'మనిషి స్వతంత్రుడు కాడు. తన కర్మ చేతిలో బానిస'

22, మార్చి 2009, ఆదివారం

ఓషో ఉత్తరాలు -4

నమస్కారములు. ప్రేమతో నీవు వ్రాసిన ఉత్తరానికి నేను కృతజ్ఞుడను. నీవు ధ్యానము చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ధ్యానములో దేన్నో సాదిద్దామనే ఆలోచనను వదలిపెట్టు. ఊరకే సహజంగా చెయ్యి. ఏదో ఒకరోజున జరగవలసింది సహజంగా అదే జరుగుతుంది. ప్రయత్నం ధ్యాన స్థితిని తెచ్చి పెట్టదు.
నిజానికి ప్రయత్నం పెద్ద అవరోధం. ప్రయత్నంలో, సాధనలో ఒక టెన్షన్ ఉంది. ఆశైనా సరే, చివరికి అది శాంతి కోసం ఎదురుచూపు అయినా సరే, ఒక విధమైన కలవరాన్ని మోసుకొస్తుంది. టెన్షన్ పోవాలి. ఎప్పుడైతే ఇది జరుగుతుందో, ఒక దివ్య శాంతి దిగివస్తుంది.
నేను చేస్తున్నాను అనే భావం వదలి పెట్టు. దాని బదులుగా, ఏదైతే ఉందొ దాని చేతులలో నన్ను నేను అర్పించుకుంటున్నాను అనుకో. శరణాగతి పొందు. పూర్తిగా అర్పింపబడు. నువ్వు ఇది చేయగలిగితే వెంటనే శూన్య స్థితి అందుకుంటావు.
శరీరం, శ్వాస తేలిక అవుతున్నాయి అని వ్రాశావు. మంచిదే. ఇదే స్థితి మనసుకు కూడా కలుగుతుంది. మనసే పూర్తిగా అదృశ్యమైతే ఎం జరుగుతుందో చెప్పలేము. ఇది మీకిద్దరికీ త్వరలోనే అనుభూతి కలుగుతుంది. ఊరకే, సహజంగా, ఎదురుచూపూ లేకుండా ధ్యానం చెయ్యండి. త్వరలో నేను అక్కడకు వస్తాను. అంతవరకు నేను చెప్పిన దాన్ని మౌనంగా అభ్యాసం చెయ్యండి.
అందరికీ నా నమస్కారములు. తోచినపుడు ఉత్తరం వ్రాయండి. నామటుకు నేను పూర్తి ఆనందంలో ఉన్నాను.