'సాధ్యమైనదే సాధన' - జిల్లెళ్ళమూడి అమ్మగారి అమృతవాక్కు

25, మే 2009, సోమవారం

బోధి ధర్మ- ఓషో గారి పూర్వ జన్మలు


బోధి ధర్మ దాదాపు క్రీ. 530 ప్రాంతం లోని వాడు. ఓషో రజనీష్ బోధిధర్మ మీద ఇచ్చిన ఉపన్యాసాలలో తనకు బోధిధర్మకు వ్యక్తి గత పరిచయం ఉందన్న విషయాన్ని ప్రపంచానికి వెల్లడి చేసాడు. ఓషోకి సాధనా క్రమంలో తన పూర్వజన్మలు గుర్తుకు వచ్చాయి. విపస్సాన ధ్యానములో లోతులు అందుకున్న వారికి ఎవరికైనా పూర్వజన్మలు గుర్తుకు రావటం జరుగుతుంది.

గౌతమ బుద్ధుడు సమ్యక్ సంబోదిని పొందిన నాటి రాత్రి ఆయనకు తన 500 గతజన్మలు పూర్తి వివరాలతో సహా గుర్తుకు వచ్చాయి. అవే తరువాతి రోజులలో జాతకకథలుగా గ్రంధస్తం కాబడ్డాయి. అదే విధంగా ఓషోకి కూడా జరిగింది. కాని ఓషో తన పూర్వజన్మలు అన్నింటినీ వెల్లడి చేయలేదు. ప్రసంగవశాత్తూ కొన్నింటిని మాత్రం సందర్భానుసారంగా వివరించారు.

తాను బోధిధర్మతో కలసి రెండు మూడు నెలలు హిమాలయ పర్వతాలలో ప్రయాణం చేసానని ఆయన చెప్పాడు. అది బోధిధర్మ చైనాకు పోయేటప్పుడా లేక చైనా నుంచి వచ్చేటప్పుడా అనే విషయం ఆయన చెప్పలేదు. ఓషోని చూచి బోధిధర్మ ఆశ్చర్యపడ్డాడు. ఎందుకంటే రెండు మూడు నెలలు ఆయన బోధిధర్మతో ఏమీ మాట్లాడ లేదు. మౌనంగా ఉండి ప్రయాణం చేసాడు.

బోధిధర్మను అందరూ ఎన్నో సందేహాలు అడిగేవారు. ఓషో ఏమీ అడుగక పోవటం చూచి బోధిధర్మ అదే విషయం ఓషోని అడిగాడు. దానికి ఈయన " నాకేమీ సందేహాలు లేవు. మీకుంటే చెప్పండి. జవాబు చెబుతాను." అంటాడు. బోధిధర్మ ఆశ్చర్య చకితుడై ఈయనను తనతో కలసి రావలసిందిగా అడుగుతాడు. దానికి ఓషో నిరాకరించి తన మార్గం వేరే అని చెప్పి మంచుకొండలలో ఒక చోట శెలవు తీసుకొని తన దారిన ప్రయాణం కొనసాగించాడు.