'సాధ్యమైనదే సాధన' - జిల్లెళ్ళమూడి అమ్మగారి అమృతవాక్కు

20, జులై 2009, సోమవారం

జెన్ కథలు- పక్షి ప్రాణం

జెన్ మాస్టర్లు వారి జ్ఞాన సంపదకు ప్రసిద్ధులు. ఒక వ్యక్తి ప్రసిద్ధ జెన్ మాస్టర్ ను పరీక్షించాలనుకున్నాడు.
తన చేతిలో ఒక పక్షిని పట్టుకొని, చేతుల్లోదాని మెడను బిగించి.తన నడుము వెనుక రెండు చేతులు దాచి పెట్టి ఉంచి , వృద్ధ జెన్ మాస్టర్ ను విధం గా అడిగాడు.
నా చేతిలో ఉన్న పక్షి ప్రాణం తో ఉందా లేక చనిపోయిందా?
జెన్ మాస్టర్ కనుక ప్రాణం తో ఉంది అని చెబితే, దాని మెడ విరిచేసి చంపెద్దామని, ఒకవేళ పక్షి చనిపోయింది అని మాస్టర్ చెబితే దానిని గాలిలోకి ఒదిలివేద్దామని ప్లాన్ వేశాడు. ఎలాగైనా గురువు చెప్పింది అబద్దం అని నిరూపించాలని అనుకున్నాడు.
గురువు క్లుప్తం గా సమాధానం చెప్పాడు.
పక్షి ప్రాణం నీ చేతుల్లో ఉంది.

జెన్ కథలు చిన్నవి. కాని అర్థం అగాధం. జెన్ వర్తమానం లో బ్రతకమని చెబుతుంది. జెన్ ఏ ఆధారమూ లేని నిరాడంబర మనస్సుతో లోకాన్ని చూడమని చెబుతుంది. గత అనుభవాలు, జ్ఞాపకాల ఆధారంగా లోకాన్ని చూడొద్దు, లోకంతో వ్యవహరించొద్దు అని చెబుతుంది.

ప్రపంచం నిత్య నూతనం. ఈరోజు నిన్నటివలె ఉండదు. ప్రపంచంలో ప్రతిదీ మారుతుంది. కాని మనిషి గతంలో కూరుకుపోయి ఉంటాడు. గతాన్ని ఒదిలి బ్రతకలేడు. భవిష్యత్తు పైన ప్లాన్స్ లేకపోతే జీవించలేడు. కాని జెన్ సాధన చేసేవారు అలాకాదు. వారికి ఏ రోజు ఆ రోజే కొత్త. ఇంకా చెప్పాలంటే ప్రతి క్షణమూ కొత్త గానే ఉంటుంది. పసి పిల్లలు దేన్ని చూసినా వింతగా చూస్తారు. ఆశ్చర్య పోతారు. జెన్ కూడా ఇదే చెబుతుంది.

గతాన్ని మరచి భవిష్యత్తు మీద ఆశను వదలి వర్తమానంలో ఎవరైతే పూర్ణంగా ఉండగలరో వారికి ప్రక్రుతి రహస్య ద్వారాలు తెరుస్తుంది. జపాన్ లో "సతోరి" అనే స్థితి అప్పుడు కలుగుతుంది. నిర్మల మనస్సు కలవారే ఇలాంటి స్థితిలో ఉండగలరు. ఎందుకంటే వారిని గతంలోకి భవిష్యత్తు లోకి లాగే బంధాలు ఉండవు. పసి పిల్లలు ఇలాంటి స్థితిలో ఎల్లప్పుడూ ఉంటారు. అందుకే నేమో "Unless you become like those little children, you cannot enter into Kingdom of God" అని జీసస్ అన్నాడు.

వర్తమానంలో ఉంటే భవిష్యత్తులో ఏమి జరుగుతుందో చెప్పలేము. అసలు దాని ఆలోచనే మనసులో తలెత్తదు. కనుకనే ఈ కథలో జెన్ మాస్టర్ ప్రస్తుత పరిస్థితిని మాత్రమె చెప్పాడు. పక్షి ప్రాణం నీ చేతులో ఉంది అంటాడు. అంటే జరుగబోయే దాన్ని ఊహించి చెప్పలేదు. పక్షి చావటం లేదా బ్రతకటం అనేది అడిగిన వ్యక్తి చేతుల్లో ఉంది. ఏదైనా జరుగ వచ్చు. కాని వర్తమాన స్థితి మాత్రం గురువు చెప్పినదే.

ఇలాంటి స్థితిలో ఉండమని చాలామంది గురువులు చెప్పారు. కొందరు మాత్రమె చేసి చూప గలిగారు. అట్టి వాళ్ళను వెళ్లపైన లెక్క పెట్ట వచ్చు. ఈ మధ్య కాలంలో ఇటువంటి బోధనలు చేసే గురువులు తామర తమపర గా పుట్టుకొచ్చారు. కాని వారు ఎంత వరకు వారు చెప్పే దానిని ఆచరిస్తున్నారు అంటే అనుమానమే. నవీన తరానికి కూడా ఇటువంటి బోధలు నచ్చుతున్నాయి. కారణం ఏమంటే వీటిని చాలా మంది వక్ర కోణం లో తీసుకుని ఆత్మ వంచన చేసుకుంటున్నారు.

వర్తమానం లో బ్రతకమని గురువు గారు చెప్పారు కదా. మనం తల్లి తండ్రులను పట్టించు కోవలసిన అవసరం లేదు. మన సుఖం మనం చూసుకుంటే చాలు. మనం ఎవరికీ సహాయం చెయ్య వలసిన పని లేదు. ఎవరి ఖర్మ వారిది. అనే మెట్ట వేదాంతులు తయారు అవుతున్నారు. అసలు వేదాంతము ఇది కాదు. వేదాంతము సరిగా అర్థం కాక ఇటువంటి వెర్రి వేషాలు పుట్టుకొస్తాయి.

నేను పూనాలోని ఓషో ఆశ్రమంలో కొన్నాళ్ళు ఉన్నాను. అప్పుడు ఒకరోజు ఒక సంఘటన జరిగింది. ఫలానా ఆడిటోరియం ఎక్కడుందో అడగాలని వెదుకుతూ, ఒక స్టాల్ లాంటి దాంట్లో ఏదో బిల్లులు చూస్తున్న ఒక ఫారిన్ యువతిని ఎక్స్క్యూస్ మీ అని పిలిచాను. ఆమె తలెత్తి చూడటం లేదు. రెండో సారి కూడా పిలిచాను. ఆమె విసుగ్గా ముఖం పెట్టి We don't help any body. You have to do your work. అని సమాధానం చెప్పింది. నాకు భలే నవ్వొచ్చింది. What's wrong in helping someone? అని ప్రశ్నించాను. దానికి ఆమె "I am living in the present." అని చెప్పింది. నేను "I am afraid your response comes from a prefixed idea,which obviously cannot be your so-called present." అని చెప్పాను.

ఆమె నా మాటలు ఎలా తీసుకుందో నాకు తెలీదు. వేదాంతాన్ని ఆచరిస్తున్నామని అనుకుంటూ మామూలు మనుషుల స్థాయి కి కూడా కింద బ్రతికే ఇలాంటి వాళ్లు ఇప్పుడు చాలా మంది తయారు అవుతున్నారు. ఈ వనిత ఇచ్చిన రెస్పాన్స్ వర్తమానం లోనించి వచ్చింది కాదు. నేను ఎవరికీ హెల్ప్ చెయ్యను అని ముందే అనుకుని ఆ భావనలోనే గిరి గీసుకున్న ప్రవర్తన వర్తమానం లో జీవించటం ఎలా అవుతుంది?

వర్తమానంలో జీవించటం అనేది ప్రాథమిక స్థాయి కాదు. అది వేదాంతము లో అత్యున్నత స్థాయి. సంస్కార నాశం జరిగిన వాడే వర్తమానం లో జీవించ గలడు. జీవన్ముక్తుడే ఆ పని చెయ్య గలడు. ఎందుకంటే అతనికి సంస్కారములు అనే గింజలు పూర్తిగా కాలి పోయి ఉంటాయి. కనుక తిరిగి మొలకెత్త లేవు. అట్టి స్థితి కి చేరాలంటే సాధన కావాలి. అది చెయ్యకుండా మహనీయుల బోధనలు చదివి వారి స్థితిని అనుకరించాలనుకుంటే అది వీలు కాదు. ఎందుకంటే ఆధ్యాత్మిక జీవితంలో అనుకరణ సాధ్యం కాదు. ప్రతి క్షణం ఒరిజినాలిటీ లో జీవించ గలిగితేనె అది సాధ్యం అవుతుంది.

ప్రపంచంలో మనకు అడుగడుగునా అనేక ప్రశ్నలు, సన్నివేశాలు ఎదురౌతుంటాయి. ఎందఱో వ్యక్తులతో మాట్లాడ వలసి వస్తుంది. ఎంతో మందితో పొద్దున్న లేచిన దగ్గరి నుంచి ఇంటరాక్ట్ కావలసి వస్తుంది. ప్రతి సందర్భం లోనూ-- నా రెస్పాన్స్ ఎక్కడ నుంచి వస్తున్నది? గతం నుంచా? భవిష్యత్తు నుంచా? లేక నిజంగా వర్తమానం నుంచేనా?-- అని అను క్షణం తనను తాను తరచి చూచుకునే వాడే ఏదో ఒక నాటికి గమ్యాన్ని చేరగలుగుతాడు.

వర్తమానంలో
పూర్తిగా జీవించటం అంటే ఏమిటో వానికే తెలుస్తూంది. అనుభవం లోకి వస్తుంది. లేకుంటే పూనా ఆశ్రమం లో విదేశీ వనిత మాదిరి అనుకరణ మాత్రమె మిగులుతుంది.
అనుష్టాన వేదాంతము అంటే కత్తి అంచు మీద నడక అని ఉపనిషత్తులు ఇందుకే చెప్పాయేమో అనిపిస్తుంది.