"నిజమైన గురువనేవాడు ఎక్కడైనా ఉంటే, ముందుగా తననుంచి నిన్ను విముక్తుణ్ణి చేస్తాడు" - యూజీ

5, అక్టోబర్ 2010, మంగళవారం

మనిషికీ మనిషికీ మధ్య.......

నిన్న నా స్నేహితుడొకాయన గుంతకల్ నుంచి ఏదో పనిమీద వచ్చి, పనైనతర్వాత, పలకరించి పోదామని నా దగ్గరికి వచ్చాడు.

ఆ మాటా ఈ మాటా అయిన తర్వాత యధావిధిగా సంభాషణ ఆధ్యాత్మికం వైపు మళ్ళింది.

అతను ఏదో విచారంగా కనిపించాడు.

"ఏంటి అదోలా ఉన్నారు?" అని అడిగాను.

మాటల మధ్యలో ఆయనకున్న సందేహాన్ని బయటపెట్టాడు.

"మనుషులమధ్యన అవసరంకోసం నటించే ప్రేమలు, స్నేహాలు ఎక్కువైపోతున్నాయ్. మానవ సంబంధాలు చాలా కృత్రిమంగా మారిపోతున్నాయి.ఏదో అవసరం లేనిదే ఎవరూ మాట్లాడటం లేదు. స్వచ్చమైన, నిష్కల్మషమైన పలకరింపులు కరువైపోతున్నాయి.అదే నాకు బాధగా ఉంది." అన్నాడు.

"మీకేమిటి నష్టం?" అన్నాను.

"మనమూ సమాజంలో భాగమేగా. పొద్దున లేచింది మొదలు రాత్రి నిద్రపోయేదాకా ఎదురైన ప్రతివాడూ మనసులో ఒకటి, బయటకొకటి. మాట్లాడే మాటల్లో స్వచ్చత, నిజాయితీ కనిపించటం లేదు.ఎదుటివాడు ఒక విషయం చెబుతుంటే వీడు మనసులో ఏం పెట్టుకుని ఈ మాటలు చెబుతున్నాడా అని ఆలోచించవలసి వస్తోంది. ఈ క్రమంలో మనం కూడా క్రుకెడ్ గా మారిఫోతున్నాం. కాలక్రమేణా మనలో కూడా మానసిక స్వచ్చత లోపించడం లేదూ? " అని వాపోయాడు.

నేను మౌనంగా చూస్తున్నాను.

"ప్రస్తుతం ఇదే నన్ను వేధిస్తున్న సమస్య. ఇలా కాకుండా మనుషులు చక్కగా నిష్కల్మషంగా మాట్లాడుకోలేరా? అలాటి సమాజాన్ని మనం చూడలేమా?" అన్నాడు.

అతను కూడా చాలా ఏళ్ళనుంచీ ధ్యానసాధన చేస్తున్నవాడే. అటువంటివారికే ఇలాటి సందేహాలూ బాధలూ కలుగుతుంటాయి. మామూలు మనుషులకొచ్చే సందేహాలకూ, ఇటువంటి వారికొచ్చే సందేహాలకూ చాలా తేడా ఉంటుంది. కాని మామూలు మనుషుల దృష్టిలో, దమ్మిడీకి పనికిరాని మాటలుగా ఇవి కనిపిస్తాయి.

అతనికి ఏదైనా చెప్పాలని నాకనిపించింది.

"దీనికంతటికీ "లాభాపేక్ష" అనేది కారణం. ఏదో ఒకటి ఆశించి ఎదుటివాడితో మాటలు మొదలు పెడితే ఇలాటివి జరుగుతుంటాయి. మీ నుంచి నేను ఏ రకంగానూ ఏమీ ఆశించనపుడు ఇటువంటి పోకడలు ఉండవు. కనీసం మీతో మాట్లాడటం వల్ల కలిగే మానసిక సంతృప్తిని కూడా నేను ఆశించరాదు. ఏ ఆశింపూ లేదు కనుక అలాటప్పుడు స్వచ్చంగా మాట్లాడుకోవటం జరుగుతుంది. మనుషుల మధ్యన బిజినెస్ యాటిట్యూడ్ ఉన్నంతవరకూ ఇలాగే ఉంటుంది." అన్నాను.

"మరెలా? మానవ సంబందాలు ఇలా ఉండాల్సిందేనా? మారవా?" అన్నాడాయన.

"ఈ సందర్భంగా ఓషో రజనీష్ చెప్పిన ఒక కధ గుర్తొచ్చింది. చెప్పమంటారా?" అన్నాను.

"చెప్పండి" అన్నాడాయన. ఆయన కూడా ఓషో పుస్తకాలు బాగా చదివిన, చదువుతున్న వ్యక్తి. ఆయనకా పిచ్చి నేనే ఎక్కించానని ఒప్పుకోక తప్పదు.

కబీర్ దాసూ, సూఫీ సాధువు బాబా ఫరీదూ ఇద్దరూ మంచి జ్ఞానులు. ఒకసారి కబీర్ ఇంటికి బాబా ఫరీద్ తన శిష్యులతో వచ్చాడు. ఇద్దరు మహా జ్ఞానులు కలసినప్పుడు, వారెంతటి గొప్ప సంగతులు మాట్లాడుకుంటారో వినాలని ఇద్దరి శిష్యులూ చాలా ఆత్రుతగా ఎదురుచూశారు.కానీ వారిద్దరూ ఒకరి ఎదురుగా ఒకరు మౌనంగా కూచుండి పోయారు. ఫరీద్ అక్కడున్న మూడు రోజులూ వారు ఒక్కసారి కూడా మాట్లాడుకోలేదు. చివరిరోజున మౌనంగా వీడ్కోలు తీసుకుని బాబా ఫరీద్ వెళ్ళిపోయాడు.

కబీర్ శిష్యులకు ఏమీ అర్ధం కాలేదు. ఎంతో ఊహించుకుని, ఇద్దరు మహాగురువుల సంభాషణ విందామని ఆశపడిన వారికి తీవ్ర నిరాశ కలిగింది. వీరి సందేహాన్ని తీరుస్తూ కబీర్ ఇలా అన్నాడు."ఇద్దరుంటే వారి మధ్యన మాటలకు ఆస్కారం ఉంది. కాని ఉన్నది ఒక్కరమే అయినప్పుడు ఎవరితో మాట్లాడను?"

వింటున్న నా మిత్రునికి మహదానందం కలిగింది. ముఖం వెలిగిపోయింది.

నా వివరణకు ఈ క్రింది మాటలతో ముగింపు నిచ్చాను.

లాభాపేక్ష ఉన్న ఇద్దరు వ్యక్తుల మధ్యన స్వచ్చమైన సంభాషణను ఆశించలేము.ఒకరినించి ఇంకొకరు ఏ విధమైన లాభాన్నీ ఆశించని వారి మధ్యన మాత్రమే నిష్కల్మషమైన మాటలుంటాయి.మనస్సును అధిగమించి శూస్యస్థితిని అందుకున్నవారికి అసలు మాటల అవసరం ఉండదు.

"అలాటివాళ్ళు మనకు తారసపడతారంటారా?" అన్నాడు.

"ముందు మనం ఆ స్థాయికెదిగితే, ఆ తర్వాత ఆ విషయం ఆలోచిద్దాం" అన్నాను నవ్వుతూ.

నా స్నేహితుడు చాలా ఆనందంగా సెలవు తీసుకుని బయలుదేరి వెళ్ళాడు.