“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

31, మే 2011, మంగళవారం

జిడ్డు కృష్ణమూర్తి జీవితం-తత్త్వం-2

కృష్ణమూర్తి సాధన 1909 లో తియసఫి గురువుల పరిచయంతో మొదలైంది. అది తనలో తనకే కలిగిన  సహజమైన తపన వల్ల మొదలైందా లేక వాళ్ళ ప్రోద్బలం వల్ల మొదలైందా అంటే రెండవదే కరెక్ట్ అని నా భావన. మొదటి ప్రేరణ వల్ల ఆయన సాధన మొదలైతే, తనలో పరిష్కారం కాని చిన్న తనపు సైకలాజికల్ కాంప్లేక్సేస్, పెద్ద అయిన తర్వాత కూడా మిగిలి ఉండటానికి ఆస్కారం లేదు. అటువంటప్పుడు రోసలిన్ తో రహస్య వ్యవహారం నడిపే ఆలోచనే తలెత్తదు. 

కనుక నాకేమనిపిస్తుందంటే, సాధన చేద్దామన్న తపన తనంతట తనకు సహజంగా ఆయనకు కలగలేదు. అది ఇతరుల ప్రోద్బలం మీద జరిగింది. ఆయన జీవితంతో తియాసఫీ గురువులు ఆడుకున్నారు. అందుకే ఆయన ఒక స్థాయిలో వారితో విభేదించాడు. వారిని తిరస్కరించాడు. అందుకే ఆయన సాధన కూడా చివరికి ఎటూ తేలని ఒక చిక్కుముడిలా అలా మిగిలిపోయింది. దీనివెనుక ఇంకా కొన్ని మార్మిక రహస్య విషయాలున్నాయి. అవి ముందు ముందు చర్చిస్తాను. 

జ్యోతిష్య పరంగా చూస్తె, 1909 లో ఆయన జాతకంలో గురు మహాదశ మొదలైంది. గురువు షష్ఠ స్థానంలో ఉంటూ రాహు నక్షత్రంలో స్థితుడై ఉన్నాడు. మకర లగ్నానికి గురువు మంచివాడూ, యోగకారకుడూ కాదు. ఈ లగ్నమే ఆయనకు నీచ స్థానం. అయితే గురువు యొక్క తృతీయాదిపత్యం  వల్ల ఈ లగ్నం వాళ్లకు లోకంతో కమ్యూనికేషన్ ఆధ్యాత్మికపరంగానే ఉంటుంది. అలాగే వీళ్ళకు ఆధ్యాత్మికస్థానం కూడా బలంగానే ఉంటుంది గాని దానివల్ల వీళ్ళకు ఉపయోగం ఏమీ ఉండదు. జిడ్డు జాతకంలో గురువుకు నక్షత్ర స్థాయిలో రాహుస్పర్శ ఏర్పడింది.  రాహుస్పర్శ వల్ల గురుచండాలయోగం ప్రత్యక్షమైంది. అందుకనే భారతీయ గురువులు కాకుండా యూరోపియన్ గురువులు ఈయనకు దగ్గరైనారు. వారు అభ్యాసం చేసినది కూడా ఉడికీ ఉడకని రకరకాల ముక్కలసాంబార్ లాంటి తియోసఫీ సిద్ధాంతాలు.  వారు సిద్ధి పొందిన గురువులు కారు, అకాడెమిక్ గురువులు మాత్రమే. అకాడెమిక్ గురువులు ఆధ్యాత్మికతను బోధించలేరు. ఎందుకంటే ఆధ్యాత్మికత అనేది క్లాసురూముల్లో పాఠాలు చెప్పినట్లు చెప్పే ఉపన్యాసవిద్య కాదు. అది పుస్తకాలు చదివి వేరొకరికి అప్పజెప్పే జ్ఞానం కాదు. దురదృష్టవశాత్తూ  ఇటువంటి  అనుభవంలేని ఆధ్యాత్మిక రచయితలతో, గురువులతో లోకం నిండిఉంది. కాని అనుభూతి  పొందిన గురువే దానిని ఇంకొకనికి బోధించగలడు.  దారి చూపించగలడు. ఆధ్యాత్మిక లోకంలో గీటురాయి అనుభూతి మాత్రమే. 

రకరకాల దేశాలరాజ్యాంగాలను మనకు అవసరం ఉన్నా లేకపోయినా కాపీకొట్టి అతుకులబొంతలా తయారుచేసిన మన రాజ్యాంగం ఎంత అద్భుతంగా (అద్వాన్నంగా ) పనిచేస్తున్నదో, రకరకాల మతాలూ మార్మిక విషయాల కాపీ అయిన తియాసఫీకూడా అంతే అద్వాన్నంగా పనిచేస్తుంది. కారణం ఏమంటే తియాసఫీ లో నకిలీ తప్ప  ఒరిజినాలిటి  ఏమీ లేదు.

ఒరిజినాలిటీ మీద నేను చేసిన ఈ కామెంట్ కొందరికి కోపాన్ని తెప్పించవచ్చు. కాని నిదానంగా ఆలోచిస్తే , ఒక్క చిన్నవిషయంతో నేను చెప్పింది నిజం అని అర్ధం చేసుకోవచ్చు. 1910 లో జిడ్డు కృష్ణమూర్తి ఆల్సియోన్ అనే కలం పేరుతో ఒక పుస్తకం వ్రాశాడు. దాన్ని లెడ్ బీటరే వ్రాశాడో లేక ఈయనే వ్రాశాడో మనకు తెలియదు. వరల్డ్ టీచర్ గా ఆయన్ను ప్రోమోట్ చెయ్యాలన్న తపనలో జిడ్డు చేత వాళ్ళే ఈ పుస్తకాన్ని వ్రాయించి ఉంటారు అని నా భావన.   దాని పేరు At the feet of the Master. దానికి అనీబెసంట్ పీఠిక వ్రాశింది. మనం ఈ పుస్తకాన్ని చదివితే మొదటిపేజీలు  కొన్నిచదివిన వెంటనే ఒక్క విషయం అర్ధం అవుతుంది. ఇది ఆదిశంకరుల "వివేకచూడామణి" కి మక్కీకి మక్కీ కాపీ అని. కొన్ని ఉదాహరణల ద్వారా నేను చెబుతున్నది నిజం అన్న విషయం రుజువు చేస్తాను. 

ఈ పుస్తకం లో మొదట్లోనే ఇలా ఉంటుంది.       

Four qualifications there are for this pathway.

Discrimination
Desirelessness
Good conduct
Love

దీనినే వివేక చూడామణిలో  ఆదిశంకరులు -- నిత్యానిత్య వస్తువివేకము, ఇహాముత్ర ఫలభోగవిరాగము, శమాది షట్క సంపత్తి, ముముక్షుత్వం -- అని సాధకునికి ఉండవలసిన నాలుగు ముఖ్యలక్షణాలుగా, సాధనా చతుష్టయముగా చెప్పారు.

శ్లో|| ఆదౌ నిత్యానిత్య వస్తు వివేక పరిగణ్యతే
ఇహాముత్ర ఫలభోగ విరాగ స్తదనంతరం 
శమాది షట్కసంపత్తి ర్ముముక్షుత్వ మితి స్ఫుటం ||  
 
దాని తర్వాత జిడ్డు ఇంకా ఇలా వ్రాస్తారు.

The six points of conduct which are specially required are given by the Master as,

1.Self control as to the mind.
2.Self control in action.
3.Tolerance
4.Cheerfulness.
5.One pointedness.
 6.Confidence.

మనం వివేక చూడామణిని పరిశీలిస్తే, ఆది శంకరులు తన బోధలో భాగంగా, శమాది షట్క సంపత్తిని వివరిస్తూ ఇలా అంటారు. 
"శమము (మనో నిగ్రహము), దమము (బాహ్యేంద్రియ నిగ్రహము), తితిక్ష (ఓర్పు), సంతోషము, శ్రద్ధ, సమాధానము -- అనబడే ఈ ఆరూ కలిపి శమాదిషట్కసంపత్తి ( శమము మొదలైన ఆరుసంపదలు) అనబడుతవి. సాధకుడైనవాడు వీటిని కలిగి ఉండాలి.  మరియూ నిత్యమూ అభ్యాసం చేస్తూ ఉండాలి." 

శంకరులు చెప్పిన ఈ ఆరు లక్షణాలనే జిడ్డు ఇంగ్లీషులోకి తర్జుమా చేసి వ్రాశాడు. కనుక జిడ్డు చెబుతున్నది -- శంకరులు వివేకచూడామణి లో చెప్పినదానికి కాపీ అని క్లియర్ గా అర్ధమౌతుంది.


పై విషయాన్ని పరిశీలిస్తే, వేదాంత గ్రంధాలలోని భావజాలాన్ని తీసుకుని వాటికి తియసఫీ ముద్ర వేసి ఆ భావాలను హిమాలయన్ మాస్టర్స్ తనకు చెప్పారని జిడ్డుతో వ్రాయించినట్లు చక్కగా కనిపిస్తుంది. వివేక చూడామణి నుంచి కాపీ కొట్టినపుడు, దానిని వ్రాశిన  ఆదిశంకరుల పేరును ఎక్కడా  ప్రస్తావించకపోవడం శోచనీయం. ఆధ్యాత్మికరంగంలో ప్లేగియారిజం నాటికీ నేటికీ చాలా ఎక్కువ. నేడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా  తామరపంపరగా పుట్టుకొస్తున్న యోగాగురువులందరూ ఓషోరజనీష్  భావజాలాన్ని యధేచ్చగా  కాపీకోడుతున్నవారే. కాకుంటే ఆయనలోని నిజాయితీ వీళ్ళ వద్ద లేదు. ఉన్నదున్నట్లు చెప్పే ధైర్యం వీళ్ళకు లేదు. ఆయన్ని కాపీ కొడుతున్నామని ఎవరూ చెప్పరు. అలాగే నిన్న మొన్నటి వరకూ ఉన్న గురువులందరూ రామకృష్ణ వివేకానందుల భావాలను కాపీ కొట్టిన వారే. వీరి ముగ్గురి భావాలను దాటి కొత్త  విషయం చెప్పినవారు, ప్రయత్నించినవారూ ఒక్క అరవిందులు తప్ప ఎవరూ లేరు. భావాలకు కాపీ రైట్ లేదు కదా. 

లెడ్ బీటర్, అనీబెసంట్  మొదలైనవారు భారతీయ జ్ఞానమార్గాన్నీ, ధ్యానమార్గాన్నీ, ఇంకా వాళ్లకు తోచిన అనేక మార్గాలను కలగలిపి సాంబార్ వండి, ఆ ఉడికీ ఉడకని సాంబారును ఇంగ్లీషుగ్లాసులో పోసి  జిడ్డు చేత బలవంతంగా తాగించారు అని తెలుసుకోడానికి ఈ రెండు విషయాలు చాలు.  వారు ఆయనకు బోధించిన సూత్రాలలో వారియొక్క ఒరిజినాలిటీ ఏమీ లేదు. అవన్నీ ప్రాచీన వేదాంత గ్రంధాల నుండి కాపీ కొట్టిన విషయాలు.  అంతే గాక ఆయా సూత్రాలనూ, మార్గాలనూ వారు ముందుగా అనుసరించి వానిలో సిద్ధిని పొందినవారు కారు. పైగా ఇంకొక్క విచిత్రమేమిటంటే ఆయనకు అసలు ఆకలి ఉందాలేదా అన్నవిషయం కూడా వాళ్ళు పట్టించుకోకపోవడం ఒక ఎత్తైతే, ఈ విషయాలు క్లాస్ రూం లో బోధించేటటువంటి అకాడెమిక్ సబ్జెక్టులు కావనీ బోధించేవానికి వీనిలో గట్టి అనుభవం ఉండాలనీ, దానికి తగిన సాధనలను గురువుగా అతను ఇంతకుముందే ఆచరించి ఆ తరువాత మాత్రమె శిష్యునికి చెప్పాలన్న విషయాన్నీ వాళ్ళు విస్మరించారు. కనుకనే జిడ్డుకు వాళ్ళు ఆశించిన ఆధ్యాత్మిక  ప్రగతి రాకపోగా, జ్ఞానోదయం అయిన తరువాత విసుగుపుట్టి  వాళ్ళమీదే తిరగబడ్డాడు. 

వారి ముఖ్య ఉద్దేశ్యం చూడబోతే, ఒక వరల్డ్ టీచర్ ను తయారు చెయ్యాలి అన్న తొందర  తప్ప, దానికి దైవాదేశం ఉండాలనీ, శిష్యుని కంటే ముందు గురువులుగా తమకు అర్హత ఉండాలన్న ఎరుక ఉన్నట్లు కనిపించదు. ఒక సూపర్ స్పిరిట్యువల్ ప్రాడక్ట్ తయారు చేసి లోకం మీదకు వదలాలని వాళ్ళు భావించారు. కాని దానికోసం తమకు గల అర్హతలను వాళ్ళు పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించదు. కనుకనే చివరకు ఆయనే వారిని  తిరస్కరించాడు. ఈ విషయంలో మాత్రం జిడ్డుయొక్క సత్యాన్వేషణాతత్పరతను ఒప్పుకోవచ్చు. అనుభవం లేని గురువులు ఆధ్యాత్మిక ట్రయినింగ్ ఇవ్వబోతే ఇలాగే అవుతుంది.  ఇటువంటి వారిని చూచే, గుడ్డివాడు నడిపితే నడిచే గుడ్డివాడు-- ఇద్దరూ కలిసి గుంటలో పడతారు అని ఉపనిషత్తులు చెప్పాయి.