"Oh ! Ego, the spoiler of life !"

20, మార్చి 2009, శుక్రవారం

ఓషో ఉత్తరాలు -2

ప్రేమాశీస్సులు. నేను ఆనందంలో ఉన్నా.ఉత్తరం వ్రాద్దామని రోజూ అనుకుంటున్నా. కాని అనేకపనుల వల్ల వ్రాయలేకపోయా. నా ఆశీస్సులు మాత్రం ప్రతిరోజూ పంపుతూనే ఉన్నా.

జీవితమే ఒక సాధన. నువ్వెంతగా దానిలో నిమగ్నమైతే అంత దివ్యంగా అది మారుతుంది. చీకటిలో వెలుగు దాగుంది. సత్యం కూడా దాగుంది. కనుకనే అన్వేషణలో ఆనందం ఉంది.

ఒక ఋషి మాటలు నాకు గుర్తొస్తున్నాయి. "హిరణ్మయేన పాత్రేన సత్యస్యాపి హితం ముఖం". సత్యం ఒక బంగారుపళ్ళెంతో మూయబడింది. సత్యాన్ని మూసి ఉంచుతున్న బంగారు పళ్ళెం మన మనసే. మనసు మనల్ని మూసింది. దానిలో మనం ఉన్నాం. దానితో మమేకం అయ్యాం. కనుకే బాధ మనల్ని వెంటాడుతుంది. బంధాలు, దానితో పునర్జన్మలు అన్నీ వరుసగా వొస్తాయి.

దానికి అతీతుడవు కా. దాని నుంచి నువ్వు వేరు. అది తెలుసుకో. ఇదొక్కటే ఆనందాన్ని తెస్తుంది. ఇదే స్వతంత్రం. ఇదేజనన మరణాలకు తుది. మనం నిజంగా ఏదో అదిగా ఉండాలి. ఇదే అసలైన సాధన. కోరికలతో జీవించి జీవించి విసుగుచెందితే, ఆ విసుగు నుంచే సాధన పుడుతుంది.

కోరికను గమనించు. దీన్నించి వైరాగ్యం పుడుతుంది. దాని కోసం వెదుకకు. కోరికను గమనించటం నుంచి వైరాగ్యం అదేవస్తుంది. మనలో ప్రతి ఒక్కరు కోరికలను గమనించాలి. అలా గమనిస్తూ ఉండు. ఏ పనినీ ఎరుక లేకుండా చెయ్యకు.

ఇది నీకు గుర్తుంటే, ఒక రోజు, పూర్తిగా కొత్తదైన ఒక విప్లవం నీలో కలుగుతుంది. నీ చైతన్యంలో కలుగుతుంది. భగవంతుడు నిన్ను ఈ మార్పు వైపు నడుపుతున్నాడు. ఇది నాకు నిశ్చయంగా తెలుసు.