"నిజమైన గురువనేవాడు ఎక్కడైనా ఉంటే, ముందుగా తననుంచి నిన్ను విముక్తుణ్ణి చేస్తాడు" - యూజీ

10, జులై 2011, ఆదివారం

ఓషో ఉత్తరాలు -15

(ఈ ఉత్తరం 1964 లో వ్రాసినది.)

ప్రేమాశీస్సులు.

ఎంతో ప్రేమతో నీవు వ్రాసిన ఉత్తరం నాకు చేరింది. నా మాటలు నీ చెవులలో ప్రతిధ్వనిస్తున్నాయని వ్రాశావు.
 
ఎక్కడైతే అంతా నిశ్శబ్దంగా ఉంటుందో, శూన్యంగా ఉంటుందో ఆ అంతరాళానికి  నా మాటల ప్రతిధ్వని నిన్ను చేర్చాలని ఆశిస్తున్నాను. శబ్దం నుంచి నిశబ్దానికి ప్రయాణం అంటే అదే. అక్కడే తనను తాను ముఖాముఖీ కలుసుకోవడం జరుగుతుంది.

నేను మహానందంలో ఉన్నాను. నా ప్రేమను స్వీకరించు.


నా దగ్గర ఇవ్వడానికింకేమీ లేదు. ఇదొక్కటే నాకున్న సంపద. ఈ సంపద యొక్క అద్బుతం ఏమిటంటే ఇది ఇచ్చిన కొద్దీ పెరుగుతుంది.
 
నిజమైన సంపద లక్షణం ఇదే. ఇతరులకు ఇచ్చేకొద్దీ అది ఇంకా పెరుగుతుంది. ఒకవేళ అలా ఇవ్వడం ద్వారా అది తగ్గిపోతుంటే, అది నిజమైన సంపద కాదు.

జాబు వ్రాయి.

 
నా ఉత్తరాలకోసం నీవు మాత్రమె వేచి చూడటం లేదు.
నీ ఉత్తరాల కోసం నేను కూడా వేచి చూస్తున్నాను. 
 -----------------------------------------------------------------------------

ఓషో ఉత్తరాల పరంపరను, చాల నెలల వ్యవధి తర్వాత మళ్ళీ మొదలు పెడుతున్నాను. ఓషో గారికి నా హృదయంలో ప్రత్యెకస్థానం ఉంది. మహనీయులలో మొదటి వరుసలో ఆయన్ని నేను ఉంచుతాను. పనికిరాని లోకాభిప్రాయాన్ని బట్టి ఏర్పరచుకున్నది కాదు నా అభిప్రాయం. ఆయన స్థాయి నాకు తెలుసు. నేను చదివిన ప్రపంచ ఆధ్యాత్మిక సాహిత్యాన్ని బట్టి, నా వ్యక్తిగత అనుభవాన్ని బట్టి,  నేను ఆ నిర్ధారణకు వచ్చాను. ప్రస్తుతం మనకు దొరుకుతున్న అన్ని రకాల ప్రపంచ మతసాహిత్యాన్నీ, మహనీయుల రచనలనూ నేను చదివానని ధైర్యంగా చెప్పగలను. ఇది స్వోత్కర్ష కాదు.

ఓషో గారిని ప్రపంచం చాలా పొరపాటుగా అర్ధం చేసుకున్నది. ఆ మాటకొస్తే ఏ మహానీయుణ్నీ
ప్రపంచ ప్రజలు సరిగ్గా అర్ధం చేసుకోలేదు. ఎందుకంటే వీళ్ళకి కావలసింది భుజాన ఎక్కించుకొని మోసే ఒక ప్రవక్త. "అలా కుదరదు. నేను నిన్ను మొయ్యను. నీ నడక నీవే నడవాలి." అని సూటిగా చెప్పే వారు వీరికి నచ్చరు. "మీరెన్ని పాపాలు చేసినా నా దగ్గరికి రండి నేను మిమ్మన్ల్ని గమ్యం చేరుస్తాను"-- అని చెప్పే జీసస్ లాటి, షిర్డీ సాయిబాబా లాంటి ప్రవక్తలే వీళ్ళకి కావాలి. నిజమైన జీసస్ బోధ, షిర్డీ సాయిబాబా బోధ అది కాదనుకోండి. అది వేరే సంగతి.

సమకాలీన సమస్యలనూ, ఆధ్యాత్మిక జీవిత సారాన్ని, సాధనా లోతులనూ విశ్లేషిస్తూ అతి కొద్ది మాటల్లోనూ, అతి వివరణాత్మకమైన ప్రసంగాలలోనూ, ఓషో వివరించినంత చిక్కగా చక్కగా ఇప్పటి వరకూ వచ్చిన ఏ మహాపురుషుడూ మతాన్నీ ధర్మాన్నీ
వివరించలేదని నేను ఘంటాపధంగా చెప్పగలను. అంత మాత్రం చేత ఇతరులను నేను తక్కువ చేస్తున్నానని అనుకోకూడదు. ఓషో వాణిలో ప్రతిఫలించినంత దివ్యశక్తి వివేకానందునిలోనూ, రమణమహర్షి లోనూ కూడా లేదంటే అది అతిశయోక్తి కాదు. నేను వీరిద్దరినీ చిన్నతనం నుంచీ చదివానని, ఓషోనూ ఆమూలాగ్రం చదివాననీ,    చదివిన తర్వాతనే ఈ మాటలు అంటున్నానని అర్ధం చేసుకోవాలి.  ఓషో ను వీరిద్దరి కంటే పై స్థాయిలో ఉంచకపోయినా, కనీసం వీరితో సమానస్థాయిలో ఉంచాలని నా నమ్మకం. 

ఒక శిష్యునికి జవాబు ఇస్తూ 1964 లో ఓషో వ్రాసిన ఉత్తరం ఇది. దీనిలో చాలా లోతైన అర్ధం ఉంది.

"మీ మాటలు నా చెవులలో ఇంకా ప్రతిధ్వనిస్తూ ఉన్నాయని" ఒక శిష్యుడు వ్రాశాడు. దానికి స్పందిస్తూ ఓషో ఇలా అంటారు. "ఆ మాటలు ఊరకే నీ చెవులలో
ప్రతిధ్వనిస్తే చాలదు. అవి నిన్ను మాటలూ, శబ్దాలూ లేని ఆకాశంలోకి తీసుకుపోవాలి. ఎక్కడైతే నిన్ను నీవు ముఖాముఖీ దర్శించగలవో  అక్కడికి అవి నిన్ను చేర్చాలి. ఇదే అతి ముఖ్యమైన విషయం. నన్ను పొగడటం కాదు ముఖ్యం. నీవు గమ్యం చేరడం ముఖ్యం."

నేటి గురువులు ఈ మాటలనించి నేర్చుకోవలసింది ఎంతో ఉంది. పాదపూజలు చేయించుకుంటూ డబ్బులు తీసుకునే నేటి దొంగ గురువులు ఈ మాటలు విని సిగ్గుతో తలవంచుకోవాలి. వేశ్యలకూ వీరికీ తేడా ఏముంది?
దశాబ్దాల తరబడి శిష్యులలో ఏ ఎదుగూ బొదుగూ లేకున్నా వారికి సత్యాన్ని మాత్రం తప్ప  మిగిలిన అన్నీ చెబుతూ, వారి జేబులు మాత్రం ఖాళీ చేస్తున్న నేటి గురువులూ స్వాములూ ఈ మాటలు విని సిగ్గు పడాలి. 

తన ఉత్తరంలో శిష్యుడు గురువుమీద ఉన్న భక్తిని చాటుకున్నాడు. దానికి ఓషో పొంగిపోలేదు. " నీ భక్తి అంతటితో ఆగరాదు. అది నిన్ను నీకు చూపించాలి. ఆత్మసాక్షాత్కారాన్ని నీకు కలిగించాలి. శబ్దం నుంచి నిశ్శబ్దానికి నిన్ను చేర్చాలి. ఆ దిశగా నీవు ప్రయానిస్తున్నావా లేక ఒక ఈగోట్రిప్ లో ఇరుక్కుంటున్నావా గమనించు" అని చెప్తున్నాడు. శిష్యులను బానిసలలాగా తమ చెప్పుచేతల్లో ఉంచుకొని వారి విరాళాలతో విలాసాలు అనుభవిస్తున్న నేటి దొంగ గురువులు ఈ మాటలు బాగా అర్ధం చేసుకోవాలి. 

గురువు మీద శిష్యునికి ఉన్న భక్తి మంచిదే. కాని అది స్వాతంత్ర్యానికి దారి చూపాలి. బానిసత్వానికి కాదు. గురు శిష్యుల బంధం ఒక లవ్ ఎఫైర్ లాటిది. ఇద్దరి లోనూ ఒకే హృదయమే స్పందిస్తుంది.ఇద్దరి భావాలూ ఒకే విధంగా మారిపోతాయి. వేల మైళ్ళ దూరాన ఉన్నా ఒకరి భావాలు ఒకరిలో ప్రతిస్పందిస్తాయి. అదే నిజమైన గురుశిష్య బంధం. అటువంటి ప్రేమ ఉన్నచోట శిష్యునికి ఆత్మోన్నతి అతి శీఘ్రంగా కలుగుతుంది. గురువు ఆ
త్మస్తితుడే, కనుక గురువు పైన ఉన్న ప్రేమవల్ల ఆ స్థితి శిష్యునికి కూడా అలవోకగా కలుగుతుంది. అటువంటి స్తితిని పొందమని ఓషో ఈ ఉత్తరం లో సూచిస్తున్నాడు.

" నేను ఆనందంలో ఈదులాడుతున్నాను. ఈ ఆనందాన్ని నీవూ తీసుకో. ఆనందించు. నేనున్న చోటికి నీవూ రా. ఈ సీమలోని మత్తును ఆనందాన్ని నీవూ చవిచూడు." అని ఆహ్వానిస్తున్నాడు. ఏ సద్గురువైనా ఇదే చెయ్యాలి. ఇదే చేస్తాడు కూడా. అలాటి వాడే బోధగురువు. మిగిలిన అందరూ బాధగురువులే.

నిజమైన గురువుకు మనం ఇచ్చే గౌరవాలు, పొగడ్తలు, కట్టే గుళ్ళూ గోపురాలూ, పెట్టె కిరీటాలు, ఇచ్చే విరాళాలూ ఏ మాత్రం అక్కర్లేదు. అవన్నీ అతనికి చెత్తతో సమానం. తానున్న స్తితికి తన శిష్యుడు కూడా చేరితే ఆనందించే వాడూ, చేరాలని తపన పడేవాడూ, చేర్చాలని ప్రయత్నించేవాడే నిజమైన సద్గురువు. " నన్ను నమ్ముకో నీ లౌకిక పనులు అవుతాయి. మందిరానికి విరాళం ఇవ్వు. నీ కూతురు పెళ్లి అవుతుంది." అని చెప్పేవాడు దొంగ గురువు. ఇలాటి దొంగ గురువుల వెంట పరిగెత్తే నేటి మూర్ఖ జనం ఓషో ని అర్ధం చేసుకోలేకపోవడం వింత కాదు. లోయలోని చీకట్లో అఘోరించేవాడికి, ఎవరెస్ట్ శిఖరం మీద ఉన్న వెలుగు ఎలా అర్ధమౌతుంది ?

" సంపద " అన్న పదాన్ని ఓషో ఇక్కడ వివరిస్తాడు. లౌకిక సంపద ఇచ్చేకొద్దీ తరిగిపోతుంది. ఆధ్యాత్మిక సంపద అలా కాదు. అది ఇంకా పెరుగుతుంది. మనం ఇతరులకు ఇచ్చేకొద్దీ ప్రకృతి ఇంకా మనకు ఇస్తూనే ఉంటుంది. ఈ విషయాన్నే శ్రీ రామక్రిష్ణులూ చెప్తారు. ఇస్తే తరిగిపోయే సంపద నిజమైన సంపద కాదు అన్న విషయాన్ని కూడా ఆయన చెప్పాడు. "విద్యాధనం ఎవరూ అపహరించలేని ధనం"-- అన్న సామెత మనకు తెలుసు. "ఆధ్యాత్మవిద్యా విద్యానాం-- విద్యలలో ఆధ్యాత్మవిద్యను నేను" అన్నాడు భగవంతుడు. కనుక ఆధ్యాత్మ విద్య మామూలు విద్యకంటే గొప్పది. మామూలు విద్యనే ఎవరూ మననుంచి లాక్కోలేరు. ఇక ఆధ్యాత్మ విద్య అయితే మనం ఇతరులకు ఇచ్చేకొద్దీ
ఇంకా పెరుగుతుంది కాని తరిగిపోదు. అదే ఈ విద్య యొక్క ప్రత్యేకత. ఏది నిజమైన సంపదో, ఏది కాదో-- దేనికోసం మనిషి తాపత్రయ పడాలో, దేనికోసం పరుగు కూడదో -- దీన్ని బట్టి నేటి పిచ్చి గురువులూ, పిచ్చి జనమూ  అర్ధం చేసుకోవాలి మరి.

ఈ ఉత్తరం చివర్లో ఓషో ఒక అద్భుతమైన మాట చెబుతారు. నిజమైన గురువు కూడా శిష్యుని కోసం ఎదురుచూస్తాడు. సత్య సాక్షాత్కారాన్ని అతనికి కలిగించాలని తపిస్తాడు. లోకం చీకట్లో ఉందే అని బాధ పడతాడు. బుద్దుడూ, రామక్రిష్ణుడూ, వివేకానందుడూ, రమణ మహర్షీ ఈ కోవకు చెందినవారే.
లోకానికి సత్యాన్ని చెప్పాలని బుద్ధుడు తపించాడు. తన శిష్యులకోసం రామకృష్ణుడు విలపించాడు. తన 21 ఏట ఓషో ఆత్మానుభవాన్ని పొందాడు. ఆ తరువాత దాదాపు 37 ఏళ్ళు లోకానికి సత్యాన్ని చెప్పాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు. బుద్ధుడూ అంతే చేశాడు. అలాటివాళ్ళు సద్గురువులు.

తన సుఖం తాను చూసుకునేవాడు సద్గురువు కాదు. శిష్యులకు లేనిపోని మాయమాటలు చెప్పి వారిని బుట్టలో వేసుకుని తన విలాసాలకు వారిని వాడుకునేవాడు సద్గురు పదానికి అనర్హుడు. మరి లోకులందరూ అలాటి వాళ్ళ వెనుకే పరిగేట్టుతున్నారేమిటి? దీనివెనుక ఒక రహస్యం ఉన్నది. మనకు తగిన గురువులే మనకు దొరుకుతారు. ఎవరికి సత్యం అక్కర్లేదో, ఎవరికి వారి వారి అహమే సర్వస్వమో, ఎవరికి వారి వారి లౌకిక ప్రయోజనాలు తీరడమే పరమానందమో, అట్టివారు దొంగ గురువుల వలలో పడక తప్పదు. ఎందుకంటే వారి చూపు సత్యం మీద లేదు,  కాబట్టి అటువంటి వారు దొంగగురువుల వలలో పడిపోతారు.
  
శిష్యుడు గురువును ప్రేమించడం గొప్ప కాదు. గురువులో అతను ఒక అద్భుతాన్ని చూస్తాడు. గురువు యొక్క ప్రజ్ఞకు అతడు ముగ్దుడౌతాడు. కానీ--గురువు కూడా శిష్యుని అంతగానూ ప్రేమిస్తాడు. ఒకప్పటి తన స్థితిని ఇప్పటి తన శిష్యునిలో గుర్తించి, తను నడిచిన దారిలో, తను పడిన బాధలు పడకుండా, శిష్యుడు గమ్యం చేరాలని గురువు కోరుకుంటాడు. అదే అతని కరుణకు సంకేతం. అది గురువు యొక్క కరుణ కాదు. విశ్వ ప్రభుని యొక్క అనంతమైన కరుణే గురువు ద్వారా అలా ప్రతిఫలిస్తుంది.

శిష్యుని నుంచి ఏమీ కోరని వాడే సద్గురువు. శిష్యునికి సత్యాన్ని ఉన్నదున్నట్లుగా, మోసం లేకుండా, స్వార్ధం లేకుండా, చెప్పేవాడే సద్గురువు. తానున్న స్థాయికి శిష్యుని చేర్చేవాడే సద్గురువు. భగవంతుని దివ్య సన్నిధికి శిష్యుని చేయి పట్టుకొని నడిపించగలవాడే  సద్గురువు.


సద్గురువు లక్షణాలను ఓషో ఈ ఉత్తరంలో చెప్పకుండా చెప్పాడు.