“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

31, జులై 2009, శుక్రవారం

వివేకానందస్వామి జాతకం


ఆధునిక భారత పునరుజ్జీవన కర్త వివేకానందస్వామి 12-1-1863 న కలకత్తాలో దుందుభినామ సంవత్సర పుష్యబహుళసప్తమి రోజున సోమవారం హస్తానక్షత్రం మూడోపాదంలో అతిగండ యోగంలో చంద్రహోరలో సూర్యోదయ సమయంలో 6.33(?) నిమిషాలకు జన్మించారు.

ఈయన మనకు తెలిసిన మహాత్ములలో అగ్రగణ్యుడు మరియు ప్రపంచానికి తెలిసిన ప్రవక్తలలో అత్యుత్తముడు. ఎందుకు అంటే,ప్రవక్తలలో ఈయనవలె అత్యంత విశాలభావాలు కలవారు బహుతక్కువ.తాను ఏది బోధించాడో దానిని ఆచరించి చూపాడు.ఆదర్శవంతమైన ఋషి జీవితాన్ని ఎలా జీవించాలో చూపించాడు. అత్యున్నత ఆధ్యాత్మికభూమిక అయిన నిర్వికల్పసమాధి అతిచిన్న వయసులో పొందినవాడు. జ్ఞానసిద్ధిని పొందిన తరువాతకూడా,గురువుకిచ్చిన మాటకోసం ఆ అనుభవాన్ని పక్కనబెట్టి లోకంకోసం పాటుపడిన మహనీయుడు.అత్యున్నత యోగశక్తులు కలిగిన మహాయోగి.ఈయన జీవితాన్ని చదవటం చాలాకష్టం. ఎందుకంటే ఇటువంటి యోగుల జీవితంలో బయటకు కనిపించే సంఘటనలు పెద్దగా ఉండవు.వారి ఆధ్యాత్మికశక్తిని మనయొక్క స్వల్పజ్ఞానంతో అంచనా వెయ్యడం అసాధ్యం.'ఈ వివేకానందుడు ఏమిచేసాడో మరొక వివేకానందుడు మాత్రమె గ్రహించగలడు'అని ఆయనే చెప్పాడు.ఆ మాటలు తలచుకుంటూ,సాహసమే అని తెలిసినా,నా స్వల్పబుద్ధితో జ్యోతిర్విద్యాపరంగా ఈ చిన్నప్రయత్నం చేస్తున్నాను.ఎందుకంటే, చూస్తే ఇలాటి మహనీయుల జాతకాలే చూడాలి.అంతేగాని ఉసిళ్ళలాగా నిరర్ధక జీవితాలు గడిపి కాలగర్భంలో కలిసిపోయే  మనవంటి వారి జాతకాలు చూచి ప్రయోజనం ఏముంది?


వివేకానందస్వామి జాతకంలో కొన్ని ముఖ్యమైన గ్రహయోగాలు ఏమిటంటే:


1.ధర్మస్థానాధిపతిగా ఆత్మజ్ఞాన కారకుడైన సూర్యుడు మిత్రస్థానం అయిన ధనుర్లగ్నంలో ఉండుట. దీనివల్ల తేజోమయమైన వ్యక్తిత్వం, ఆత్మజ్ఞానం,లోకానికి మహాగురువుగా వెలుగుబాట చూపగలశక్తి కలిగాయి. 

గత నూరుసంవత్సరాలలో వచ్చిన మహాత్ములేవరైనా సరే వివేకానందస్వామి చూపిన బాటలోనే పయనించారు.నేటి గురువులు కూడా పయనిస్తున్నారు.వారు వివేకానందస్వామి అనుచరులమని చెప్పుకోవచ్చు,చెప్పుకోకపోవచ్చు.అది వేరేసంగతి.మఠాలలో,ఆశ్రమాలలో దాగిఉన్న ఆధ్యాత్మికతను సమాజంలోకి తెచ్చిన ఘనత వివేకానందస్వామిదే.అంతేకాదు, భారతీయమతం యొక్క విశ్వజనీనతనూ,తాత్విక అగాథాన్ని,ఆచరనాత్మకతనూ సముద్రపు ఎల్లలుదాటించి భారతదేశం అంటె చెట్లను,పుట్టలను పూజించే అనాగరికులు, ఆటవికులు ఉన్నదేశంకాదు,ప్రపంచానికి గురువులుగా భాసిల్లే మహనీయులు ప్రతితరంలోనూ ఉద్భవించిన పుణ్యభూమి అని ఒక్కడే ధైర్యంగా చాటి చెప్పిన ఘనత వివేకానందస్వామిది.

అంతే కాదు ఆధ్యాత్మికత అంటే కళ్ళు మూసుకొని ఏదో గుహలో తపస్సు చెయ్యడం అనే పాతకాలం నాటి భావాలను పక్కన బెట్టి, 'సేవ' అనేది కూడా యోగమే అంటూ కర్మకు యోగస్తాయిని కట్టబెట్టిన ఘనత కూడా స్వామిదే.దీనికి మూలమంత్రంగా "శివభావే జీవసేవ" అన్న శ్రీరామక్రిష్ణుని దివ్యోపదేశాన్ని స్వామి స్వీకరించాడు.శ్రీ రామకృష్ణుని నోటివెంట వచ్చిన ఈ రెండుమాటలు నేడు కోట్లాదిమంది యొక్క ఆర్తిని తీరుస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. 


2.లగ్నానికి ఒకప్రక్క బుధశుక్రులు,ఇంకొక ప్రక్కన రాహువు (పంచమాధిపతి యైన కుజునికి సూచకుడుగా) ఉండటంతో, పైన చెప్పిన రవి లగ్నంలో ఉన్న ఫలితాలకు అత్యంతబలం చేకూరింది. అమోఘమైన ఆత్మబలం, దుర్లభమైన దైవానుభూతి కలిగి ఉండటమే కాదు,దానిని లోకానికి చక్కగా అర్థమయ్యేలా శక్తివంతములైన మాటలతో చెప్పగలిగిన సామర్థ్యం ఈ యోగంవల్ల కలిగింది.


లగ్నాధిపతి అయిన గురువు  లాభస్తానంలో ఉండి తృతీయభావాన్ని వీక్షిస్తున్నాడు. కనుక అద్భుతమైన ధార్మికప్రసంగాలతో వేదాంత వాణిని లోకానికి వినిపించగల సమర్ధత కలిగింది. గురువు తన నవమ దృష్టితో సప్తమాన్ని వీక్షించడం వల్ల, నవమ భావాదిపతి అయిన రవి యొక్క దృష్టి కూడా అక్కడ పడటం వల్ల, ఇతరులతో ఈయన యొక్క సంభాషణలూ, ప్రవర్తించే తీరూ అత్యున్నతమైన ధార్మికసూత్రాలకు అనుగుణంగా ఉంటాయని తెలుస్తోంది.


గురువు కుజుని నక్షత్రంలో ఉండటమూ ఆ కుజుడు పంచమద్వాదశాలకు అధిపతిగా అవడమూ గమనిస్తే, స్వామి యొక్క వ్యక్తిత్వం అంతా అత్యున్నత ఆధ్యాత్మికతను, ఋషిసాంప్రదాయాన్ని ఎలా ప్రతిబింబిస్తోందో అర్ధమౌతుంది. అంతేగాక స్వామి ఉత్త ఊకదంపుడు ఉపన్యాసకుడు కాదనీ ఆయనకు అండగా  మహత్తరమైన శక్తిప్రవాహం ఉందన్న విషయం కుజగురుల పరస్పర వీక్షణవల్లా నక్షత్రస్థాయిలోని ప్రభావాల వల్లా తెలుస్తుంది.


3.రెండవదిగా చెప్పదగిన గొప్పయోగం శనిచంద్రుల కలయిక, ఇది దశమస్థానంలో ఉండటంతో, అతిచిన్నవయసునుంచే అత్యంత ఆధ్యాత్మిక పరిపక్వత, అంతర్ముఖత్వం, యోగ-ధ్యానములలో  నిమగ్నతా కలిగాయి. మహనీయుల జాతకాలలో శనిచంద్రులకు పంచవిధ సంబంధాలలో ఏదో ఒకసంబంధం ఉండటం చూడవచ్చు.దీనివల్ల కలిగిన ఇంకొక ఫలితం ఏమిటంటే, శని సామాన్యజనానికి కారకుడు అవటం చేత, బీదలు అభాగ్యులు అంటె ప్రేమ, సమాజంలో అణగారిన వర్గాలు పడుతున్న బాధలు నూరేళ్ళక్రితమే ప్రత్యక్షంగా చూచి ద్రవించిన హృదయంతో విలపిస్తూ వారిగతిని బాగుచెయ్యమని భగవంతుని ప్రార్థించాడు.నేటికీ రామకృష్ణామిషన్లో కులంతో, మతంతో పనిలేకుండా సన్యాసదీక్ష ఇచ్చి వేద ఉపనిషత్తులసారాన్ని ఉపదేశించి లోకానికి సద్గురువులని చెప్పదగ్గవారిని తయారు చేస్తున్నారంటే అది వివేకానందస్వామి నిర్దేశించిన నియమావళి వల్లే జరుగుతున్నది.


లోకంయొక్క బాధలను తనబాధలుగా భావించి స్పందించే వెన్నలాంటి హృదయం ఈ గ్రహయోగం ఇస్తుంది. కాబట్టే తాను జీవితాశయంగా దేనికోసం పరితపించాడో ఆ ప్రపంచాతీత నిశ్చలసమాధిస్థితి కరతలామలకంగా అందినపుడు, దానిని పక్కనపెట్టి లోకోద్ధరణకు నడుము బిగించాడు. నిజానికి 23 సంవత్సరాల వయస్సులో ఈయనకు మహర్షులు పరితపించే నిర్వికల్పసమాధి కలిగింది. ఇట్టి స్థితి కలిగిన తదుపరి, శరీరం ఉన్నా, పోయినా తేడా ఉండదు. జీవితం పరిసమాప్తి అయినట్లే లెక్క. అట్టి మహనీయులు సర్వదా భగవంతునిలో లీనమైనట్టి స్థితిలో ఉండిపోతారు. అట్టి పరమానందమయ స్థితిని పక్కన పెట్టి, "ఆత్మనోమోక్షార్ధం-జగద్ధితాయచ" అనే ఉత్కృష్ట ఆశయంతో శ్రీ రామకృష్ణమఠం,మిషన్ లను స్థాపించి కోట్లాదిమందికి ఆధ్యాత్మిక జాగృతిని కలిగించడానికి కారకుడైనాడు.

శనిచంద్రుల వీక్షణ చతుర్ధంమీద పడుతున్నది.స్వామి యొక్క వైరాగ్యభావాలకు ఇది సూచిక.అంతేకాక ఆయన యొక్క ఆలోచనలూ మనస్తత్వమూ అత్యున్నత వైరాగ్యపూరితములని ఇక్కడ మనకు అర్ధం అవుతుంది. గృహసౌఖ్యాన్ని సూచించే చతుర్ధంమీద ఈ దృష్టి వల్ల, ఆయనకు గృహస్థజీవితం లేదనీ, సన్న్యాసయోగం ఉందన్న సత్యం ఇక్కడ తేటతెల్లం అవుతుంది. శనియొక్క దృష్టి ద్వాదశంమీద పడుతూ ఆయనకుగల ఆధ్యాత్మికచింతన వైరాగ్యంతో కూడుకున్నదనీ,ఆయన నిజమైన వేదాంతీ జ్ఞానీ అని తెలియచేస్తున్నది. చతుర్ధమూ ద్వాదశమూ మోక్షత్రికోణాలని మనకు తెలుసు. అంతేగాక ద్వాదశంలోని రాహువువల్ల,ఆయన మీద గల శనిదృష్టివల్లా ఇంకొక విషయం తెలుస్తున్నది. స్వామిది మామూలు వేదాంతజ్ఞానం కాదనీ ఇది యోగమార్గాలలో ఆయనకు గల సాధనవల్ల వచ్చిన అనుభవజ్ఞానం అనీ కుండలినీశక్తికి స్థానమైన వృశ్చికంలోని రాహువుమీదగల శని దృష్టివల్ల తెలుస్తున్నది. రాహుకేతువుల నీచస్తితివల్ల స్వామిది అల్పాయుష్షు అని అర్ధమౌతుంది.ఇదెలా సంభవమో ఇక్కడ చర్చించను.ఎవరైనా జిజ్ఞాసువులు అడిగితే  వారికి  మాత్రమే  చెప్పగలను.


నేటికీ హిందూమతం నిలిచి ఉన్నదంటే అది వివేకానందస్వామి చలవేనని నిస్సందేహంగా చెప్పవచ్చు.ఈనాటికీ వారు వీరు అని తేడాలేక,ప్రతి సాంప్రదాయ సాధువూ పొద్దున్న లేవగానే మొదటగా తలచి నమస్కరించవలసినది వివేకానందస్వామికి, అవతారమూర్తి అయిన శ్రీరామకృష్ణునికి అని నా అభిప్రాయం.అంతేకాదు ప్రతి హిందువూ చెయ్యవలసిన మొదటిపని ఇదే అని నేను దృడంగా చెప్పగలను.ఎందుకంటే చచ్చిపోవటానికి సిద్ధంగా ఉన్న భారతఆత్మను జీవంపోసి నిలబెట్టిన ఘనులు వీరు.భారతజాతి తరతరాలకూ వీరికి రుణపడి ఉంది అని నేను నమ్ముతున్నాను. 


4. పంచమస్థానంలో కుజుడు స్వక్షేత్రంలో బలంగా ఉండి, లాభస్థానం నుంచి లగ్నచతుర్దాదిపతి అయిన గురువుచేత చూడబడుతూ ఉండటం వల్ల, మంత్రసిద్ధీ ధ్యానసిద్ధీ కలిగి ఆధ్యాత్మికంగా అత్యున్నతస్థాయిని అధిరోహించగలిగాడు. సాక్షాత్తు భగవంతుని అవతారం అయిన శ్రీరామకృష్ణుని సహచరుడుగా లోకానికి వచ్చి,ధర్మాన్ని తిరిగి ప్రతిష్టించేపని చెయ్యగలిగాడు.మహత్తరము,ద్వంద్వాతీతము,దేవతలలోకములకంటే పైది, తేజోమయము అయిన సప్తఋషి మండలములో స్థిరనివాసం కలిగి ఈనాటికీ భాసిల్లుతూ ఉన్నాడు.మనస్సును ధ్యానసమాధిలో ఆఎత్తులకు లేపగలిగినవారికి ఈనాటికీ ఆయన దివ్యమైన దర్శనం కలుగుతుంది. అట్టి శక్తికలిగిన మహనీయులను నేను దర్శించాను,కలుసుకున్నాను.నా జీవితంలో అట్టివారితో నేను మాట్లాడగలిగాను.


(మిగిలిన వివరాలు రెండో భాగంలో---)