిపోతాడు. అయితే కవికీ జ్ఞానికీ భేదం లేదా? అంటే ఉన్నది అనే చెప్పాలి.కవి ఇంద్రియాల పరిధిలో అనుభవించి, తన అనుభవాన్ని మాటల్లోకి తెస్తాడు. అయితే అతను సామాన్యజనం కంటే కొంత ఉదాత్తస్తితిని అందుకోగలడు.మామూలు మనుషులు రోడ్డుమీద నడిచేవారు. కవి ఒక అయిదు అంతస్తుల భవనం ఎక్కగలడు. కాని జ్ఞాని, మేఘాలు దాటి శూన్యాకాశంలోకి దూసుకుపోగలడు. అదీ తేడా. జ్ఞాని ఇంద్రియపరిధిని దాటి పోగలడు. అక్కడ ఏముందో దానిని కిందకు దించే ప్రయత్నం చెయ్యగలడు. కవి ఆ పని చెయ్యలేడు. అందుకే కవికూడా జ్ఞాని పాదాలవద్ద మోకరిల్లవలసిందే.

ఆ కాలంలోని సూఫీ సంప్రదాయాలలో, 'మధువు' అనేది దైవానుభూతి వల్ల కలిగే ఆనందానికి సూచన. 'సాకీ' అనేది సాధకుని మనస్సు. సాకీ సాంగత్యంలో మధువును తాగి మైమరచి పోవడం అంటే, ఏకాంతంలో మనస్సును అంతర్ముఖం చేసి దైవానుభూతిలో సొక్కి ఆనంద తన్మయత్వంలో మునిగి ఉండటం అని అర్ధం. ఇది సమాధి స్తితికి సంకేతం. మన తంత్రసాధనలో కూడా మద్యమూ మైధునమూ విడతీయరాని భాగాలే. ఈకోణంలో నుంచి చూస్తే అతని పద్యాలన్నీ ఒక గొప్ప ఆధ్యాత్మిక సౌరభాన్ని సంతరించుకుంటాయి. అతనిలోని సూఫీ అప్పుడు మనకు దర్శనమిస్తాడు. మార్మికులు ఇలాగే మాట్లాడతారు. వారు దేనినీ సూటిగా చెప్పరు. ఒక వేమన అయినా ఒక వీరబ్రహ్మం అయినా ఒక బసవేస్వరుడైనా  లేక తాంత్రికయోగులైనా ఎవరైనా సరే నిగూఢమైన భాషలోనే సత్యాన్ని చెబుతారు. మచ్చుకి వేమన పద్యం ఒకటి చూద్దామా.

కుక్క దిన్నవాడు గురులింగ జంగంబు 
పంది దిన్నవాడు పరమగురుడు 
ఏన్గు దిన్నవాడు ఎంత సుజ్ఞానిరా 
విశ్వదాభిరామ వినురవేమ 

ఇది చదవడంతోనే - ఏమిటీ చండాలం? ఇదా వేమన చెబుతున్నది? అనిపిస్తుంది. కాని దీనిలో గొప్ప యోగార్ధం ఇమిడి ఉంది. అసలు యోగులు దేనినైనా ఇలా మార్మికంగా ఎందుకు చెబుతారు?సూటిగా ఎందుకు చెప్పరు? అంటే, సూటిగా ఎందుకు చెప్పాలి అని ఎదురు ప్రశ్న ఉదయిస్తుంది. అన్నీ అందరికీ ఎందుకు చెప్పాలి?  మీ డబ్బును మీరు రోడ్డుమీద ఎందుకు పారబోసుకోవడం లేదు? ఇంట్లో ఎందుకు దాచుకుంటున్నారు? అని వారు ఎదురు ప్రశ్నిస్తారు. మామూలు డబ్బుకే మనిషి ఇంత విలువ ఇస్తుంటే, ఇక అమూల్యమైన ఆధ్యాత్మిక సంపదను రోడ్డుమీద ఎలా పారబోస్తాం? అది జరగని పని. 

ఆధ్యాత్మికత అందరికోసం కాదు. అది చాలా కొద్దిమంది కోసం మాత్రమే ఉద్దేశించబడింది. ప్రపంచంలో అమూల్యమైనవి అందరికీ దక్కవు. అవి కొందరి దగ్గరే ఉంటాయి. అలాగే ఉండాలి కూడా. అందుకే అర్హత ఉన్నవారికి మాత్రమె అర్ధంకావడం కోసం యోగులు అలా మార్మికభాషలో చెప్తారు. తపన ఉన్నవాడు దానిని అర్ధం చేసుకోవాలని ప్రయత్నం చేస్తాడు. వాడికి అర్ధమౌతుంది. ఆ తపన లేనివాడు వారి మాటలు చదివి 'ఇదేదో సోదిలే' అని ఒదిలేస్తాడు.అలాంటి వారు యోగులకు అక్కర్లేదు.వారికి అర్ధం కాకపోవడమే యోగులకు కావాలి. కనుక అలాంటివారిని వదిలించుకోవడం కోసం సత్యాలను కావాలని మార్మికభాషలో చెప్తారు.

(సశేషం)