"Oh ! Ego, the spoiler of life !"

16, జులై 2010, శుక్రవారం

ఓషో దివ్య వాక్కులు

Prayer is not a ritual: it is a surrender.
Meditation is not a method: it is a trust.
God is not a hypothesis: it is an experience.

ఓషో గారి మాటలు హృదయాన్ని సూటిగా తాకుతాయి. అంతరాంతరాలను కదిలిస్తాయి. ఏదో తెలియని ఒక వినూత్న స్పందనను హృదయంలోకలిగిస్తాయి.

ఆయన మాటల్లోని ప్రభావాన్ని గురించి ఆయనే ఒకమారు చెప్పారు. " మీకోసం, మాటలకు అతీతమైన అనుభవాన్ని మాటల పరిధిలోకి తేవాలని నేను విఫలయత్నం చేస్తున్నాను." ఆయన చెప్పిన ఉపన్యాసాలు, శిష్యులు అడిగిన ప్రశ్నలకుఇచ్చిన తత్క్షణ సమాధానాలూ కలసి ౩౦౦ పుస్తకాలైనాయి. వాటిలో ఒక్కొక్కటి ఒక కోహినూర్ వజ్రం లాటిది.

ఆయన సన్నిధిలో కూర్చున్న వారికి అప్రయత్నంగా ధ్యాన స్థితి కలిగేది. ఆయన సర్వ కాల సర్వావస్థలలోనూ లోతైనధ్యాన స్థితిలో ఉండేవారు. ఆయన మాట్లాడే ప్రతిమాటా ధ్యానానుభవపు లోతుల్లోంచి ఉబికి వచ్చేది. అందుకే అతీతభూమికల సుగంధాలను ఆయన మాటలు మోసుకొచ్చేవి.

ఓషోగారిని గురించి లోకులు రకరకాలుగా వ్యాఖ్యానిస్తారు. అటువంటి వ్యాఖ్యలు పూర్తిగా అజ్ఞాన జనితాలు. ఈలోకం మహాపురుషుణ్ణి సరిగ్గా అర్ధం చేసుకోగలిగింది? అసలు వారిని అర్ధం చేసుకునే స్థాయి ప్రస్తుత మానవాళికి ఉన్నదా? అనిప్రశ్నించుకుంటే " లేదు" అనే సమాధానం వస్తుంది.

ఒషోగారు చెప్పిన పై మూడు మాటలు వేదవాక్యాలకు ఏమాత్రం తీసిపోవు.


Prayer is not a ritual: it is a surrender.

ఒక్క వాక్యం చాలు ఆయన స్థాయిని చూపడానికి. ఒక్క వాక్యంలో ప్రార్ధన అనేదాని నిర్వచనం మాత్రమేగాక, ప్రస్తుతమతాలు, వాటి అనుయాయులు ఉన్న నిమ్న స్థాయిని కూడా మనం చూడవచ్చు.

ప్రార్ధన అనేది ఒక తంతు కాదు. కాని ప్రపంచం లోని మతాలన్నీ తంతులతో నిండి పోయి ఉన్నాయి. ఒకరి తంతు ఇంకొకరికి నచ్చదు. ఎవరికి వారే మా తంతు గొప్పదంటే మా తంతు గొప్పదని గొడవలు పడుతూ ఉన్నారు. ఒకడు రెండు చేతులు జోడిస్తాడు. ఒకడు మోకాళ్లమీద మోకరిల్లి అర్ధించే హస్త ముద్ర పడతాడు. ఇంకొకడు తనపైన శిలువ గుర్తును ఆపాదించుకునే భంగిమ ప్రదర్శిస్తాడు. ఇంకొకడు ఇంకొక రకంగా చేస్తాడు. వీరందరూ ఒకరిని ఒకరు శత్రువులుగా చూసుకుంటూ బతుకుతుంటారు. కాని వీరెవరికీ సరెండర్ అన్న భావన, దాని ఆచరణ లేదు. హిందువులు దీనిని శరణాగతి, ప్రపత్తి అంటారు. ఇస్లాం అనే మాటకు అసలైన అర్ధం కూడా ఇదే. క్రిస్టియానిటీ మూల భావన కూడా శరణాగతియే. కాని ఎవరూ దీనిని ఆచరించరు. ఊరక బాహ్య తంతులు మాత్రం చక్కగా ఆచరిస్తూ తాము భగవంతుని అనుంగు భక్తులుగా ఎవరికి వారు భావించుకుంటూ, ఎదుటివాడు మాత్రం తప్పుదారిన నడుస్తున్నాడన్న చిన్నచూపుతో ఉంటారు. ఇదే అన్ని మతాలూ చేస్తున్న పెద్ద పొరపాటు.

తంతు అనవసరమా అంటే, అవసరమే అని చెప్పాలి. సామాన్య స్థాయిలో ఉన్నవానికి తంతు అవసరమే. కాని తంతు ఒక్కటే సర్వస్వం కాదు. అది ఒక దేహం లాటిది. కాని శరణాగతి ఆత్మ లాటిది. ఆత్మ లేని దేహం ఎలాటిదో శరణాగతిలేని ఉత్త తంతులు అలాటివే. నిజమైన శరణాగతి ఉన్నపుడు ఒక్క క్షణంలో భక్తుని లోలోపల మొత్తం ప్రక్షాళన కాబడుతుంది. ఒక అతీత శక్తి అతనిలోకి దిగి వస్తుంది. శక్తి ముందు అతడు వివశుడౌతాడు. అచేతనుడౌతాడు. శక్తి అతనికి సర్వంబోధిస్తుంది. అతని జీవితం దివ్యంగా మారుతుంది. శ్రీ రామకృష్ణుని వంటి మహాపురుషుల జీవితాలలో జరిగింది అదే.

ఒకడు నిజంగా తన అస్తిత్వాన్ని పూర్తిగా మరచి, ఒక్క క్షణమైనా, ప్రపంచాన్ని నడుపుతున్న అతీత శక్తికి లొంగగలిగితే అతని అంతరంగంలో ఊహించలేనన్ని దివ్య పుష్పాలు పూస్తాయి. అతీత శాంతితో అతని అంతరాత్మ నిండిపోతుంది. ఇది ఎవరికి వారు ప్రత్యక్షంగా అనుభవంలో తెలుసుకోవచ్చు.

ప్రపంచంలోని అన్ని మతానుయాయులూ తంతులలో నిమగ్నులై ఉన్నారు. కాని వారికి శాంతి దొరికిందా? వారి చేతన దివ్య భూమికలను అధిరోహించగలుగుతున్నదా? వారి జీవితాలు పరిపూర్ణత్వాన్ని సంతరించుకుంటున్నవా? లేదు. దీనికికారణం వారు సరెండర్ అన్న ఆత్మను వదలి, రిచువల్ అన్న దేహాన్ని మాత్రం అనుసరిస్తున్నారు. వీరే శవసాధన చేస్తున్నటువంటి నిజమైన క్షుద్రోపాసకులు. లోకమంతటా ఇటువంటి వారితోనే నిండి ఉన్నది.

నిజమైన ప్రార్ధన అనేది తెలియాలంటే హృదయపూర్వకమైన శరణాగతి అనుభవంలోకి రావాలి. ఉత్త తంతులు ఎక్కడికీ మనలను చేర్చలేవు. కాకపోతే మన అహంకారాలను అవి ఇంకాస్త గట్టిపరచగలవు అంతే.

Meditation is not a method: it is a trust.

నేడు ఎందరో గురువులు తయారయ్యారు. ప్రతివారూ ఒక్కొక్క ధ్యాన ప్రక్రియను బోధిస్తున్నారు. మీటింగులు పెడుతున్నారు. అనుయాయులు వేలల్లో తయారు అవుతున్నారు. వారి వారి ప్రాణాయామ ప్రక్రియలు,ధ్యాన ప్రక్రియలు నేర్చుకుంటున్నారు. అంతా మంచిదే. కాని అసలైన రహస్యం ఒకటుంది. ధ్యానం అనేది ఒక ప్రక్రియ కాదు. అది ఒకనమ్మిక. అది ఒక మానసిక స్థితి. ప్రకృతిని, భగవంతుని ఎటువంటి షరతులు,కోరికలు, డిమాండ్లు లేకుండా ఒక చిన్నపాపలాగా నిష్కల్మషంగా స్వఛ్ఛంగా నమ్మి, నీ ఇష్టం వచ్చినట్లు నా జీవితాన్ని నడిపించు, నువ్వెక్కడికి తీసుకెళితే అక్కడికి వస్తాను అని పూర్తిగా అర్పణ కావడమే నిజమైన ధ్యానం. ఇటువంటి మానసిక స్థితిలో ఎల్లప్పుడూ ఉండగలగటమే నిజమైన ధ్యానం.

మరి ధ్యాన ప్రక్రియలు అన్నీ అబద్ధాలా? అంటే కావు అనే చెప్పాలి. అవి అవసరమే. కాని వాటిలో అంతర్గతంగా ఉండవలసిన సూత్రం ఇది. సూత్రం లోపించడం వల్లనే ఎన్ని ధ్యానాలు, ప్రాణాయామాలు, ఆసనాలు చేసినా మానవుడు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉన్నాడు. ఎప్పుడైతే ట్రస్ట్ అనేది మానవునికి కలుగుతుందో అతను ధ్యానభూమికలను సునాయాసంగా అధిరోహించగలుగుతాడు. దివ్యత్వం అతనికి ఎదురొచ్చి ఆహ్వానిస్తుంది. అది రానంతవరకూ మానవుడు ఎన్ని యోగా స్కూల్స్ లో చేరినా, ఎంతమంది గురువులను ఆశ్రయించినా ఫలితం అంతగా ఉండదు. ఎన్ని ధ్యానవిధానాలను ఆచరించినా ఈ ట్రస్ట్ అన్నది హృదయంలో లేకపోతే ఆ విధానాలు ఎక్కడికీ దారి చూపవు. నమ్మిక, విశ్వాసం అన్నవి హృదయంలో ఉన్నపుడు అతనికి ఏ ధ్యానమూ అవసరం లేదు. ఆ నమ్మకమే ఒక ధ్యానమై అతనికి దారి చూపిస్తుంది. ఆ వెలుగులో సునాయాసంగా నడవడం సాధ్యమవుతుంది.

God is not a hypothesis: it is an experience

దేవుడు ఒక సిద్ధాంతం కాదు. అది ఒక అనుభవం. తత్వ శాస్త్రం అనేది ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించి ఉన్నది. తత్వ వేత్తలు ఎన్నో రకాల సిద్ధాంత రాధ్ధాంతాలు చేసి దేవుడున్నాడా లేడా అని వాద వివాదాలతో కొన్ని వేల పుస్తకాలు వ్రాసి పెట్టారు. కాని వారికెవరికీ అనుభవజ్ఞానం లేదు. అనుభవం ఉన్నవారు ఒక్క పుస్తకమూ వ్రాయలేదు. వారు మౌనంగా ఉన్నారు. దేవుడు ఒక తర్కానికి పనికొచ్చే సిధ్ధాంతం కాదు. అది మాటలకు వాదనలకు తెలిసే విషయం కాదు. అది అనుభవైక వేద్యం. అంతరాంతరాలలోకి మునక వేసి ఎవరికి వారే తెలుసుకోవలసిన ఒక రహస్య అనుభవం. కాని ఈ లోతుల్లోకి మునగటం కష్ట సాధ్యం. వాదాలు చెయ్యటం సులభం. కనుక మానవుడు సులభమైన దాన్నే ఆచరిస్తాడు.

నేడు వేదికలెక్కి ఉపన్యాసాలిచ్చే గురువులు ఎందరో కనిపిస్తారు. భగవంతుని గురించి గంటలు గంటలు చక్కగా మాట్లాడగలిగిన వారు చాలామంది ఉన్నారు. కాని వారికి భగవదనుభూతి ఉన్నదా అంటే అనుమానమే. ఎందుకంటే నిజంగా ఆ అనుభూతి ఉన్నవాడు మాట్లాడలేడు. మాట్లాడటానికి విషయం ఏమీ వానికి ఉండదు. ఆ అనుభవాన్ని మాటలలోకి తేవడం కూడా అసాధ్యమైన విషయం.

ఉపన్యాసాలిస్తున్న మహనీయులందరూ భగవదనుభూతి లేనివారు అనేది నా ఉద్దేశం కాదు. కాని భగవంతుడు మాటలకు అందే ఒక సిద్ధాంత రూపుడు కాదు అని మాత్రమే ఇక్కడ అర్ధం చేసుకోవాలి. భగవంతుని ఉనికిని తర్క పరంగా నిరూపించాలని ప్రయత్నించడం ఉత్త నిరర్ధకమైన ప్రయత్నం. అదెప్పటికీ సఫలం కాబోదు.

ఇక్కడ ఉమర్ ఖయామ్ పద్యం ఒకటి గుర్తుకొచ్చింది.

||కొందరు ధర్మమున్ మతముంగూర్చి నిరతము చింతసేయ నిం
కెందరొ సత్యసంశయము లేర్పరుపం దలదిమ్ము గాంచ నా
సందున మాటువీడి " యింక జాలును లెండు వెడంగులార మీ
కందును నిందు లేదు పధ" మంచు మునాది వచించు వారికిన్ ||

(దువ్వూరి రామిరెడ్డిగారి "పానశాల" నుంచి)


ఇక్కడ ఒషో గారు దేవుని "అది" అని సంబోధించారు. మన ఉపనిషత్తులలో కూడా దీనికి సమానార్ధకమైన "తత్" అనే పదమే వాడబడింది. ఎందుకనగా భగవంతుడు అనేది లింగానికి అతీతమైన స్థితి. ఆత్మకు లింగమేమున్నది? శక్తికి లింగమేమున్నది? అది ఆత్మ, అది శక్తి కనుక పురుష స్త్రీ వాచకములకు అది అతీతమైనది. కాని ఏ రూపాన్నయినా అది ధరించగలదు.

ఓషోగారి ఈ మూడు మాటలను సరిగ్గా అర్ధం చేసుకోగలిగితే ఈ నాడు ప్రపంచంలో ఉన్న మతపరమైన అశాంతి దూరం కావడమే గాక, అసలైన ఆధ్యాత్మిక జీవిత సత్యాలు చక్కగా అర్ధం అవుతాయి.