Learn to live mindfully and meaningfully!

2, మే 2009, శనివారం

ఓషో ఉత్తరాలు -7


ప్రేమాశీస్సులు.
నీ ఉత్తరం వచ్చి చాలా కాల మైంది. నువ్వు శాంతి కోసం తపిస్తున్నానని వ్రాశావు. నేను మిగిలిన వారి కంటే వెనుకబడ్డాను అన్న భావన వదలి పెట్టు. ఎవరూ వెనుక పడి లేరు.

నీ
దృక్పదాన్ని అంతర్ముఖం గా తిప్పాలి. అంతే. వెంటనే నీటి బొట్టు సముద్రం అవుతుంది. నిజానికి నీటి బిందువుసముద్రం గానే ఉంది. కాని దానికి సంగతి తెలియదు. ఇంతే భేదం. ధ్యానపు లోతులలో కలిగే శూన్యత తో భేదంతొలగి పోతుంది. జీవిత సాధనలో ముఖ్య మైన విషయం ధ్యానం.

నీ ఆలోచనా తరంగాలు క్రమేణా వేగం తగ్గుతాయి. వాటి స్థానంలో శాంతి, శూన్యతా వస్తాయి. ఎప్పుడైతే ఆలోచనలుపూర్తిగా మాయం అవుతాయో, అప్పుడు సాక్షి దర్శనం ఇస్తుంది. వెంటనే అంతః చేతన మాయం అవుతుంది. అంతఃచేతనే అన్ని బంధాలకూ కారణం. మొదట్లో ఇది రాయిలా కఠినం గా కనిపిస్తుంది. కాని ఓర్పుతో అభ్యాసం కొనసాగించేసాధకునికి ఒకరోజు తెలుస్తూంది. తను రాయి అనుకునేది ఒక కల అని, ఉఫ్ అని ఊదితే ఎగిరి పోతుంది అని.

నీ ధ్యానం అనే విత్తనం సమాధి పుష్పం గా వికసించు గాక.
అందరికీ నా ఆశీస్సులు.
మిగిలింది మనం కలిసినపుడు మాట్లాడుదాము.

ఈ ఉత్తరంలో ఓషో గారు గూఢమైన ఉపనిషత్ వాక్యాలను తేలిక భాషలో చెబుతారు. నీటి బొట్టు అంటె సాధకుడు. సముద్రం అంటె ఆత్మ. నిజానికి సాధకుడు ఆత్మ కంటే భిన్నుడు కాదు. కాని ఆ విషయం అతని స్పృహలో లేదు. ఈ మరుపుకు కారణం అజ్ఞానం.

ఉపనిషత్తులు ఇదే విషయాన్ని అనేక రూపాలలో చెబుతాయి. ఎపుడైతే మనసు అంతర్ముఖం అవుతుందో ఈ అజ్ఞానంతొలగి స్వస్వరూప జ్ఞానం కలుగుతుంది. అపుడు తాను వెతుకుతున్న ఆత్మ తానె అన్న అనుభవం కలుగుతుంది. దీనినే వేదములు తత్వమసి, అయమాత్మా బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి వంటి మహా వాక్యాలలో చెప్పాయి. దీనినే ఓషో గారు నీటి బిందువు సముద్రం ఒకటే అని తేలిక భాషలో చెప్పారు.

ఈ అనుభవం కలుగ డానికి
తన మనసే ముఖ్య అడ్డంకి. మనసులో ఎన్నో జన్మలనుంచీ గూడు కట్టు కొని ఉన్నసంస్కారములు ఈ జ్ఞానాన్ని కప్పి ఉంచు తున్నాయి. ఈ సంస్కారములు అంతః చేతన అనబడే మనసు లోపలి పొరలలో ఉంటాయి. ఈ అంతః చేతన అనేది దాట రాని రాయిలా సాధకునికి కనిపిస్తుంది. కాని పట్టుదలగా సాధనచేసేవానికి ఈ అడ్డంకి తొలగి ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది.

నీటి కోసం భూమిలో బోరింగు వేసే టపుడు రాతి పొరలు అడ్డు తగులుతాయి. రాళ్ళు మట్టి బూడిదా వస్తుంటాయి. నీరు ఉందా లేదా అనే అనుమానం కలుగుతుంది. కాని ఇంకా లోతులకు తవ్వకం సాగిస్తే చివరకు నీటి ఊట కనిపిస్తుంది. సాధన కూడా చాలావరకూ ఇటువంటిదే. అంతః చేతనలో గల సంస్కారములు అనే రాతి పొర అడ్డు తగిలినపుడు నిరాశ పడకుండా పట్టుదలగా ప్రయత్నం చేయాలి. ఈ దశ దాటటం కష్టం. కాని నిరాశపడి ఇంతటితో ఊరుకుంటే సాధన అక్కడే ఆగిపోతుంది.

ధ్యానం అనే విత్తనం మొక్కగా పెరిగి సమాధి అనబడే దివ్యానుభావపు పుష్పం గా వికసించుగాక అనే ఆశీర్వచనాన్ని తనశిష్యునికి ఒషోగారు చివరలో ఇస్తారు. ఇది ఒక అద్భుతమైన భావన. శిరస్సు పైన కల సహస్ర దళ పద్మం వికసించటం అనే గూఢ మైన యౌగిక భావన ఇందులో అంతర్భాగం గా ఇమిడి ఉన్నది.

సరళమైన తన ఉత్తరంలో నిగూఢమైన వేదాంత, యౌగిక భావనలు ఇమిడ్చి ఈ ఉత్తరాన్ని రజనీష్ వ్రాశారు.