"Oh ! Ego, the spoiler of life !"

17, మార్చి 2009, మంగళవారం

లావో జు-జీవితం-తత్త్వం


తావోఇజం మూల పురుషుడు లావో జు. ఇతడు క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దంలోచైనాలో ఉన్నట్లు తలుస్తారు. అసలు ఇతడు చారిత్రిక వ్యక్తియా కాదా అనేవిషయం పైన అనేక సందేహాలున్నాయి. కొందరు లావో జు అనేవాడు కల్పిత వ్యక్తిఅంటారు.

కాని అలాన్ వాట్స్ మొదలైన పండితులు అతడు తప్పక జీవించాడనేనమ్మారు. కొందరు ఇతని జీవిత కాలం క్రీ పూ నాలుగవ శతాబ్దం అంటారు. ఏదేమైనా చైనీయుల తత్వ శాస్త్రాన్ని జీవన విధానాన్ని అమితంగా ప్రభావితంచేసిన వ్యక్తి లావో జు అని చెప్పవచ్చు.

చాలామంది భావన ప్రకారం లావో జు చక్రవర్తి గ్రంధాలయం లో అధికారి గా ఉండేవాడు. అప్పుడు ఎల్లో ఎంపరర్ అనబడేహువాంగ్ టి రాజ్య పాలన చేసేవాడు. లావోజు తత్వ శాస్త్రంలో, మార్మిక విషయాలలో, జ్యోతిర్ విజ్ఞానంలో పండితుడు. రోజురోజుకూ క్షీణిస్తున్న న్యాయాన్ని ధర్మాన్ని చూచి విసుగు
చెంది ఎనభై ఏళ్ల వయసులో లావోజు భారతదేశపు సరిహద్దుగుండా చైనాను విడిచి పెట్టాడు. అతడు ఒక రైతు వేషంలో సరిహద్దు దాటి పోదామని ప్రయత్నించినాడు.

సరిహద్దులో కాపలా అధికారిగా ఉన్న యింగ్ జి అనేవాడు లావోజు మారువేషాన్ని కనిపెట్టాడు. ఇంగ్ జి అనేవాడుకూడా జ్యోతిస్సాస్త్రంలోనూ, గుప్త విద్యలలోనూ అభిరుచి గలవాడు. ఇతడు లావోజు ను అడ్డగించి ఒక షరతు పెట్టాడు. లావోజు తన జ్ఞానాన్ని అంతా ఒక పుస్తక రూపంలో వ్రాసి ఇస్తేనే సరిహద్దు దాటి పోనిస్తానని చెప్పాడు. తప్పని స్థితిలోలావోజు మూడు రోజులలో 5000 చైనా అక్షరాలతో " టావో టే చింగ్" అనే తన గ్రంధాన్ని వ్రాసాడని చెప్తారు.

టావో టే చింగ్ అనే గ్రంధం లావోజు సిద్ధాంత సారం. ఇందులో టావో అనే విషయం మనకు దర్శనమిస్తుంది. టావో అంటేప్రపంచాన్ని నడుపుతున్న అమరిక. దీన్ని ధర్మం అని లేక మన వేదాంతము చెప్పే బ్రహ్మం అని తలచవచ్చు. టావోఅనే పదం లావో జి కంటే ముందరి వాడైన షేన్ టావో వ్రాతలలో మనకు దర్శనమిస్తుంది.

టావో టే చింగ్ ముఖ్య విషయం వూ-వె. అనగా అకర్మక ఒప్పుదల Passive Acceptance . ప్రకృతికి వ్యతిరేక దిశలోపోవటం ద్వారా మనిషి ఏమీ సాధించలేడు. కనుక ప్రక్రుతి విధానాలు గమనించి దానితో మమేకం కావటమే టావో ను చేరేమార్గం. టావో అనే నియమం ప్రపంచాన్ని నడుపుతున్నది. మనిషి చేయవలసింది దానితో మమేకం కావడమే. దీనికోసంతన్ను తానూ మరచి పోవాలి. తను ఏదైతే జ్ఞానం అనుకుంటున్నాడో అదే తావోను చేరకుండా చేసే ప్రతిబంధకం.

పదములు, భాష వల్ల మనిషి ప్రతిదాన్ని విడివిడిగా చూస్తాడు. దానితో జ్ఞానం పొందుతాడు. ఇష్టా ఇష్టాలు ఏర్పడుతాయి. దీని ద్వారా తానూ కూడా ముక్క ముక్కలవుతాడు. నామ రూపములను విస్మరించడం ద్వారా మనిషి తన స్వల్పజ్ఞానమును అధిగమించి తావోతో అనుసంధానం కాగలడు. దీని కి మార్గం కర్మ కాదు. అకర్మ మాత్రమె మనిషిని తావోతోకలుపుతుంది.

లావోజు ఏనాడూ శిష్యులను చేర్చుకోలేదు. తన సిద్ధాంతాలను ఎవరికీ చెప్పలేదు. చివరిలో మాత్రం టావో టే చింగ్వ్రాసాడు. ఇది కూడా చాలావరకు మార్మిక భాషలో ఉంది. పై పైన చదివితే అర్థం కాదు. ఇతని అనుచరుడైన చువాంగ్ చు, తావోను గురించి ఇలా వ్రాసాడు.

మూలమే సారం ,అన్నీ స్తూలమైనవి
కూడబెట్టటం లేమి ,ఒంటరిగా ప్రశాంతంగా
తెలివితో ఉండటం , ఇదే ప్రాచీనులు తావోను చేరిన దారి.

లావోజు దృష్టిలో మనిషి, అతని జ్వరపీడిత మనస్సు, సర్వ అనర్థాలకు కారణం. మనిషికల్పించుకోకుండా ఉంటే సర్వం సరిగా ఉంటుంది. అందుకే మనిషిని లోక వెంటపరిగెట్టటం ఆపి తన సహజ స్థితి ఐన తావోలో స్థిరంగా ఉండమని చెప్తాడు. ఇతడు తనబోధనలను విరుద్ధ పదాలలో చెప్పాలని చూచాడు. ఎందుకంటే సత్యం మాటలకు అతీతమైంది. కనుక విరుద్ధ పదాలతోనేదాన్ని సూచించడం సాధ్య మైతుంది.

చూడు. అది చూపు కందదు.
విను. అది వినబడేది కాదు.
ఊహించు. అది ఊహకందదు
మూడూ ఒకటే. అవి అందేవికావు.

పైనుంచి అది కాంతి కాదు క్రిందనుంచి అది చీకటీ కాదు.
వివరణకు అందని సూత్రం. అది శూన్యంలో అంతమైతుంది.
రూపరహిత రూపం. చాయారహిత చాయ
అది అనిర్వచనీయం, అమనస్కం.

దాన్ని ముందు నిలబడు, దానికి ఆది లేదు
దాన్ని అనుసరించు, దానికి అంతం లేదు.
తావోతో ఉండు, వర్తమానంలో జీవించు
ప్రాచీన మొదలు ను తెలుసుకో- ఇదే టావో సారం.

ఏమీ చేయకుండానే అంతా చెయ్యవచ్చు. ఇంట్లో కూచుని ప్రపంచం చుట్టి రావచ్చు.
టావో అకర్మలొ ఉంది. కాని అంతా చేస్తుంది.
రాజులు దీన్ని తెలుసుకుంటే పదివేల పనులు అవే జరుగుతాయి.
వారింకా చేయాలనుకుంటే అరూప సహజత్వానికి తిరిగి పోవాలి.
రూపం లేక కోరిక లేదు కోరిక లేకపోతె ప్రశాంతత
అన్నీ సహజ స్థితిలో ఉన్నాయి.

తావోఇస్టు జ్ఞానికి కోరికలు లేవు (అసలు ప్రయత్నం చెయ్యడు)
కనుక అతడు ఎప్పుడూ ఓడిపోడు .ఓడని వాడు ఎప్పుడూ గెలుస్తాడు
ఎప్పుడూ గెలిచే వాడు శక్తి వంతుడు.

దీనినే ఒక్క మాటలో వు-వే అంటారు. వు అనగా లేకుండుట. వె అనగా కర్మ. అనగా ఏమీ లేని శూన్య స్థితి నుండిఉద్భవించే కర్మ. దీనిని spontaneous action అంటే మన నవీనులకు సరిగా అర్థమైతుంది. సూత్రం నుండి నాలుగువీర విద్యలు పుట్టాయి.

అవి ఐకిడో, టైజి క్వాన్, హాప్కిడో, హ్వరాంగ్ డో. చైనీయుల తావోఇస్ట్ కుంగ్ ఫూ నే తైజి క్వాన్లేదా తాయి ఛి అంటారు. దీనికి ఆద్యుడు మాస్టర్ సాన్ ఫెంగ్. విద్య మొత్తం తావోఇస్టు సిద్చాంతమైన వు-వె టెక్నిక్స్తో నిండి ఉంటుంది. తానేమీ చేయకుండా ప్రత్యర్ధి బలాన్ని తిరిగి అతని పైకే తిప్పటం వీటిలో ముఖ్య సూత్రం. ఐకిడో విద్యజపనీయులది. మిగిలిన రెండూ కొరియా యుద్ధ విద్యలు. ఇవి అన్నీ వు-వె భావనతో పరిపుష్టం కాబడినవి.

టావో భావనలు మన అద్వైత వేదాంతానికి చాలా దగ్గరివి. అద్వైతాన్ని అధ్యయనం చేసిన వారికి టావో భావనలు తేలికగాఅర్థమైతాయి. మనం బ్రహ్మము అన్నదాన్నే వారు టావో అన్నారు. అష్టా వక్ర సంహిత, జ్ఞాన వాసిష్టము,అపరోక్షానుభూతివేదాంత పంచదశి మొదలైన గ్రంథాలు చదివితే టావో టే చింగ్ చదువుతున్నట్లే అనుభూతి కలుగుతుంది.

నేను 1998 లో పూనాలోని కోరేగావ్ పార్కులో ఉన్న ఓషో గారి ఆశ్రమంలో వారం ఉన్నాను. అక్కడ ఓషో గారునివశించిన కాటేజీ పేరు " లావో జు హౌస్". ఓషో గారు లావోజు ను అమితంగా అభిమానించే వారు. అందుకే తన ఇంటికి పేరు పెట్టారు. నేను అక్కడ ఉన్న రోజుల్లో ఓషో గారి అమెరికన్ శిష్యులతో స్నేహం కలిగింది. వారిలో ఒకరిద్దరు ఐకిడోమరియు తాయి ఛి విద్యలలో ప్రవీణులు. ఆశ్రమంలోపల క్లాసులు కూడా జరుగుతాయి. ఇప్పుడు ఉన్నాయో లేదోనాకు తెలియదు.

ప్రాచీన తావోఇస్టు మూలాలు మనవైన సిద్ధ సాంప్రదాయంలో ఉన్నాయి. గాధలు ఇతర వ్యాసాలలో చూద్దాం. వు-
వె నుంచి పుట్టిన వీర విద్యలను ఇతర వ్యాసాలలో పరిశీలిద్దాం.