“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

4, ఆగస్టు 2009, మంగళవారం

వివేకానంద స్వామి దివ్యజాతకం-3


వివేకానంద స్వామి జాతకం చంద్ర లగ్నాత్ విశ్లేషణ చేస్తే చాలా చక్కని వివరాలు లభిస్తాయి.
మొదటగా ఈ యోగాలు చూడండి.

>>లగ్నాధిపతి యగు బుధుడు మంత్ర స్థానమైన పంచమ స్థితి. అనగా ఆధ్యాత్మికమేధావి అని ఒక అర్థం.>మంత్ర స్థానాధిపతి యగు యగు శని లగ్న స్థితి. అంటే వీరిద్దరికీ పరివర్తన ఉంది.ఈ యోగం లగ్నం నుంచి చూస్తె కనిపించదు. చంద్ర లగ్నం నుంచి మాత్రమె కనిపిస్తుంది. దీనివల్ల మంత్ర సిద్ధి చాలా త్వరగా కలుగుతుంది. దేవతా అనుగ్రహం, సిద్ధగుర్వనుగ్రహం ఉన్న మహనీయుడు అని తెలుస్తూంది.

>>లాభాధిపతి మరియు మనః కారకుడగు చంద్రుని యొక్క లగ్న స్థితి. ఇది కన్యా రాశి వారికి సామాన్యంగా ఉండే గ్రహ స్థితి. ఇది పెద్ద విశేషం కాదు. కాని చంద్రునితో మంత్ర స్థానాధిపతి అయిన శని కలయిక విశేషం. ఇది ఆధ్యాత్మికతను అంతర్ముఖత్వాన్ని ఇస్తుందని ఇంతకూ ముందే చూచాము.>>వాక్కు మరియు, ధర్మ స్థానాధిపతి యగు శుక్రుని మంత్రస్థాన స్థితి. శుక్రుడు స్త్రీ గ్రహం అని, గురువును సూచించే నవమస్థానానికి అధిపతిగా, ఉన్నది నల్లనిగ్రహం అయిన శని యొక్క మకరరాశిలో,విష్ణు భగవానుని సూచించే బుధునితో కూడి ఉన్నాడు అని గుర్తుంచుకుంటే, ఈయన మీద విష్ణుభగవానుని అవతారమైన మరియు కాళీస్వరూపమైన శ్రీ రామకృష్ణుని అనుగ్రహం ఎలా వర్షించిందో అర్థం అవుతుంది.>>మోక్ష త్రికోణములలో ఒకటైన అష్టమస్థానంలో శక్తి స్వరూపం అయిన కుజుని స్థితి గమనించండి. ఆ కుజునిపైన వాక్ స్థానం నుంచి గురుని శుభద్రుష్టి ని చూడ వచ్చు. దీని వివరం ఇంతకు ముందే ఇచ్చాను. కాని చంద్ర లగ్నాత్ చూస్తె అష్టమమోక్షత్రికోణంలో శక్తి స్వరూపుడైన కుజుని స్థితి కనిపిస్తుంది. అదే లగ్నాత్ అయితే ఇదే మకరం మంత్రస్థానం అవుతుంది.>>ధర్మకోణంలో మోక్షకారకుడగు కేతువు యొక్క స్థితి గమనించ వచ్చు. కేతువు నీచలో ఉన్నప్పటికీ "తద్రాశి నాధోపి తదుచ్చ నాధః విలగ్న చంద్రాదపి కేంద్ర వర్తీ రాజా భవేద్దార్మిక చక్రవర్తీ" అని ఫలదీపికలో చెప్పిన మంత్రేశ్వరుని శ్లోకం ప్రకారం నీచభంగం అవుతున్నది. ఈ యోగం చంద్రుని నుంచి మాత్రమె కనిపిస్తుంది.>> చతుర్థ మోక్షత్రికోణం లో, ఇంకొక మోక్ష త్రికోణమైన ద్వాదశ సింహరాశి అధిపతి సూర్యుని స్థితి బట్టి చూస్తే స్వామి ఉజ్జ్వలమైన జ్ఞానసూర్యుడని అర్థం అవుతున్నది. సింహరాశి యొక్క ఈ ప్రభావం వల్లనే "The Lion of Vedanta" అనే బిరుదు పొంద గలిగాడు. అది అన్నవారు మన భారతీయులు కాదు. మనలను చీదరించుకునే విదేశీయులు అన్న విషయం గుర్తుంచు కుంటే, పాశ్చాత్య మేధావుల భావసరళిని ఆయన తన ఉపన్యాసాలతో ఎంతగా ప్రభావితం చేసాడో అర్థం చేసుకోవచ్చు.>> అదే సూర్యుడు ఆత్మ కారకుడు గా లగ్న సంధి లో ఉంటూ చతుర్ధం నుంచి, పంచమానికి మారే స్థితి లో ఉన్నాడు. కనుక వివేకానంద స్వామి ఆత్మ ఎల్లప్పుడూ తన స్వ స్థానమైన నిర్వికల్పసమాధి వైపు (మంత్ర స్థానం ద్వారా సూచితం) ఎగయజూస్తూ ఉండేదని. ఏ క్షణాన్నైనా ఈ లోకాన్ని వదలిపెట్టి తన తేజోమయలోకం వైపు పోవటానికి సిద్ధంగా ఉండేదనీ తెలుస్తూంది. ఈ ప్రపంచం ఆయన ఇష్టపడి ఉన్న ప్రదేశం కాదని, ఆయన ఆత్మ ఒక పని కోసం భూలోకానికి వచ్చినా-- ఈ లోకానికి ఊర్ధ్వ లోకాలకు మధ్యన గల సంధిలో ఎల్లప్పుడూ ఉండేదని అర్థం అవుతున్నది. దీనికి సూచికగానే స్వామికి కళ్ళు మూసుకుంటే చాలు అప్రయత్నంగా భ్రూమధ్యంలో వెలుగు దర్శనమిస్తూ ఉండేది. >> "నరేంద్రుని సహజస్థితి అత్యున్నత నిర్వికల్ప సమాధి. తనను తాను తెలుసు కొన్న మరుక్షణం అతడు ఈ లోకంలో ఒక్క క్షణం కూడా ఉండడు. అందుకే ఆ జ్ఞానాన్ని ఒక పెట్టెలో పెట్టి తాళంవేసి ఉంచాను. అతను చెయ్య వలసిన పని పూర్తి అయిన తదుపరి ఆ పెట్టెను తెరచి అతనికి ఆ స్మృతిని మళ్ళీ ఇస్తాను"-- అన్న శ్రీ రామకృష్ణుని దివ్య వాక్కులు ఇక్కడ స్మరించండి. అసలు ఈ మాటలు వింటుంటే ఇది నిజమా కలా? నిర్వికల్ప సమాధిని దాచి ఉంచి అవసరం అయినప్పుడు ఒక చాక్లేట్టును చిన్న పిల్లవానికి ఇచ్చినట్లు ఇవ్వటమా? ఇది అసలు సాధ్యమా? ఎవరైనా చెయ్య గలరా? అని దిగ్భ్రమ గలుగుతుంది. ఈ మాటలు దేవ దేవుడైన ఆ సర్వేశ్వరుడు తప్ప ఇంకొకరు అనగలరా అనిపించటం లేదూ? ఈ మాటలలో వివేకానందుని నిజస్థితి మాత్రమె కాదు, శ్రీ రామకృష్ణుని నిజరూపం కూడా బహిర్గతం అవుతున్నది.


>> తృతీయం లో రాహు స్థితి తో అది కూడా కుజ స్థానంలో అవటంతో --తిరుగు లేని వాగ్ధాటి తో ప్రత్యర్థులను నిరుత్తరులను చేసే అద్భుత శక్తి ఈయన సొంతం అయింది. స్వామి ఉపన్యాసం విన్న ఒక యూరోపియన్ ఫిలాసఫీ ప్రొఫెసరు గారు ఆ భావ తీవ్రతనూ, వాదనా పటిమనూ తట్టుకోలేక బీ పీ పెరిగి పోయి మూడు రోజుల పాటు నిద్రలేని రాత్రులు గడిపాడట. ఈ సంగతి వింటే స్వామి ఉత్త ఉపన్యాసకుడు కాదు ఆయన మాటల ద్వారా అతి తీవ్రమైన శక్తి ప్రసారం జరిగేది అని అర్థం అవుతుంది.


>>ఆయన ఉపన్యాసం వినాలని హాలు క్రిక్కిరిసి పోగా బయట వరండాలలో నూ చెట్ల కిందా తెల్ల వాళ్లు వేచి మైకులు ఎలక్ట్రానిక్ మీడియా వగైరాలు లేని ఆ రోజుల్లో వినే వారంటే అవి మామూలు ఉపన్యాసాలు కావు, అద్భుత శక్తి ప్రసారాలు అన్న విషయం తేట తెల్లం కావటం లేదూ? ఆ ఉపన్యాసాలు విని జీవితాంతం భారతీయ యోగ వేదాన్తాది అభిమానులు గా మారిపోయిన విదేశీయులు వేలల్లో ఉన్నారు. సిస్టర్ నివేదిత ఒక్క ఉదాహరణ మాత్రమె.

లగ్నాత్ ఉన్న గ్రహస్థితులే చంద్ర లగ్నం నుంచి చూస్తె ఇంకొక స్వరూపం గోచరిస్తుంది. పోయిన వ్యాసం లో లగ్నాత్ ఇచ్చిన యోగాలకు గ్రహ స్థితులకు, ఇప్పుడు చంద్ర లగ్నాత్ వ్రాసిన వాటికి పోల్చి చూస్తె, ఆ విశ్లేషణలో తేడాలు, బయట పడ్డ కొత్త సంగతులు అర్థం అవుతాయి.

స్వామి జీవిత విశేషాలు, దశల వారీగా తరువాతి టపాలో చూద్దాం.