“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

4, జూన్ 2009, గురువారం

భగవాన్ రమణ మహర్షి జాతకం-2

అవతార మూర్తులు మరియు ఆధ్యాత్మిక మహనీయుల జాతకాలలో శని భగవానుని పాత్ర చాలా విస్పష్టంగా కనిపిస్తుంది. బహుశా దానికి కారణం శని కర్మకారకుడు కావటం మరియు గ్రహములలో చివరివాడు కావటం రవికి అతి దూరంగా ఉండటం కావచ్చు. అంతేగాక మానవాళి బాధలను తన బాధలుగా భావించగల సమర్థతను శనిభగవానుని లక్షణంగా చెప్ప వచ్చు.ఏకాంత వాసమును ఇష్టపడటం,తీవ్ర ఆలోచన,మౌన చింతన,సమాజానికి దూరంగా ఉండటం,ప్రపంచ ఆకర్షణలను తిరస్కరించగలిగే ధీరత్వం,వైరాగ్యం, నిరాడంబర జీవితం మొదలైనవి శని భగవానుని కారకత్వములు. శ్రీరామకృష్ణుని,వివేకానందుని, జాతకాలలో కూడా ఈవిషయం రూఢిగా కనిపిస్తుంది.


భగవాన్ రమణమహర్షి సాధన మొత్తం శనిదశలోనే సాగింది. ఆయనకు హఠాత్తుగా కలిగిన మరణానుభవం దానంతట అది కలిగింది కాదు.అది పూర్వజన్మ సాధనాఫలం.భగవద్గీతలో చెప్పినట్లు,సాధనాఫలితం ఎక్కడికీ పోదు.తరువాతి జన్మలలో కొనసాగుతుంది.అయితే అది ఈజన్మలో కనపడటానికి పదహారేళ్ళు ఎందుకు పట్టింది?

ఈ ప్రశ్నకు రజనీష్ సమాధానం చెప్పాడు.గతజన్మలో మిగిలినకర్మ ఒక రోజుకు,ఈజన్మలో దాదాపు ఏడుసంవత్సరాలు గడిస్తేగాని తీరదని ఆయనంటాడు. మరణసమయంలో సమయం నడిచే గతికి, బాల్యంలో సమయం నడిచే గతికి భేదం ఉంటుంది.బాహ్యంగా చూస్తె కాలం మామూలుగానే పరిగేడుతున్నట్లు కనిపిస్తుంది. కాని అనుభవ పరంగాచూస్తే కాలం వ్యక్తిగతం అనేది సత్యం.అవస్థను బట్టి కాలగతి మారుతుంది. వేచి చూస్తున్నవాడికి కాలం చాలా నెమ్మదిగా నడుస్తున్నట్లు అనిపిస్తుంది.ఇది అందరికీ అనుభవమే.నిజానికి,అనేక భూమికలలో అనేక time frames ఏకకాలంలో నడుస్తూ ఉంటాయి.ఇది మార్మికవిషయం కనుక ఇంతకంటే చర్చించబోవటం లేదు.

శ్రీ రామకృష్ణుని సాధనాదశ అంతా శని మహర్దశలోనే జరిగింది. అలాగే రమణమహర్షి సాధనాదశ కూడా శనిదశలోనే జరిగింది.దానికి కారణం వీరు ఇద్దరూ గురునక్షత్రాలలో జన్మించటం.యుక్తవయస్సు వచ్చేసరికి వీరికి శని దశప్రారంభం కావటం,సాధన మొదలు కావడం జరిగాయి.

శనిగ్రహం అంటే జనులలో భయభ్రాంతులు ఉన్నాయి.అవి పూర్తిగా నిరాధారములు.ఇంద్రియ వ్యామోహపరులను,మోసగాళ్ళను,ప్రపంచ లంపటులను శనిదశ నానాయాతనలు పెట్టటం నిజమే.కానీ,ఆయనకు మనమీద ఏమీ ద్వేషంలేదు.ఇక్కడ ఒక జ్యోతిషరహస్యం పరిచయం చేస్తాను.

మనిషి జీవితగతి దైవం నిర్దేశించినదారికి భిన్నంగా ఉంటే ఆ మనిషిని తిరిగి దారికితేవటం శనిభగవానుని పని.మనిషి ఇంద్రియదాసుడిగా జీవించి జంతువుగా మరణించటం ప్రకృతియొక్క ఉద్దేశంకాదు.ప్రకృతి పరిణామశీలం. మనిషి తనను తాను తెలుసుకొని అంటే ఆత్మసాక్షాత్కారం పొంది దైవత్వంలోకి ప్రవేశించాలి.ఇదే ప్రకృతి నియమం.ఈనియమానికి విరుద్ధంగా మనిషి జీవితం సాగుతుంటే శని భగవానుడు అనేక బాధలు పెట్టటంద్వారా అతనికి జ్ఞానోదయం కలిగించాలని చూస్తాడు.ఆయా బాధలు కూడా ఆ మనిషి తెలియనితనంతో చేసుకున్న కర్మఫలితాలే గాని శనిగ్రహం మనమీద కోపంతో పెట్టె బాధలు కావు. మనం చేసుకున్నదే మనం అనుభవిస్తాం.

కాని ఏ మనిషైతే కళ్లుతెరిచి ప్రకృతినియమాన్ని గ్రహించి తనకు తానుగా ఆత్మసాధనామార్గంలో ప్రయాణం చేస్తాడో అతనికి శనిభగవానుడు గొప్ప సహాయకారిగా ఉంటాడు.అంటే శనిదశలోనే ఆమనిషి తన జన్మసాఫల్యాన్ని పొందుతాడు. మనిషికి ఆత్మజ్ఞానాన్ని మించిన గొప్పలాభం ఇంకొకటి లేదు. అంతటి భాగ్యాన్ని కలిగించగల శక్తి శనిభగవానుని అధీనంలో ఉంది.

ఇది తెలియనిజనులు శని అంటె భయపడుతూ తైలాభిషేకాలు,పూజలు చేస్తుంటారు.కాని వారి జీవనవిధానాలు మాత్రం మారవు.ఒక పక్కశనికి పూజలుచేస్తూ,ఇంకోపక్క బీదవారిని,అభాగ్యులను చీదరించుకుంటూ, ఆత్మనిగ్రహంలేని మోసపూరితజీవితం గడుపుతుంటే ఉపయోగంలేదు.వారికి శాశ్వతఫలితం కలుగదు.శనిఅనుగ్రహం కలుగదు.ఎందుకంటే,శని ధర్మ స్వరూపుడు.ఒకమనిషి శనిని చూచి భయపడుతూ ఉన్నాడంటే అతను అధర్మపూరిత జీవితం గడుపుతున్నాడని అర్ధం.

రమణమహర్షి అరుణాచలం చేరిన మొదటిరోజులలో వెయ్యికాళ్ళ మంటపంలో కొన్నిరోజులు ఉన్నారు.తరువాత పాతాళలింగ నేలమాళిగలో దాదాపు ఆరువారాలపాటు స్పృహలేని సమాధిస్థితిలో ఉన్నారు.అప్పుడు ఆయనను పురుగులు కీటకాలు,జెర్రులు మొదలైనవి కుడుతూ ఉండేవి.అయినా ఆయనకు స్పృహ ఉండేది కాదు.ఆత్మానుభవంలో నిమగ్నుడై శరీరస్పృహకు అతీతుడై సమాధిలో మునిగి ఉండేవారు.అట్టిస్థితిలో  శేషాద్రిస్వామి అనే మహనీయుడు చూచి ఆయనను బయటకు తీయించి స్నానం చేయించాడు. శేషాద్రిస్వామి కూడా గొప్పయోగి,జ్ఞాని.ఆయన ఆశ్రమం అరుణాచలంలో రమణాశ్రమం పక్కనే ఉంది.రమణమహర్షిని మొదటగా అత్యంత మహనీయుడని గ్రహించినవాడు శేషాద్రిస్వామి.


ఈసంఘటనలు అన్నీ శని/రవి దశలో జరిగాయి.మహర్షి జాతకమున పంచమాదిపతి (మంత్ర స్థానం). మరియు చంద్రలగ్నాత్ నవమాదిపతి(ధర్మ స్థానం)గా శని ఆధ్యాత్మిక కారకత్వపరంగా చాలా బలంగా ఉన్నాడు.ఇక రవి విషయానికొస్తే ఆయన లగ్నాత్ నవమాదిపతి అయిన శుక్రనక్షత్రంలో ఉంటూ, విమ్శాంశలో గురుశుక్రుల చేత చూడబడుతూ ఉన్నాడు. పంచవర్గీయబలంలో ఎక్కువ బలం కలిగిన కుజునితో కలసి ఉన్నాడు. కుజుడు సుబ్రమణ్యస్వామికి జ్ఞానానికీ సూచకుడు.

సుబ్రమణ్యస్వామి జ్ఞానమనే శక్తిని(ఈటెను) చేత ధరించిన దండాయుధపాణి. కనుక 'నేనేవరు' అనే సూటియైన జ్ఞానమార్గసాధన ద్వారా రమణమహర్షి సిద్ధిని పొంది మహనీయుడైనాడు.ఇంతేగాక రవి గ్రహమండలానికి కేంద్రస్థానంలో ఉంటూ అన్నిగ్రహాలకూ వేడిమిని శక్తిని ప్రసాదిస్తూ ఆత్మ స్వరూపుడుగా విరాజిల్లుతున్నాడు.కనుక సహజంగా ఆత్మజ్ఞానానికి కారకుడు అవుతున్నాడు.ఈవిధంగా శనిరవిగ్రహములు మహర్షి సాధనాదశలో పనిచేసి అనుకూలపరిస్థితులను సృష్టించి ఆత్మసిద్ధికి కారకములు అయినవి. సాధనామార్గంలో కూడా గ్రహాల అనుకూల్యత ఉన్నప్పుడే ఫలితాలు కనిపిస్తాయి.నవగ్రహాలపరిధిని దాటి మనిషి జీవితం ఏ విషయంలోనూ, ఎన్నటికీ అతీతంగా పోలేదు.