Learn to live mindfully and meaningfully!

24, మే 2010, సోమవారం

ఓషో ఉత్తరాలు-14


శుభాశీస్సులు

నేనిప్పుడే రాజస్థాన్ లోని రాజనగర్ నుంచి తిరిగి వచ్చాను. అక్కడ జరుగుతున్న ఒక కార్యక్రమానికి ఆచార్య తులసి నన్ను ఆహ్వానించారు. అక్కడ నాలుగు వందల మంది సాధువులు, సాధ్విలకు ఒక ధ్యాన విధానాన్ని నేర్పించాను. ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి.

నా ఉద్దేశంలో, అన్ని మతాచరణలకూ సారం ధ్యానమే. అహింసా,భోగత్యాగమూ,బ్రహ్మచర్యమూ మొదలైన ఇతరములన్నీ దానినుంచి వాటంతట అవే వస్తాయి. ధ్యానశిఖరం అయిన సమాధి స్థితి అందుకుంటే ఈ గుణాలన్నీ సహజంగా నిన్ను అనుసరిస్తాయి. అవి వాటంతట అవే కలుగుతాయి. ముఖ్యమైన అంతరిక సాధనను మనం మరిచిపోబట్టే మన ఆచరణలన్నీ బాహ్యములుగానూ, ఉత్తుత్తి పైపై తంతులుగానూ ఉంటున్నాయి.

నిజమైన సాధన అంటే నీతియుత జీవితం గడపటం మాత్రమే కాదు. ప్రాధమికంగా అది యోగసాధనయే. నీతి సూత్రాలన్నీ నెగటివ్ షేడ్ కలిగినటువంటివి. నెగటివిటీని ఆధారంగా చేసుకొని శాశ్వత ఫలితాలను మాత్రం సాధించలేము. యోగమనేది పాజిటివ్ ఆచరణ కనుక, ఇది ఒక మంచి ఆధారంగా పనిచెయ్యగలదు. పాజిటివ్ భావనను నేను అందరికీ తెలియజెయ్యాలనుకుంటున్నాను.
-----------------------------------------------------------------

ఉత్తరంలో, ధ్యానసాధన యొక్క ఔన్నత్యాన్నీ, ప్రాముఖ్యతనూ ఓషోగారు నొక్కి చెప్తారు. ధ్యానసాధన అనేది అన్ని మతాల ఆచరణలకూ సారం వంటిది. మతాచరణలు బాహ్య పూజలు, క్రతువులు, తంతుల నుంచి, మౌన ప్రార్ధన స్థాయికి ఎదగాలి. అక్కడినుంచి ఇంకా ఉన్నత స్థాయి అయిన నిశ్చల ధ్యాన స్థితికి ఎదగాలి. స్థితిని కూడా దాటి బ్రహ్మ సాగరంలో కరిగిపోవాలి. అప్పుడే మతాచరణలు సరియైన దారిలో సాగుతున్నట్లు లెక్క. ఇటువంటివారి జీవితాలు ప్రవహిస్తున్న నదుల వంటివి అవి చివరకు సముద్రాన్ని చేరుకుంటాయి. కాని చాలామంది బాహ్య ఆచరణలు,పూజలే పరమావధులు అనుకుంటారు. వారి జీవితాలు పూజా పునస్కారాలతోనే గడచిపోతాయి. కాని వారి అంతరిక స్థాయిలో ఏమీ పరిణతి కనిపించదు. వాళ్ళు మురికి గుంటలవంటివారు. వారికి సముద్రాన్ని చేరాలనే చింతనే ఉండదు.

మతాచరణలు అన్నీ ఇది తప్పు, అది తప్పు, ఇది చెయ్యకు, అది చెయ్యకు, అని హద్దులు గీస్తాయి. కాని మనిషి చైతన్యం స్వతహాగా విశృంఖలమైనది. బలవంతాన గిరి గీచి బంధిస్తే అది కుళ్ళిపోతుంది. అనుభవం ద్వారా తనకే అవగాహన వచ్చినపుడు కలిగే పరిణతికీ, పుస్తకాలు చదివో లేక పెద్దలు చెబితేనో బలవంతాన ఆచరించే స్థితికీ చాలా భేదం ఉంటుంది. అందుకే బలవంతాన నిగ్రహించుకునే బ్రహ్మచర్యం నిలబడదు. కాని ధ్యానబలంవల్ల కలిగే మానసిక, ప్రాణిక పరిపక్వతతో వచ్చే బ్రహ్మ చర్యం సహజమైనది, సరళమైనదీనూ. అదెప్పటికీ నిలిచిఉంటుంది. ఇలాటివే అహింసాది ఇతర గుణాలు. వేరే ప్రాణికి హాని చెయ్యకు అని ఎవరో చెబితే ఆచరించడం కృత్రిమం.. అది నిలబడవచ్చు లేక జారిపోవచ్చు. కాని తనప్రాణం వంటిదే ఇతరుల ప్రాణం కూడా అన్న అనుభవం కలిగిన మీదట వచ్చె అహింస సహజమైనది. అది ఎప్పటికీ నిలిచి ఉంటుంది. అనుభవం ఉన్న వ్యక్తికి పుస్తకాలతో పనిలేదు. అతనికి ఒకరు చెప్పవలసిన పనీ లేదు.

అన్ని సాధనలకూ కేంద్రమైన ధ్యాన సాధన చెయ్యనివాడు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని నియమాలు పాటించినా పెద్దగా ఫలితం ఉండదు. అవన్నీ మంచివే కావచ్చు. కాని మనిషి వాటితోనే ఆగిపోరాదు. బాలుడు ముద్దుగానే కనిపించవచ్చు. కాని ఎప్పటికీ బాలుడుగానే ఉండరాదు. అది ప్రకృతి విరుద్ధం. అలాగే మతాచరణలు అన్నీ ధ్యానస్థితికి దారి తియ్యాలి. క్రమంలో మానవునికి పరిపక్వత కలగాలి. అదే సరియైన సాధనాక్రమం. అహింసాది ఒక్కొక్క గుణాన్నీ అభ్యాసం చేసి తర్వాత ధ్యానాన్ని అభ్యసిస్తాను అని అనుకుంటే అది ఒక పెద్ద పొరపాటు అవుతుంది. ఆయా గుణాలు నియమాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. వాటిలో కొన్నింటిని సాధించడానికే మనిషి జీవితం చాలదు. ఈలోపు మరణం వరిస్తుంది. కనుక ముందుగా మనిషి ధ్యానాన్ని అభ్యసించాలి. దానిద్వారా క్రమేణ అన్ని సద్గుణాలూ వాటంతట అవే మనిషిని అనుసరిస్తాయి. ఇదే సరియైన విధానం.

బలవంతాన నిగ్రహం పాటించటం నిష్ప్రయోజనం. నిగ్రహానికి పునాది ధ్యాన సాధన అయితే అది సత్ఫలితాలనిస్తుంది. ఎందుకంటే ధ్యానం వల్ల అంతర్ముఖత్వం కలుగుతుంది. అంతర్ముఖుడైన వాడు సహజంగానే బాహ్యాన్ని నిగ్రహించగలుగుతాడు. శక్తి అంతరిక మార్గాన్ని పట్టి ప్రవహించినప్పుడు బాహ్యమైన కోరికలు వాటంతట అవే క్షీణిస్తాయి. అపుడు ఆత్మ నిగ్రహం సహజంగా కలుగుతుంది. కాని ఆంతరికంగా డొల్లగా ఉండి బయటికి బిగబట్టుకుంటే ఉపయోగం లేదు. అది ద్వంద్వప్రవృత్తికి, మానసిక రోగాలకూ దారితీస్తుంది.

ధ్యాన సాధన అన్ని ఆచారాలలోకీ గొప్పది. తలమానికమైనది. అన్న సత్యాన్ని ఓషోగారు ఉత్తరంలో చక్కగానూ క్లుప్తంగానూ చెబుతూ, అంతరిక మనో విశ్లేషణా కోణాన్నికూడా దీనిలో చూపిస్తారు. ఆయన బోధనలలోని శాస్త్రీయత వల్లే అన్ని లక్షలమంది విదేశీయులు ఆయన అనుయాయులయ్యారంటే అతిశయోక్తి కానేరదు.