Our Ashram - A beacon light to the world

12, ఏప్రిల్ 2009, ఆదివారం

క్రియా యోగం


ప్రపంచాన్ని ఒక ఊపు ఊపి, లక్షలాది మంది జీవితాలను మార్చిన గ్రంధాలలో "Autobiography of a Yogi" ఒకటి. దీనిని వ్రాశిన పరమహంస యోగానందగారు, యుక్తెస్వర్ గిరిగారి శిష్యుడు. ఆయన లాహిరీ మహాశయుల శిష్యుడు. లాహిరీ మహాశయుడు బాబాజీగారి శిష్యుడు.బాబాజీ అనే మహనీయుడు రెండువేల సంవత్సరాల నుంచి బ్రతికి ఉన్నాడంటారు. ఈయన నివాసస్థలం హిమాలయాలలోని తెహ్రీ ఘర్వాల్ ప్రాంతం. ఈయన ఈనాటికీ అదృష్టవన్తులకు కనిపిస్తూ ఉంటాడు. ఈయనకు కాలం దూరంతో సంబంధం లేదు. కాంతి శరీరంతో ఎక్కడైనా ప్రత్యక్షం కాగలడు.

భగవానుడు సూర్యునికి నేర్పిన యోగం కాలక్రమేణా క్షయమై పోగా, నవీన కాలంలో దీనిని తిరిగి ఉద్దరించిన మహాత్ముడు బాబాజీ. దీనినే క్రియాయోగం అని అంటారు. దీనిని గురుముఖతః నేర్చుకోవాలి. దీనిని బాగా అభ్యాసం చేస్తే 12 సంవత్సరాలలో భగవత్ దర్శనం పొందటానికి అనువుగా శరీరాన్ని తయారు చేస్తుంది.

క్రియాయోగంలో ముఖ్య మైన అంశం క్రియాకుండలినీ ప్రాణాయామం. దీనిని అభ్యాసం చెయ్యటం ద్వారా వెన్నెముకలో గల నాడులు, చక్రములు ఉత్తెజితములై సాధకునికి ఓంకారనాదం వినబడుతుంది. భ్రూమద్యంలో వెలుగు కనిపిస్తుంది. శరీరంలోగల అన్ని ప్రాణనాడులు ఉత్తేజాన్ని పొందుతాయి.


క్రియా యోగంలో అయిదు మెట్లు ఉన్నాయి. మొదటి క్రియాదీక్షతోనే చాలా వరకు సాధన జరుగుతుంది. సాధకుని పురోగతిని బట్టి తరువాతి దీక్షలు ఇవ్వబడుతాయి. కొందరికి పరమ గురువుల దర్శనం కలుగుతుంది. వారి ద్వారానే తరువాతి దీక్షలు ఇవ్వ బడవచ్చు.

క్రియాయోగంలోని మొదటిదీక్షలో ముఖ్యమైన అంశాలు. తాలవ్యక్రియ ,ఖేచరీముద్ర, చక్రజపం, క్రియాకుండలినీ ప్రాణాయామం, నాభిక్రియ మరియు షణ్ముఖీముద్ర. వీనికి సోహం జపం మరియు ఆజ్ఞాచక్రధారణ అనేవి సహాయ కారులు. మహాముద్ర మరియు శాంభవీముద్ర అనేవి ముఖ్యమైన అంగములు.

ఈ క్రియలను చక్కగా అభ్యాసం చేయడంవల్ల మనిషి ముఖంలో తేజస్సు పెరుగుతుంది. కళ్ళలో కాంతి కలుగుతుంది. స్వభావంలో నిర్మలత్వం కలుగుతుంది. సాధనాక్రమంలో ఓంకారనాదం వినవచ్చు. అయిదు అంచులు గల నక్షత్రాన్ని దానిమధ్యలో తెల్లనిచుక్కను భ్రూమద్యం లోచూడవచ్చు. ఆ చుక్క ద్వారా ఆవలికి ప్రయాణిస్తే అతీతలోకాలలోనికి ప్రయాణం చెయ్య వచ్చు.

ఈ సాధన ఓంకారనాదానుసంధానం ద్వారా సాధకుని సవికల్ప నిర్వికల్ప సమాధి స్తితులలోకి తీసుకు వెళుతుంది. మహనీయుల దర్శనాలు, పూర్వ జన్మ జ్ఞానం, దూర శ్రవణం, దూర దర్శనం వంటి సిద్ధులు దారిలో వాటంతట అవే కలుగుతాయి.

కాని ఈ సాధనలో కొన్ని ప్రమాదాలున్నాయి. అహంకారం పెరగటం వీటిలో ఒకటి. నాకు చాలామంది క్రియాసాధకులు తెలుసు. వీరిలో అహంకారం విపరీతంగా పెరగటం నేను గమనించాను. వారి సంస్కారాల్లో పెద్ద మార్పులు రాకపోవడమూ గమనించాను.దానికి కారణాలున్నాయి. వీరు క్రియాసాదనను చివరి వరకూ కొనసాగించినవారు కారు. కనుక వీరి స్తితి ఇలా ఉంటుంది. కొంత ధ్యానపు లోతులు వీరికి అందుతాయి. కాని చాలామంది అక్కడే చతికిలబడతారు. అందుకే వీరి కారణశరీరంలో శుద్ధి కలుగదు. ఇలాంటి ప్రమాదాలు చాలా ఈ మార్గంలో ఉన్నాయి.

ఏ యోగమార్గమైనా ప్రమాదాలతో కూడుకున్నట్టిదే. అందుకే సమర్ధుడైన గురువు అవసరం క్షణక్షణమూ యోగంలో ఉంటుంది. గురువు సహాయం లేనిదే యోగసాధన చెయ్యబోవడం విషసర్పాలతో చెలగాటమే అని చెప్పవచ్చు. కుండలినీశక్తిని సర్పంతో పోల్చడంలోని రహస్యం కూడా ఇదే. సరిగ్గా చెయ్యకపోతే ఈ సాధన పాముతో చెలగాటం లాంటిది. నిర్లక్ష్యంగా అహంకారంతో సాధన సాగిస్తే దాని కాటుకు సాధకుడు బలి అవక తప్పదు. కాటు పడిందన్న విషయం కూడా సాధకునికి చాలాకాలం తెలియదు. ఇలాంటి ప్రమాదాలు ఇందులో చాలా ఉన్నాయి. మచ్చుకు ఒక్కటి మాత్రం నేను ప్రస్తావించాను.